J&K Attack: ఆర్మీ వేషంలో వచ్చి.. పర్యాటకుల బస్సు పై కాల్పులు.. రియాసిలో ఉగ్రవాదుల ఘాతుకం..

J&K Attack: JK 02 AE 3485 అనే నెంబర్ గల బస్సు 45 మంది యాత్రికులతో జమ్మూలోని శివకోడి ప్రాంతానికి బయలుదేరింది. అక్కడ వారు పూజలు చేసిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు..

Written By: Anabothula Bhaskar, Updated On : June 10, 2024 10:10 am

Reasi bus accident

Follow us on

Jammu and Kashmir: వారంతా పర్యాటకులు. అందరూ దగ్గరి వాళ్లే. ఒక బస్సు కిరాయికి మాట్లాడుకొని జమ్మూ డివిజన్లోని రియాసీ జిల్లాలోని ప్రసిద్ధ శివాలయం శివ ఖోడి ని సందర్శించి.. తిరుగు ప్రయాణమయ్యారు. బస్సులో ఉన్న వారిలో కొంతమంది మగత నిద్రలోకి జారుకోగా.. మరి కొంతమంది హిమాలయ అందాలను ఆస్వాదిస్తున్నారు. సాఫీగా సాగిపోతున్న వారి ప్రయాణంలో అనుకోని కుదుపు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోగా బస్సు లోయలో పడిపోయింది. 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. 33 మంది గాయపడ్డారు. ఇదేదో ప్రమాదవశాత్తు జరిగింది కాదు.. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఘాతుకం వల్ల జరిగింది. ఆదివారం సాయంత్రం దేశం మొత్తం కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకార హడావిడిలో మునిగి ఉండగా.. ఈ ఘటన జరిగింది.

Also Read: Union Cabinet : కేంద్రంలో తొలిసారి ఐదుగురు తెలుగు మంత్రులు… బంగారు అవకాశాన్ని ఎలా వాడుకుంటారో ?

JK 02 AE 3485 అనే నెంబర్ గల బస్సు 45 మంది యాత్రికులతో జమ్మూలోని శివకోడి ప్రాంతానికి బయలుదేరింది. అక్కడ వారు పూజలు చేసిన అనంతరం తిరుగు ప్రయాణమయ్యారు.. బస్సు పౌని – శివ్ ఖోడి మధ్యలో ఉన్న కంద త్రయాత్ ప్రాంతంలోని చండీ మోడ్ దగ్గరికి రాగానే ఆర్మీ దుస్తులు ధరించిన ఉగ్రవాదులు బస్సు ముందుకు ఆకస్మాత్తుగా వచ్చారు. కాల్పులు జరిపారు. దీంతో బస్సు డ్రైవర్ తప్పించుకునే క్రమంలో పక్కకు మళ్లించాడు. అసలే దుర్భేద్యమైన రోడ్డు కావడంతో పక్కన ఉన్న 200 అడుగుల లోతులో ఉన్న లోయలోకి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది పర్యాటకులు అక్కడికక్కడే చనిపోయారు.. మిగతా వారంతా తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బస్సులో నుంచి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సు లోయలో పడిపోవడంతో చాలామంది మృత దేహాలు అందులోనే ఉన్నాయి.. “ఆర్మీ వేషం లో ఉన్న ఉగ్రవాది అకస్మాత్తుగా బస్సు ముందుకు వచ్చాడు. కాల్పులు జరిపాడు. తప్పించుకునే క్రమంలో డ్రైవర్ బస్సును పక్కకు తిప్పాడు. అక్కడ ఒక పెద్ద లోయ ఉండడంతో బస్సు అందులోకి దూసుకెళ్లింది. ప్రయాణికులు అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించామని” ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.

Also Read: JP Nadda : నడ్డాకు కేంద్ర మంత్రి పదవి : బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా ?

గతంలో జమ్మూ డివిజన్లోని కత్రా ప్రాంతంలో ఓ బస్సు పై ఉగ్రవాదులు ఇలాగే దాడులు జరిపారు.. 2022, మే 13న ఈ ఘటన జరిగింది.. కత్రా ప్రాంతం నుంచి తిరిగి వస్తున్న పర్యాటకుల బస్సు ప్రయాణిస్తున్న మార్గంలో బాంబు పేల్చి దాడులకు పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు పర్యాటకులు మృతిచెందగా, 24 మంది గాయపడ్డారు. రాజోరి – పూంచ్ లోనూ ఇలాగే కాల్పులు జరిపారు.. రియాసి ఘటన నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు..” రియాసీ ప్రాంతంలో యాత్రికులపై ఉగ్రవాది కాల్పులు జరపడం అత్యంత దారుణం. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వం తరఫున సాయం అందిస్తాం. గాయపడిన వారిని ఆదుకుంటాం. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితులలోనూ వదిలిపెట్టం. అంతకంతకూ బదులు తీర్చుకుంటామని” రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.