Deccan Chronicle Venkatarami Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఐటీ అధికారుల సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపడుతున్న అధికారులు.. మనీలాండరింగ్ కు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న దక్కన్ క్రానికల్ ఎండి వెంకటరామిరెడ్డిని ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం చెలరేగింది. వెంకటరామిరెడ్డి మనీలాండరింగ్ కు పాల్పడ్డట్టు, బ్యాంకులను మోసం చేసినట్టు రుజువులు లభించడంతో ఈడి అధికారులు ఆయనను అరెస్టు చేశారు. గతంలో మనీలాండరింగ్ కు పాల్పడినట్టు సిబిఐ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై విచారణ జరిపిన ఈడి అధికారులు.. బుధవారం ఉదయం తమ కార్యాలయానికి వెంకటరామిరెడ్డిని పిలిపించారు. ఈ కేసుకు సంబంధించి రుజువులు లభ్యం కావడంతో ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.
మోసాలు
దక్కన్ క్రానికల్ పేపర్ ఓనర్ వెంకటరామిరెడ్డి కి పలు వ్యాపారాలు ఉన్నాయి. ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు దక్కన్ చార్జర్స్ అనే క్రికెట్ టీం ను కూడా కొనుగోలు చేశాడు. ఇతడి బ్యాంకు మోసాలు వెలుగులోకి రావడం, నష్టాలు భరించలేని స్థాయికి చేరుకోవడంతో ఆ టీం ను సన్రైజర్స్ జట్టుకు అమ్మేశాడు. ఆ తర్వాత తన సారధ్యంలో వెలువడే ఆంధ్రభూమి పత్రికను కూడా నిలిపివేశాడు. ఇక దక్కన్ క్రానికల్ లాభాల్లో ఉండడంతో దాన్ని మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నాడు. ఈయనకు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాల్లో 14 విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని కూడా ఈడీ అటాచ్ చేసింది. వెంకటరామిరెడ్డి బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో ఆరు ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసింది. ఇక గతంలో 386 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. వెంకటరామిరెడ్డి తో పాటు మరో వ్యాపారవేత్త మణి అయ్యర్ ని కూడా ఈడీ అరెస్టు చేసింది.
విస్తరణ పేరుతో మోసం
వెంకటరామిరెడ్డి తన వ్యాపార విస్తరణ పేరుతో పలు బ్యాంకుల నుంచి 8800 కోట్ల అప్పును తీసుకున్నారు. అప్పు కు సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు బ్యాంకులకు సమర్పించారు. బ్యాంకులకు నిర్ణీత సమయంలో వడ్డీ చెల్లించకపోవడంతో అవి నోటీసులు జారీ చేశాయి. నోటీసులు తప్పుడు అడ్రస్ కు వెళ్లడంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించి వెంకటరామిరెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. అయితే ఈ వ్యవహారం భారీ మోసానికి చెందినది కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇందులోకి ఎంటర్ అయ్యాయి. అప్పటినుంచి దక్కన్ క్రానికల్ కు చెందిన పలు ఆస్తులను అటాచ్ చేశాయి. ఇక బ్యాంకులను మోసం చేసిన కేసులో సిబిఐ దాఖలు చేసిన ఫిర్యాదులకు సంబంధించి ఈడి అధికారులు బుధవారం వెంకటరామిరెడ్డిని, మణి అయ్యర్ ను అరెస్టు చేశాయి. వీరిద్దరూ కలిసి కావాలనే బ్యాంకులను మోసం చేసినట్టు ప్రకటించాయి. దక్కన్ క్రానికల్ ఆస్తుల విలువ మరింత పెంచి చూపించి మణి అయ్యర్ బ్యాంకులను బురిడి కొట్టించాడని ఈడీ అధికారులు అభియోగాలు మోపారు. ప్రస్తుతం దక్కన్ క్రానికల్ ఎండి అరెస్టు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.