Homeఆంధ్రప్రదేశ్‌JanaSena- Telangana: జాతీయ పార్టీగా జనసేన.. తెలంగాణలో పోటీ అందుకేనా?

JanaSena- Telangana: జాతీయ పార్టీగా జనసేన.. తెలంగాణలో పోటీ అందుకేనా?

JanaSena- Telangana: జనసేన.. జాతీయ పార్టీగా అవతరించబోతుందా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీవర్గాలు.. దాదాపు ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాజకీయాలపై పెద్దగా ఫోకస్‌ పెట్టని జనసేనాని.. తాజాగా దృష్టిపెట్టడం అందులో భాగమే అని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం ఏపీలో దూకుడు పెంచిన జనసేనాని, ఇటీవల నిర్వహించిన పార్టీ నాయకుల సమావేశంలో తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. 14 అసెంబ్లీ స్థానాలు, రెండు లేదా మూడు లోక్‌సభ స్థానాల్లో జనసే అభ్యర్థులను బరిలో నిలుపుతామని ప్రకటించారు. ఈమేరకు కార్యాచరణ సిద్ధం చేయాలని తెలంగాణ ప్రాంత నేతలకు సూచించారు. ఈ క్రమంలో జనసేన జాతీయ పార్టీగా మారబోతుందన్న చర్చ ఊపందుకుంది.

JanaSena- Telangana
pawan kalyan

జాతీయ పార్టీగా గుర్తింపు ఇలా..
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బీఆర్‌ఎస్‌గా మార్చారు. జాతీయ పార్టీగా ప్రకటించారు. ఇప్పటికే జాతీయ పార్టీగా ప్రకటించుకున్నవి ఇండియాలో చాలా ఉన్నాయి. ప్రకటించుకున్నవన్నీ జాతీయ పార్టీలు కావు. ఎన్నికల సంఘం వాటన్నింటినీ గుర్తించదు. పార్టీ స్థాపించి ఎవరైనా.. జాతీయ పార్టీ అని చెప్పుకొవచ్చు. కానీ ఎన్నికల సంఘం గుర్తించాలంటే మాత్రం రూల్స్‌ ఉంటాయి. జాతీయ పార్టీగా రిజిస్టర్‌ చేసుకుని.. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయోచ్చు. పోటీ చేసినంత మాత్రన.. కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ పార్టీగా ప్రకటించదు. జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధించాలి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లేదా లోక్‌సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లు వచ్చి ఉండాలి. నాలుగు ఎంపీ సీట్లను సైతం గెలవాలి. మరో అవకాశం కూడా ఉంది. దేశవ్యాప్తంగా జరిగే లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో కనీసం రెండు శాతం స్థానాలు గెలిచి ఉండాలి. ఈ రెండుశాతం సీట్లు కూడా మూడు రాష్ట్రాల నుంచి గెలవాలి. ఒక ప్రాంతీయ పార్టీగా కనీసం నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు ఉన్నా.. జాతీయ పార్టీగా గుర్తిస్తారు. దానికి ఉదాహరణ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ.

జాతీయ గుర్తింపు వస్తే..
పార్టీలకు అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఎక్కడ పోటీ చేసినా ఒకే గుర్తు ఉంటుంది. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలకు దూరదర్శన్, ఆలిండియా రేడియోలలో ప్రచారానికి ఉచితంగా సమయం కూడా ఉంటుంది. ఓటర్ల జాబితాలను ఉచితంగా అందుకోవచ్చు. ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి తక్కువ రేటుకే భూమి కూడా వస్తుంది.

2 శాతం లోక్‌సభ స్థానాలపై జనసేనాని నజర్‌..
జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 2 శాతం లోక్‌సభ స్థానాలు సాధించడంతోపాటు నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించడంపై దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా అది సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్ల కోసం 2023లో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర, తమిళనాడులోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. తమిళనాడు, మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఎక్కువ. మరోవైపు పవన్‌కు ఆయా రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర, తెలంగాణతోపాటు తమిళనాడు, మహారాష్ట్రలో పోటీ చేయడం ద్వారా జాతీయ పార్టీ గుర్తింపు సాధించవచ్చన్న ఆలోచనలో జనసేన నాయకత్వం ఉన్నట్లు సమాచారం.

JanaSena- Telangana
JanaSena

తెలంగాణలో ఇక అన్నీ జాతీయ పార్టీలే!
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే కొన్ని జాతీయ పార్టీలు ఉండడం, మరికొన్ని పార్టీలు తమకు తాము జాతీయ పార్టీలుగా ప్రకటించుకోగా.. ఇప్పుడు మరో జాతీయ పార్టీ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక ప్రాంతీయ పార్టీగా పోరాడిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఈ పరిణామంతో తెలంగాణలో ఇక దాదాపుగా అన్ని పార్టీలూ జాతీయ పార్టీలయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఇప్పటికే జాతీయ పార్టీలు కాగా, బీఎస్పీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, తెలుగుదేశం జాతీయ పార్టీలుగా ప్రకటించుకున్నవే. ఈ జాబితాలోకి త్వరలో జనసేన కూడా చేరబోతోందని సమాచారం. ఒక్క వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ మాత్రమే ఇందుకు మినహాయింపు.

తెలుగు రాష్ట్రాల్లో జనసేనే బలమైన పార్టీ..
రాష్ట్రంలోని స్థానిక రాజకీయ పార్టీల్లో జనసేన ఆర్థికపరంగా బలమైన పార్టీగా నిలిచింది. అన్‌ రికగ్నైజ్డ్‌ పొలిటికల్‌ పార్టీల జాబితాలో మొత్తం 119 రాజకీయ పక్షాలు రాష్ట్రంలో ఉంటే.. వాటిలో 12 పార్టీలు తమ వార్షిక నివేదికలు అందించాయి. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఇటీవల రాజకీయ పార్టీల వివరాలను వెల్లడించింది. అయితే, ఇందులో కొన్ని పార్టీలు తమ వార్షిక నివేదికలు ఇవ్వడం లేదని నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం జాబితాలో జాతీయ పార్టీలు 8, ప్రాంతీయ పార్టీలు 57గా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేన, తెలంగాణ జన సమితి వంటి పార్టీలన్నీ అన్‌ రికగ్నైజ్డ్‌ పార్టీలుగానే ఈసీ పేర్కొంది. ఇందులో జనసేనకు గాజు గ్లాసు గుర్తును కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ జన సమితికి మాత్రం గుర్తును పేర్కొనలేదు. 2018లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 77 రిజిస్టర్డ్‌ అన్‌ రికగ్నైజ్డ్‌ పార్టీలు పోటీ చేసినట్లు ఈసీ పేర్కొంది. 2019 జనరల్‌ఎన్నికల్లో 35 పార్టీలు పోటీలో ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. జనసేన, తెలంగాణ జన సమితి, తెలంగాణ యువశక్తి, సమాజ్‌వాది ఫార్వర్డ్‌ బ్లాక్‌ వంటి పార్టీలు 35 ఉన్నాయి.

జనసేన రిచ్‌
తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ధనవంతమైన రాజకీయ పార్టీగా నిలిచింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు విరాళాల రూపంలో రూ.26.37 కోట్లు వచ్చాయి. గతేడాది వరకు రూ.22.36 కోట్లుగా ఉన్న జనసేన పార్టీ ఆదాయం ఈ ఏడాది రూ.26.37 కోట్లకు పెరిగింది. ఇప్పటి వరకు పార్టీ నిర్వహణకు రూ.20.28 కోట్లు ఖర్చు అయ్యాయని, 2020 వరకు రూ.14.35 కోట్లుగా ఉన్న ఖర్చు.. 2021లో భారీగా పెరిగిందని రిపోర్టులో పేర్కొన్నారు. జనసేన పార్టీకి భవనాల రూపంలో రూ.1.01 కోట్లు, వాహనాలు రూ.66.37 లక్షలు, ఆఫీస్‌ ఎక్విప్‌మెంట్‌ ద్వారా రూ.56.34 లక్షలు, ఇన్సూరెన్సుల ద్వారా రూ.95.47 లక్షల ఆదాయం ఉందని, ప్రస్తుతం బ్యాంకులో రూ.7.60 కోట్లు నిల్వ ఉన్నట్లు ఆదాయ వివరాల్లో జనసేనాని చూపించారు. ఈ పార్టీకి 2021లో రూ.3.87 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. ఈ పార్టీకి విరాళాలుగా రూ.1.57 లక్షలు, మెంబర్‌ షిప్‌ద్వారా రూ.1.08 కోట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల నుంచి రూ.82.68 లక్షలు, ఇతర మార్గాల ద్వారా రూ.1.94 కోట్ల ఆదాయం వచ్చింది. జనసేన పార్టీకి 2019–20 ఆర్థిక సంవత్సరంలో విరాళాల ద్వారా రూ.4.98 కోట్లు వచ్చాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో రూ. 53.37 లక్షలు, ఇతర మార్గాల ద్వారా రూ. 2.28 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. 2020–21 వార్షిక సంవత్సరంలో జనసేన పార్టీ దగ్గర రూ.7.81 కోట్లు ఉంటే.. 2021–22లో రూ.3.87 కోట్లు ఉన్నాయి. అయినప్పటికీ స్థానిక పార్టీలో ఈ పార్టీ మాత్రమే ధనవంతమైనా పార్టీగా నిలిచింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular