KCR VS Tamilisai: నచ్చితే ఎవరినైనా నెత్తిన పెట్టుకుంటారు. నచ్చకుంటే ఎంతటివారినైనా కింద పడేస్తారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కేసీఆర్ అనుసరిస్తున్న పంథా ఇదే. ఆలే నరేంద్ర, విజయశాంతి, రవీంద్ర నాయక్, రాములు నాయక్, ఈటల రాజేందర్, మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు, చిన జీయర్ స్వామి.. ఎవరైనా కానీ తన సర్కిల్ మేరకు ఉంటేనే గౌరవమైన, ఇంకా ఏదైనా కేసీఆర్ ఇస్తారు. ఒక్కసారి గనుక ఆ పరిధి దాటితే ఎంతటివారినైనా ఉపేక్షించరు. అలాంటి వ్యవహారాలపై ఎన్ని విమర్శలు వచ్చినా పెద్దగా లెక్క చేయరు. పైగా తనకు ఉన్న సర్కిల్ తో విష ప్రచారానికి వెనుకాడరు.
రాజ్ భవన్ కి వెళతారా?
తమిళ సై సౌందరరాజన్ గవర్నరుగా నియమితులైన తొలినాళ్లలో రాజ్ భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. నరసింహన్ స్థాయిలో కాకున్నా ఆశించిన స్థాయిలోనే సఖ్యత ఉండేది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల్లో కూడా గవర్నర్కు సముచిత ప్రాధాన్యం లభించేది. కల్వకుంట్ల ఇంటి గౌరవం కూడా దక్కేది. ఇక ప్రోటోకాల్, అడిగిందే తడవుగా హెలిక్యాప్టర్.. ఇలాంటి సౌకర్యాలు కూడా రాజ్భవన్కు అందేవి. ఎప్పుడైతే బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుందో, ఎప్పుడైతే దుబ్బాకలో విజయపతాక ఎగరేసిందో, ఎప్పుడైతే జీహెచ్ఎంసీలో కారు కు బ్రేకులు వేసిందో అప్పుడే సార్ కు కోపం వచ్చింది.
Also Read: YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు: కోర్టులో ఆయన కూతురు సంచలన వాదనలు
అంతకుముందు వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటనలో గవర్నర్ వ్యవహరించిన తీరూ సార్ కు ఇబ్బంది కలిగించింది. అంతే రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు అగాధం పెరిగిపోయింది. బొట్టు పెట్టి, గాజులు ఇచ్చి, కాంచీపురం పట్టు చీరతో సారె ఇచ్చిన చేతులే కాదు కూడదు అన్నాయ్. కుశల ప్రశ్నలు వేసి, విందు భోజనాలు చేసిన నోర్లు విమర్శలకు దిగాయి. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాజ్భవన్కు అన్ని విషయాల్లోనూ చీత్కారం ఎదురైంది. రాజ్ భవన్ తమలపాకుతో ఒకటి ఇస్తే.. తలుపు చెక్కలతో ప్రగతి భవన్ అంతకంటే ఎక్కువ ఇచ్చింది. దీనికితోడు తమిళిసై సౌందరరాజన్ మాతృమూర్తి ఇటీవల కన్నుమూశారు. సమయంలో ఆమె తన స్వస్థలానికి వెళ్లేందుకు ఒక హెలికాప్టర్ ను కూడా ప్రగతి భవన్ సమకూర్చ లేదు. పైగా ఒక పలకరింపు కూడా కేసీఆర్ నుంచి దక్కలేదు. ఇది క్రమక్రమంగా విస్తరించుకుంటూ పోయింది. మేడారం జాతర నుంచి మహబూబ్నగర్, భద్రాద్రి జిల్లాల్లో ఆదివాసుల పరామర్శల వరకు.. ఇలా గవర్నర్ చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ ప్రభుత్వం నుంచి ప్రోటోకాల్ దక్కలేదు. పైపెచ్చు గవర్నర్ పర్యటన ను దృష్టిలో పెట్టుకుని భద్రాద్రి జిల్లా కలెక్టర్, ఎస్పీని అప్పటికప్పుడు ప్రభుత్వం సెలవులో పంపింది.
గవర్నర్ మోదీ, అమిత్ షాను కలవడంతో..
ఇది జరిగిన కొన్నాళ్లకు గవర్నర్ నేరుగా ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా ను కలిశారు. ఆ సమయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం తడబాటు లేకుండా నేరుగా సమాధానం ఇచ్చారు. ప్రగతి భవన్, రాజ్ భవన్ వద్దకు రావాలి గాని.. రాజ్ భవన్ ప్రగతి భవన్ వద్దకు వెళ్లకూడదని కుండ బద్దలు కొట్టారు. ఇక ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి లోనూ గవర్నర్ ఏమాత్రం తత్తరపాటుకు గురికాకుండా సమాధానం ఇచ్చారు. కేసీఆర్ పై నేరుగానే విమర్శలు సంధించారు.
ప్రమాణ స్వీకారానికి వెళ్తారా?
తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ ఢిల్లీలో ఉన్నా పార్లమెంట్కు వెళ్ల లేదు. ఇటీవల మోదీ మూడుసార్లు హైదరాబాద్ కు వచ్చినా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కనీసం హాజరు కాలేదు. ఏదైనా తన కాళ్ల వద్దకే రావాలని కోరుకునే కేసీఆర్.. తన అవసరం ఉంటే ఎదుటి వారి గుమ్మం తొక్కేందుకు ఏమాత్రం ఆలోచించరు. ఇలాంటి పరిణామాల మధ్య ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ నియమితులయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారం అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం రాజ్ భవన్ లో గవర్నర్ సమక్షంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. కానీ కొద్దికాలంగా రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య అగాధం పెరిగిపోవడంతో కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనేది సస్పెన్స్ గా ఉంది. గతంలో ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పంపించారు. గవర్నర్ మాతృమూర్తి కన్ను మూసినప్పుడు కనీసం ప్రభుత్వం నుంచి ఎవరినీ పంపించలేదు. ఇక మొన్న మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ జార్ఖండ్, ఢిల్లీ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్ కు ఆశించినంత స్థాయిలో గౌరవం దక్కలేదు. పైగా ఢిల్లీలో పర్యటించినప్పుడు మౌలాలి క్లినిక్లను సందర్శించారు. వీటిని తెలంగాణ లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అదే సమయంలో తెలంగాణ “ఆప్” బాధ్యతలను పర్యవేక్షిస్తున్న సోమనాథ్ భారతి కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉండగానే ప్రముఖ సామాజికవేత్త అన్న హజారే ను కలుస్తారని ప్రగతి భవన్ లీకులు ఇచ్చినా అతని కలవకుండానే కేసీఆర్ వెను దిరిగారు.
హేమంత్ హ్యాండిచ్చారు
జార్ఖండ్ పర్యటన సమయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కేసీఆర్ కు మద్దతు తెలుపుతున్నట్టు మాట్లాడినా.. తర్వాత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ను బీజేపీ ఎంపిక చేయడంతో.. మనసు మార్చుకున్నారు. ప్రధానమంత్రి మోదీని కలిసి ద్రౌపతి కి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో కేసీఆర్ బీఆర్ఎస్ ప్లాన్ కు బీజేపీ ఆదిలోనే చెక్ పెట్టింది. మరోవైపు మహారాష్ట్రలో సంజయ్ రౌత్ చుట్టూ ఈడీ ద్వారా ఉచ్చు బిగిస్తోంది. కళ్ళ ముందు ఇన్ని పరిణామాలు కనిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ మనసు మార్చుకుంటారా? రాజ్ భవన్ కు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే కార్యక్రమానికి హాజరుకావాలని ప్రగతి భవన్ కు రాజభవన్ ఆహ్వానం పంపింది. ఒకవేళ రాజ్ భవన్ కు కేసీఆర్ వెళ్లని పక్షంలో న్యాయ వ్యవస్థను చిన్న చూపు చూస్తున్నారనే అపవాదు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇటీవల హైదరాబాదులో నిర్మించిన ఆర్బిట్రేషన్ సెంటర్ కు సర్కార్ పరంగా ఇతోదికంగా సాయం చేసిన కేసీఆర్ ను సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ ఎన్వీ రమణ పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్ ఏం చేసినా భారీగానే చేస్తారని, ఆయనది పెద్ద చేయని కొనియాడారు. ఎన్వీ రమణ స్థాయి వ్యక్తే తనను పొగిడినప్పుడు.. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి వెళ్లకుండా ఉంటే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అవుతాయి. ఒకవేళ రాజ్ భవన్లో కి కేసీఆర్ వెళ్తే తమిళ సై సౌందరరాజన్ పై చేయి సాధించినట్లు అవుతుందనే వాదనలు లేకపోలేదు. ఇలాంటి అనేక సంశయాల మధ్య కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారోనని తెలంగాణ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.