Pawan Kalyan- YSRCP: మీడియా ముందుకొచ్చి గొంతు చించుకోవాల్సిన పనిలేదు. జనంలోకి వెళ్ల కాళ్లరిగేలా తిరగాల్సిన పని కూడా లేదు.! జస్ట్ ఓ ట్వీటేస్తే చాలు, జనసేనాని పవన్ కళ్యాణ్ మీద అధికార వైసీపీ నేతలు విరుచుకుపడిపోతారు. వైసీపీ నేతల బలహీనతని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పసిగట్టేశారు. ఆయన ట్రాప్‌లో పడిపోతారు. ఇందుకు తాజాగా ఆయన తాజాగా చేసిన ట్వీటే ఉదాహరణ. సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే పవన్.. ప్రజలకు దగ్గరగా ఉండాలని భావిస్తారు. అందుకే తనకు వీలైనప్పుడల్లా ప్రజాక్షేత్రంలోకే వెళ్తారు. కానీ సడెన్‌గా ట్విట్టర్ వేదికపై ప్రత్యక్షమై అటు జన సైనికులను.. ఇటు అధికార వైసీపీని ఆశ్చర్యపర్చాడు. ఒక్క ట్వీట్‌తో ఆంధ్రా మంత్రులు, వైసీపీ నేతల దృష్టిని తనవైపు మళ్లించుకున్నాడు. అధికార పార్టీనేతల బలహీనతను పసిగట్టిన పవన్.. వ్యూహాత్మకంగా వ్యవహరించి వైసీపీ మంత్రులు, నేతలను డిఫెన్స్‌లోకి నెట్టడంలో సక్సెస్ అయ్యారు.

మూడు రాజధానుల ఉద్యమంపై..
మూడు రాజధానులకు సంబంధించి నడుస్తున్న ఉద్యమంపై ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ఒకే ఒక్క ట్వీట్ చేశారు. గర్జన ఎవరి కోసం.. ఎందుకోసం అని అధికార పార్టీ నేతలను ప్రశ్నించారు. అంతే.. వైసీపీ మంత్రులు, నేతలు ట్విట్టర్ వేదికగా జన సేనానిపై విరుచుకు పడుతున్నారు. మూడు రాజధానుల విషయమై ఉత్తరాంధ్రలోనూ కొంత సెంటిమెంట్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవాలంటే వైసీపీ, మిగతా విషయాల్ని లైట్ తీసుకోవాలి. జనసేనాని వారికి ఆ చాన్స్ ఇవ్వలేదు. గర్జన ఎవరి కోసం అనే ఒకే ఒక ప్రశ్నతో అధికార పార్టీని సెల్ఫ్ డిఫెన్స్‌లో పడేశారు.
వైసీపీని టార్గెట్ చేసిన జనసేనాని..
సోషల్ మీడియా వేదికగా జనసేనాని బ్యాక్ టు బ్యాక్ వేస్తున్న ట్వీట్లతో అధికార వైసీపీ ఒకింత కంగారు పడింది. మంత్రి గుడివాడ అమర్నాథ్ సహా పలువురు వైసీపీ నేతలు, జనసేనాని మీద మీడియా సాక్షిగా విరుచుకుపడుతున్నారు. దీంతో సహజంగానే ఉత్తరాంధ్రలో మూడు రాజధానులపై ఉన్న ఆ కాస్త ఆసక్తి కూడా సన్నగిల్లిపోయిందిప్పుడు. పైగా, అక్టోబర్ 15 నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్రలో పర్యటిస్తానని జనసేనాని ప్రకటించారు. అదే అక్టోబర్ 15న ‘గర్జన’ ప్లాన్ చేసింది వైసీపీ. విశాఖలో వైసీపీ కుంభకోణాల గురించి జనసేనాని ట్విట్టర్ వేదికగా స్పందించడంతో, ఉత్తరాంధ్ర వైసీపీలో ఒకింత కుదుపు స్పష్టంగా కనిపిస్తోంది.

ట్వీట్‌లను లైట్ తీసుకుంటే..
పవన్ కళ్యాణ్ ట్వీట్లను వైసీపీ లైట్ తీసుకుని వుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ వైసీపీ నేతలు రిటర్న్ ట్వీట్‌లతో జనసేనానిని రెచ్చగొట్టారు. పవన్‌కు కౌంటర్ ఇచ్చేందుకు ఏపీ మంత్రులు క్యూ కట్టారు. మంత్రుల ఎదురు దాడి పవన్ కళ్యాణ్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. దీంతో ఆయన మరోసారి ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై తన మార్క్ సెటైర్స్‌తో ప్రత్యక్షమయ్యారు. రాజధాని అంశంపై పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాన్ని సంధించడం చర్చకు దారి తీసింది. ఏపీని ఏకంగా ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించాలని తీవ్రస్థాయిలో పవన్ వెటకరించారు. ‘వికేంద్రీకరణే సర్వతోముఖాభివద్ధికి మంత్రం అనుకుంటే మూడు రాజధానులే ఎందుకు…25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి 25 రాజధానులను ఏర్పాటు చేయండి. చట్టం, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగానికి మీరు అతీతం అన్నట్టు మీరు భావిస్తుంటారు. అలాగే ప్రవర్తిస్తుంటారు కదా! ప్రజాభిప్రాయంతో సంబంధం లేదు కదా మీకు? ఏ మాత్రం సంకోచించకండి. రాష్ట్రంలో వైసీపీ రాజ్యాంగాన్ని అమలు చేయండి’ అంటూ ఆయన వ్యంగ్య ట్వీట్ చేశారు. వైసీపీ నేతలకు చిర్రెత్తుకొచ్చేలా చేసి వ్యూహాత్మకంగా అధికార పార్టీ నేతలు తన ట్రాప్‌లో పడేలా చేసుకున్నారు.