Pawan Kalyan: జనసేన అధినేత పవన్ బుధవారం ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. మార్చిలో మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ పాల్గొన్నారు. భారీ జన సందోహం నడుమ రోడ్ షోతో పాటు బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బాధలో ఉన్న రైతులను పరామర్శించేందుకు వస్తున్నారు. రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కారు విఫలమైందంటూ పవన్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు నేరుగా రైతుల పరామర్శకు వస్తుండడంతో ఆయన నోటి నుంచి ఎటువంటి విమర్శనాస్త్రాలు వస్తాయో అని అధికార పక్షం భయపడుతోంది.
నాలుగు జిల్లాల్లో…
బుధవారం ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో కడియానికి బయలుదేరి వెళ్తారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శిస్తారు. కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖిగా సమావేశమౌతారు. వారి కష్టాలను తెలుసుకుంటారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పవన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. బాధిత నియోజకవర్గాలను కలుపుతూ పవన్ పర్యటన కొనసాగనున్నట్టు తెలుస్తోంది.
గతంలో కౌలురైతులకు భరోసా..
జనసేన ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా ఉభయ గోదావరి జిల్లాల్లో సక్సెస్ అవుతుంది. గతంలో పవన్ కౌలురైతు భరోసా యాత్ర చేపట్టినప్పుడు కూడా జన ప్రవాహంగా మారింది. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున పవన్ అందించారు. ఇప్పుడు మరోసారి రైతుల పక్షాన పోరాడేందుకు సిద్ధపడుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో 40 మందికి పైగా రైతు కుటుంబాలకు ఆయన చెక్కులు అందించారు. రైతు సమస్యల మీదే పవన్ కల్యాణ్ మరోసారి పర్యటించబోతోన్నారు.
చంద్రబాబు రూట్లోనే..
ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. పంట నష్టాన్ని పరిశీలించారు. ఇప్పుడు అదే రూట్‌లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అయితే ఇప్పటికే రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కారు ఫెయిలందంటూ పవన్ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేరుగా రైతులను, క్షేత్రస్థాయిలో పాడైన పంటను పరిశీలించనుండడంతో విమర్శల డోసు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్కారుపై పవన్ వీరవిహారం తప్పదని.. రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?