Pawan Kalyan Alliance With TDP: జనసేనాని రూటు మార్చారా? వచ్చే ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారాలనుకుంటున్నారా? తాను తొందరపడితే 2014 సీన్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారా? నాడు జనసేన ద్వారా టీడీపీ, బీజేపీ లాభపడిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారా? అందుకే పొత్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పొత్తులపై సానుకూలంగా ఉంటూనే తన మానాన తాను పనిచేయడానికి నిశ్చయించుకున్నారు. మొన్నటి వరకూ పొత్తుల కోసం అర్రులు చాచిన చంద్రబాబు, బీజేపీ పెద్దలు వ్యూహాత్మకంగా మౌనం దాల్చడంతో పవన్ కూడా అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారి అవసరం కంటే.. తన అవసరమే వారికి ఉందని విషయం గుర్తించుకోవాలంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి ఎవరు కలిసొచ్చినా.. కలిసి రాకపోయినా ఒంటరి పోరుకు సన్నద్ధమవుతున్నారు.మరోవైపు టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుందని అధికార పార్టీ తెగ ప్రచారం చేస్తోంది. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ నడుస్తున్నారని.. ఆయన చంద్రబాబు దత్తపుత్రుడంటూ సీఎం జగన్ నుంచి మంత్రులు,నేతల వరకూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. కొందరు నేతలైతే మరో అడుగు ముందుకేసి బీజేపీ కూడా వారితో జత కలుస్తుందని ప్రచారం చేస్తున్నారు.
ప్రజా సమస్యలపై..
అధికార పక్షం ఆరోపణల్లో కొంతవరకూ నిజముండచ్చు కానీ.. ఇటీవల పవన్ మాత్రం పొత్తుల విషయాన్ని పక్కనపెట్టి ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. కౌలురైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. అటు అధికార పక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షానికి దీటుగా పవన్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే ముందుగా పొత్తుల అంశాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదు.. అటు నుంచి కూడా ప్రేమ ఉండాలి కదా అంటూ జనసేనకు సంకేతాలిచ్చారు. దానిపై పవన్ కూడా సానుకూలంగా స్పందించారు. గత రెండు ఎన్నికల్లో తగ్గానని.. ఇప్పుడు మాత్రం వారే తగ్గాల్సి ఉంటుందని ప్రకటించారు. అప్పటి నుంచి పవన్ సీఎం కావాలన్న కోరికతో ఉన్నారని.. తప్పకుండా సాధిస్తారని జనసైనికులు నమ్ముతూ వచ్చారు. దానిపై సోషల్ మీడియాతో పాటు బయట కూడా వ్యాఖ్యానాలు చేశారు. అయితే దీనిపై బీజేపీలో భిన్న స్వరం వినిపించింది. బీజేపీలో ఎన్నికల అనంతరమే సీఎం ఎంపికలు ఉంటాయని.. ముందుగా పేరు ప్రకటించే సంప్రదాయం లేదని వారు తప్పుకున్నారు. అటు టీడీపీ సైతం ఎందుకొచ్చింది గొడవ అంటూ సైలెంట్ అయిపోయింది. పొత్తుల గురించి నానా యాగీ చేసిన ఆ పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు రావడంతో మౌనం దాల్చారు.
పరిస్థితులకు తగ్గట్టు..
అయితే ఇప్పుడున్న పరిస్థితులను పవన్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాను రాజ్యాధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజల గొంతుక కోసం మాత్రమే వచ్చానని పవన్ చెప్పుకొచ్చారు. జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిన ఆవశ్యకత చంద్రబాబుకే ఉందని గుర్తెరిగారు. అందుకే అటు నుంచే సానుకూలమైన స్పందన రానప్పుడు మనం మాత్రం ఎందుకు తగ్గాలన్నది పవన్ భావన. ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీకి బలమైన కేడర్ ఉంది. గ్రామస్థాయిలో ఆ పార్టీకి పట్టుంది. అయితే అది 2024 ఎన్నికలకు సరిపోయేటంతగా లేదు. దానిని పవన్ ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ ముందే పొత్తుకు చేయి అందిస్తే జనసేన గణనీయమైన సీట్లు డిమాండ్ చేసే అవకాశముంది. అందుకే చంద్రబాబు వ్యూహం మార్చారు. ముందే స్నేహ హస్తం అందిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని భావించి పొత్తుల అంశాన్ని తాత్కాలికంగా పక్కన పడేశారు. 175 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. క్యాండిడేట్లను సైతం ఎంపిక చేస్తున్నారు. సుదీర్ఘ కాలం పార్టీని నడిపిస్తున్న పవన్ ఇటువంటి రాజకీయాలను చూసి విసిగి వేశారిపోయారు. అందుకే మూడు ఆప్షన్లను తెరపైకి తెచ్చారు. చివరికి మూడో ఆప్షన్ ను ఎంపిక చేసుకొని ఒంటరి పోరాటానికే సన్నద్ధమవుతున్నారు. చంద్రబాబులా 175 నియోజకవర్గాల్లో జనసేన బలోపేతంపై ఫోకస్ పెట్టారు. త్వరలో పార్టీలో చేరికలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడు ప్రాంతాలకు పార్టీ సమన్వయకర్తలుగా కొంతమంది నేతలకు బాద్యతలు అప్పగించారు.
విరుద్ధ ప్రకటనలతో..,
మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో పవన్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే పొత్తుకు ముందుకొస్తామని జనసైనికులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో అధినేత భేషరతుగా మద్దతు తెలిపారని.. అందుకే నాడు చంద్రబాబు సీఎం అయ్యారని గుర్తుచేస్తున్నారు. అందుకే ఈ సారి వెనక్కి తగ్గాలని సూచిస్తున్నారు. కానీ టీడీపీ శ్రేణులు ఇందుకు ససేమిరా అంటున్నాయి. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో గాడిలో పెట్టగల సత్తా చంద్రబాబుకే ఉందని వాదిస్తున్నారు. చంద్రబాబును వయసురీత్యా పరిగణలోకి తీసుకోవాలని.. ఆయన సేవలు అందించాల్సిన కీలక సమయంగా పేర్కొంటున్నారు. ఇలా ఉభయ పార్టీల వాదనలు ముదురుతున్నాయి. అధినేతలు మాత్రం నోరు విప్పడం లేదు. జనసేన తగ్గాలని సూచిస్తుంటే.. ఎలా తగ్గుతామని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయే తప్ప నాయకులు మాత్రం సైలెంట్ అయిపోయారు. మరోవైపు బీజేపీ జాతీయ రాజకీయ కారణాలో ? లేక టీడీపీతో జనసేన దగ్గరవుతుందనో మాత్రం.. రెండు పార్టీలకు దూరం జరుగుతోంది. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సఖ్యతగా మెలుగుతున్నాయి. ఈ తాజా పరిణామాలన్నింటినీ చూసిన పవన్ టీడీపీ, బీజేపీ చర్యలతో విసిగి వేశారిపోయారు. 2024 ఎన్నికల్లో ఒంటరి ప్రయాణమే మేలన్న డిసైడ్ కు వచ్చారు. ఒడిపోయినా పర్వాలేదు కానీ మరో సారి తగ్గేదేలే అంటున్నారు.
Also Read:KCR VS Tamilisai: గవర్నర్ తో కేసీఆర్ సమరమా? సంధినా? ఈరోజు తేలబోతోంది