Union Cabinet : 2014లో సంపూర్ణ మెజారిటీ, 2019లో అంచనా వేయలేని ఆధిపత్యం.. ఫలితంగా బిజెపికి భాగస్వామ్య పార్టీల అవసరం పడలేదు. అందువల్ల మోదీ చెప్పిన వారికే మంత్రి పదవులు దక్కాయి. కానీ, 2024 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. బిజెపి అంచనా వేసిన సీట్లు రాలేదు. ఫలితంగా భాగస్వామ్య పార్టీల అవసరం పడింది. ఇలాంటప్పుడు మోదీ చెప్పింది కుదరదు. భాగస్వామ్య పార్టీలు అడిగిన మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. పైగా ప్రాంతాల సమతూకం పాటించాల్సిందే. ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన కారణంగా నిలిచింది దక్షిణ భారతదేశం. తమిళనాడులో, కేరళలో సరైన స్థాయిలో స్థానాలు రాకపోయినప్పటికీ.. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (ఇక్కడ బిజెపి జనసేన టిడిపి తో కలిసి పోటీ చేసింది) ఆదుకున్నాయి. దీంతో ఈసారి ఈ ప్రాంతాలకు చెందిన నాయకులకు కీలక మంత్రి పదవులు దక్కాయి. అందులో రెండు తెలుగు రాష్ట్రాలకు ఏకంగా 5 సహాయ మంత్రిత్వ శాఖలు దక్కడం విశేషం.
ఈ ఐదు మంత్రిత్వ శాఖలు దక్కిన వారిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్రా నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ ఉన్నారు.. రెండు రాష్ట్రాలకు ఏకంగా ఐదు మంత్రిత్వ శాఖలు లభించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజల నుంచి విజ్ఞప్తి వినిపిస్తోంది. గతంలో యునైటెడ్ ఫ్రంట్ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నుంచి ఎర్రన్నాయుడు మంత్రిగా పనిచేశారు. బాలయోగి స్పీకర్ గా ఉన్నారు. ఆ సమయంలో పలు కీలక ప్రాజెక్టులు తెలుగు రాష్ట్రానికి వచ్చాయి . రహదారులు, భవనాలు, ఇతర పథకాలలో సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు నిధులు, ఇతర పథకాలు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీలు.. అన్నింటిని తీసుకురావాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది. ఐదు మంత్రి పదవులు దక్కడంతో ఒక రకంగా బంగారం లాంటి అవకాశం తెలుగు ప్రాంత ప్రజా ప్రతినిధులకు లభించినట్టు భావించాలి.. గతంలో తెలుగు రాష్ట్రాలకు ఈ స్థాయిలో ప్రాధాన్యం లభించేది కాదు. ముఖ్యంగా 2014, 2019లో బిజెపి ప్రభుత్వం ఏర్పడినప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ, వెంకయ్య నాయుడు కు మాత్రమే మంత్రులుగా అవకాశం లభించింది. ఆ తర్వాత కాలంలో దత్తాత్రేయ గవర్నర్ గా వెళ్లిపోయారు. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా నియమితులయ్యారు.
వాస్తవానికి 2014, 2019 కాలంలో తెలుగు రాష్ట్రాలకు ఆశించినత స్థాయిలో కేంద్రం నుంచి నిధులు, ఇతర ప్రయోజనాలు అందలేదని విమర్శలు ఉన్నాయి. అయితే ఈసారి కేంద్రంలో కీలకంగా ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు నిధులు, ఇతర పథకాలలో మెజారిటీ వాటా సాధించాలని ప్రజల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. బంగారు పళ్లెంలో లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో తెలుగు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తారో చూడాల్సి ఉంది. ఒకవేళ వారు కేంద్రం నుంచి నిధులు కనుక భారీగా తీసుకొస్తే.. అది వారి రాజకీయ జీవితాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేమని విశ్లేషకులు అంటున్నారు.