IT Attacks On BRS MLAs: తెలంగాణలో ఐటీ అధికారులు ఒక్కసారిగా జూలు విధిల్చారు. భారత రాష్ట్ర సమితికి చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్ళు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్ లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం మొదలైన ఈ సోదాలు కడపటి సమాచారం అందే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో సాధికార భారత రాష్ట్ర సమితి నేతల ఇళ్లల్లో వరుసగా అది కూడా ఏకకాలంలో ఐటి అధికారులు సోదాలు చేయడంతో కలకలం నెలకొంది. దీంతో ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలైంది.
మెదక్ ఎంపీ ఇంట్లో..
ఐటీ అధికారులు ముందుగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసాలలో తనిఖీలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే ఈ సోదాలు ప్రారంభించారు. కొండాపూర్ లోని లుంబిని ఎస్ ఎల్ ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్ లో ప్రభాకర్ రెడ్డి ఉండే ఇంటి తోపాటు అతని కార్యాలయాలోనూ ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. సెంట్రల్ ఫోర్స్ బందోబస్తు మధ్య ఈ సోదాల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అధికారులు ఇంతవరకు ఏం స్వాధీనం చేసుకున్నారో బయటకు చెప్పడం లేదు.
భువనగిరి ఎమ్మెల్యే ఇంట్లోనూ..
అలాగే భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయన నివాసం, కంపెనీలలో బుధవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు మొదలుపెట్టారు. భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని కార్యాలయాల్లో మొత్తం 12 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ ల్లోనూ ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్ గా ఉన్నారు. ఇటు ఎంపీ, అటు ఎమ్మెల్యే నివాసాల్లో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేయడంతో భారత రాష్ట్ర సమితి వర్గాల్లో ఒత్తిడి నెలకొంది. ఎమ్మెల్యే నివాసంలో ఐటీ అధికారులు సుమారు 30 బృందాలతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.. శేఖర్ రెడ్డి ఇంట్లో కీలక డాక్యుమెంట్లను ఐటి అధికారులు సీజ్ చేశారు. రెండు కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లు, ఆస్తుల పత్రాలను ఐటి అధికారులు సీజ్ చేశారు. రెండు వాహనాల్లో శేఖర్ రెడ్డి ఇంటి నుంచి ఐటీ అధికారులు మరోచోటకు వెళ్ళినట్టు ప్రచారం జరుగుతున్నది.
జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్ లోనూ
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్స్ పై కూడా ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కెపిహెచ్ బీ కాలనీలోని జెసి బ్రదర్స్ షాపింగ్ మాల్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన తనిఖీలు కడపటి సమాచారం అందే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. జేసీ బ్రదర్స్ కు సంబంధించి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, అతడి బంధువులు డైరెక్టర్లు గా కొనసాగుతున్నారు. జేసీ బ్రదర్స్ లో జరిగిన లావాదేవీల పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక మునుముందు మరి కొంతమంది అధికార పార్టీ నేతల ఇళ్లల్లోనూ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఐటి అధికారులు తనిఖీలు చేయడం, అది కూడా ఆర్థికంగా బలంగా ఉన్న భారత రాష్ట్ర సమితి నేతలు టార్గెట్ గా సాగుతుండడంతో కలకలం నెలకొంది.