Tollywood And Bollywood: నవ్విన నాప చేనే పండుతుందని ఒక సామెత. ఒకప్పుడు దక్షిణాది సినిమాలంటేనే చిన్నచూపు చూస్తున్న బాలీవుడ్ నటులకు, దర్శకులకు, నిర్మాతలకు ఈ సామెత అచ్చు గుద్దినట్లు సరిపోతుందేమో. అప్పట్లో దక్షిణాది సినిమాలంటేనే హేళనగా చూసేవారు. దక్షిణాది నటీనటులకు నటించడం రాదని, ఇక్కడి దర్శకుల్లో సృజనాత్మకత ఉండదని గేలి చేసేవారు. కానీ ఇప్పుడు ఏమైంది బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయినట్టు ఉంది బాలీవుడ్ పరిస్థితి. వచ్చిన సినిమాలు వచ్చినట్టే చతికిల పడుతుంటే ఏం చేయాలో పాలు పోక బిత్తర చూపులు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల నుంచి షారుక్ ఖాన్ లాంటి అగ్రశ్రేణి కథానాయకుడి చిత్రం విడుదల కాలేదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన నటిస్తున్న పఠాన్ సినిమా కూడా దక్షిణాది లోని చెన్నైకి చెందిన అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు.

_ ఎందుకు ఈ మార్పు
బాలీవుడ్ సినిమాల్లో ఒకప్పుడు నవ్యత ఉండేది. లగాన్, చెక్ దే ఇండియా, మున్నాభాయ్ ఎంబిబిఎస్, త్రీ ఇడియట్స్, పీకే, రంగ్ దే బసంతి, తారే జమీన్ పర్ వంటి సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. అటువంటి ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీసిన బాలీవుడ్ దర్శకులు రొడ్డ కొట్టుడు కథలతో సినిమాలు తీయడం ప్రారంభించారు. దీంతో అవి జనాలకు నచ్చక పరాజయం పాలవుతున్నాయి. ఇంత జరుగుతున్నా దర్శకులు, నటీనటులు పాఠాలు నేర్చుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. ఉదాహరణకు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ మోస్ట్ ప్రామిసింగ్ హీరో. అలాంటి అతడు దక్షిణాదిలో సూపర్ హిట్ అయిన కాంచన, రాక్షసన్ సినిమాలను హిందీలో రీమేక్ చేశాడు. ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీసి జనాల మీదికి వదిలాడు. ఎంత వేగంగా వదిలాడో.. అంతే వేగంగా జనం తిరస్కరించారు. అదృష్టవశాత్తూ సినిమాలు ఓటీటీలో విడుదల కావడం వల్ల నిర్మాతలు బతికిపోయారు. లేకుంటే పరిస్థితి మరోలా ఉండేది. కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే కాదు.. బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకునే అమీర్ ఖాన్ పరిస్థితి కూడా ఇంతకంటే గొప్పగా ఏమీ లేదు. సుదీర్ఘ కాలం పాటు చిత్రీకరణ జరుపుకుని విడుదలైన లాల్ సింగ్ చద్దా ఘోర పరాజయం పాలైంది. ఈ సినిమా విడుదలకు ముందే “బ్యాన్ లాల్ సింగ్ చద్దా” పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ నటీనటుల వ్యవహార శైలి ఎలా ఉందో.

– ప్రేక్షకులు అన్ని గమనిస్తున్నారు
కోవిడ్ తర్వాత ప్రేక్షకుల ఆలోచన శైలి మారింది. ఓటీటీల పుణ్యమా అని అన్ని రకాల సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా వారు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా బాలీవుడ్ దర్శకులు కొత్త తరహా కథలను అందించలేకపోతున్నారు. ఇదే సమయంలో దక్షిణాదిలో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఎందుకు ఈ ఏడాది ఇప్పటివరకు బాలీవుడ్ లో ఒక్క స్ట్రెయిట్ సినిమా కూడా 200 కోట్ల క్లబ్లో చేరలేకపోయింది. రాజమౌళి త్రిబుల్ ఆర్, ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ వంటి చిత్రాలు మాత్రమే బాలీవుడ్ ను కాపాడాయి. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా నష్టాలను తెలుగు వర్తమాన హీరో నిఖిల్ కార్తికేయ 2 తీర్చిందంటే మీరు నమ్ముతారా? అసలు మొదట్లో థియేటర్లే ఇవ్వని యజమానులు.. తర్వాత అన్ని మూసుకొని కార్తికేయ 2 సినిమాకి థియేటర్లు ఇచ్చారు. అది కూడా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా ప్రదర్శన ఆపి.
సొంత కథలు లేక రీమేక్ లు చేస్తున్నారు
సినీ పరిశ్రమలో ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా విజయాలు ఉన్నవారినే గౌరవిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఏ సినీ నటుడి కేరీర్ అయినా ఒక్క శుక్రవారం తోనే తేలిపోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఆ సినీ రంగానికి చెందిన తారలు దక్షిణాది సినిమాల వైపు దృష్టి సారించారు. బాలీవుడ్ మూవీ మేకర్లు సౌత్ సినిమాలను చూసి పాఠాలు నేర్చుకోవాలంటూ అక్కడి మీడియా కోడై కూస్తోంది. ఈ నేపథ్యంలో విక్రమ్ వేద సినిమా ఇప్పుడు వార్తల్లో ఉంది. సరిగ్గా మూడేళ్ల క్రితం పుష్కర్, గాయత్రి దంపతుల దర్శకత్వంలో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా కోలీవుడ్లో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. కొన్నాళ్ల నుంచి సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న హృతిక్ రోషన్ ఈ సినిమా హిందీ రీమేక్ లో నటించాడు. అతడికి పోటీగా సైఫ్ అలీ ఖాన్ పోలీస్ పాత్రలో నటించాడు. ఈ సినిమా టీజర్ చూస్తే మక్కికి మక్కి దించినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య దక్షిణాది సినిమాలను రీమేక్ చేసే విషయంలో బాలీవుడ్ దర్శకులు సొంత ప్రయోగాలు చేస్తుండటంతో హీరోల మూతులు,చేతులు కాలిపోతున్నాయి. ఇందుకు ఉదాహరణే అక్షయ్ కుమార్ కట్ పుత్లి. డిస్నీ హాట్ స్టార్ లో ఈ సినిమా విడుదలైంది గానీ.. థియేటర్లో విడుదలయితే నిర్మాతకు తడిగుడ్డే మిగిలేది. ఇండియన్ సినిమాలోనే టాప్ నాచ్ క్రైమ్ థ్రిల్లర్ అయిన రాక్షసుడు సినిమాని నానా పెంట చేశారు ఈ సినిమా ద్వారా. ఈ ఫలితాన్ని గుర్తు ఎరిగారు కాబట్టి విక్రం వేదా హిందీ రీమేక్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయలేదు. కేవలం విక్రమ్ వేదానే కాకుండా.. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో, విజయ్ మాస్టర్, మోహన్లాల్ దృశ్యం 2, విక్రమ్ అపరిచితుడు… షూటింగ్ దశలో ఉన్నాయి.. మలయాళం సినిమా హెలెన్, నయనతార సినిమా కొలమావు కోకిల కూడా హిందీలో రీమేక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. సూరారై పోట్రు కూడా అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ అవుతోంది. మలయాళీ సినిమా ది గ్రేట్ ఇండియన్ కిచెన్ కూడా రీమేక్ అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్, అయ్యప్పనుమ్ కోషియమ్, కన్నడ యూటర్న్ సినిమాలు కూడా రీమేక్ బాటలో ఉన్నాయి. ఇంకా మునుముందు ఎన్ని సినిమాలు రీమేక్ లు చేస్తారో చూడాలి.