Jagan Decision: సినీ రాజకీయరంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. దశాబ్దాలుగా వెండితెరను ఉర్రూతలూగించారు. అటు రాజకీయంగా కూడా రాణించారు. కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బీజేపీలోనే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం సాగించారు. త్వరలో గవర్నర్ గా నియమితులవుతారని ప్రచారం జరిగింది. ఇంతలోనే ఆయన మృతిచెందారు. సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు, కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో పెద్దకర్మ నిర్వహించారు. దాదాపు లక్ష మందికి భోజన ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రులు కరుమూరు నాగేశ్వరరావు, ఆర్కే రోజాతో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాష్ తో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు స్మృతీవనం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు మంత్రుల వద్ద ప్రస్తావించారు. దీంతో జగన్ సర్కారు సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ భూమి ఏర్పాటుకు ముందుకొచ్చింది. నరసాపురం సమీపంలోని పేరుపాలెం బీచ్ లో రెండెకరాల స్థలాన్ని కేటాయించనున్నట్టు మంత్రి కారమూరి నాగేశ్వరరావు తెలిపారు.

అయితే ప్రభుత్వం ఇంత వేగంగా స్పందించడం వెనుక రాజకీయ కారణాలున్నాయన్నటాక్ వినిపిస్తోంది. కృష్ణంరాజు క్షత్రియ సమాజికవర్గానికి చెందిన వారు. గత మూడేళ్లుగా జరిగిన పరిణామాలతో వైసీపీ ప్రభుత్వం అంటేనే క్షత్రియులు మండిపడుతున్నారు. వారిని దగ్గర చేసుకునేందుకే కృష్ణంరాజు కుటుంబం అడిగిందే తడువు భూమి కేటాయించారని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రాజుల ప్రాభల్యం ఎక్కువ. అయితే వారు ప్రస్తుతం బీజేపీ, జనసేనలవైపు మొగ్గుచూపుతున్నారు. అక్కడ కాపులు, రాజులు కలిస్తే మాత్రం రాజకీయంగా వార్ వన్ సైడ్ గా ఉంటుంది. అందుకే రాజులను దూరం చేసుకోకూడదని జగన్ భావించారు. అందుకే త్వరగా స్పందించారు.

నరసాపురం నియోజకవర్గం నుంచి లోక్ సభ అభ్యర్థిగా ప్రభాష్ సోదరుడ్ని బరిలో దించాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. అదే సమయంలో టీడీపీ కూడా బలమైన అభ్యర్థిని పోటీలో పెట్టాలని భావిస్తోంది. జనసేనతో పొత్తు కుదిరితే మాత్రం టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి రంగంలో దిగే అవకాశముంది. ప్రస్తుతం వైసీపీకి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉన్నా అధిష్టానంతో ఆయనకు పొసగడం లేదు. ఇప్పటికే రఘురామ ఇష్యూతో క్షత్రియ వర్గంలో మెజార్టీ ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక భావనతో ఉన్నారు. ఈ సమయంలో రాజులను దూరం చేసుకుంటే మాత్రం నరసాపురంలో పోటీ ఇవ్వలేం సరికదా.. సరైన అభ్యర్థిని బరిలో దించలేకపోయారన్న అపవాదును వైసీపీ మూటగట్టుకునే అవకాశం ఉంది. నరసాపురంలో బరిలో ఉండాలంటే తప్పనిసరిగా బలపడాలన్న తలంపులో వైసీపీ ఉంది. అందుకే కృష్ణంరాజు స్మృతీవనం ఏర్పాటు విషయంలో వేగంగా స్పందించింది.
