Haryana Vs Jharkhand: దేశవాళీ క్రికెట్ టోర్నీలలో సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీకి ప్రత్యేక చరిత్ర ఉంది.. ఈ ట్రోఫీ పూర్తిగా టి20 ఫార్మాట్లో జరుగుతుంది. పైగా ప్లేయర్లు జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి హోరాహోరీగా పోరాడుతుంటారు.. అయితే ఈసారి కూడా అదే విధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరిగింది. ఫైనల్ లోకి జార్ఖండ్, హర్యానా వెళ్లాయి. ఫైనల్ మ్యాచ్ మహారాష్ట్రలోని పూనే స్టేడియంలో జరిగింది.
ముందుగా జార్ఖండ్ బ్యాటింగ్ చేసింది.. జార్ఖండ్ జట్టు తరుపున ఓపెనర్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. 49 బంతుల్లోనే పది సిక్సర్లు, ఆరు ఫోర్ల సహాయంతో 101 పరుగులు చేశాడు.. విరాట్ సింగ్ (2) విఫలమైనప్పటికీ, కుశాగ్రా (81), అనుకూల్ రాయ్(40), రాబిన్ మింజి (31) సత్తా చాటారు. తద్వారా జార్ఖండ్ జట్టు 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 262 పరుగుల భారీ స్కోర్ చేసింది. హర్యాన జట్టులో అమిత్ మూడు ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చాడు. మిగతా బౌలర్లు కూడా దారుణంగానే పరుగులు ఇచ్చారు. మూడు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన జార్ఖండ్.. రెండో వికెట్ కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కుశాగ్ర, ఇషాన్ దీటుగా బ్యాటింగ్ చేయడంతో ఇదంతా సాధ్యమైంది.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన హర్యానా జట్టు 18.3 ఓవర్లలో 193 పరుగులకు ఆల్ అవుట్ అయింది. హర్యానా జట్టులో యశ్వర్ధన్ (53) హాఫ్ సెంచరీ చేశాడు. నిశాంత్ (31), సమంత్(38) పరుగులు చేశారు.. అర్జ్ రంగ(17), కెప్టెన్ అంకిత్ కుమార్ (0), ఆశిష్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఝార్ఖండ్ జట్టులో సుశాంత్ మిశ్రా మూడు వికెట్లు, బాలకృష్ణ మూడు వికెట్లు సాధించారు. వికాస్ సింగ్, అనుకూల్ రాయ్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
వాస్తవానికి ఫైనల్ మ్యాచ్లో అందరి అంచనాలు హర్యానా జట్టు మీదనే ఉన్నాయి. కాకపోతే జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మరికొద్ది నెలలో టీమిండియా వేదికగా టి20 వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో ఇషాన్ కిషన్ ఆటతీరు ప్రాధాన్యం సంతరించుకుంది. డొమెస్టిక్ క్రికెట్ ఆడే వాళ్లకు ప్రయారిటీ ఇస్తామని మేనేజ్మెంట్ చెప్పిన నేపథ్యంలో.. కిషన్ కు జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం.