Israel Hamas Conflict: ఇజ్రాయిల్ దూకుడు..గాజా ఉంటుందా? కాలగర్భంలో కలిసిపోతుందా?

గాజాలోని ఓ ఆస్పత్రిపై ఇజ్రాయిల్ ఏరియల్‌ దాడులు జరిపింది. ఏకంగా 500 మంది మృతిచెందారు. గాజాలోని అల్‌-అహ్లీ బాప్టిస్ట్‌ ఆస్పత్రిపై మంగళవారం సాయంత్రం బాంబు దాడులు జరిగినట్లు హమాస్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 18, 2023 4:28 pm

Israel Hamas Conflict

Follow us on

Israel Hamas Conflict: షిరోషిమా, నాగసాకి మీద అమెరికా ణు బాంబులు వేస్తే ఇంతవరకు ఆ ప్రాంతంలో పచ్చగడ్డి కూడా మొలవడం లేదు. ఇరాక్, ఇరాన్ ల పై అమెరికా యుద్ధం చేస్తే ఇంతవరకు అక్కడ శిధిలాలు తొలగించిన దాఖలలు లేవు.. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికా యుద్ధం చేస్తే.. ఇంతవరకు అక్కడ నూతన నిర్మాణాలు సాధ్యం కాలేదు. పైగా అమెరికా దళాలు వెనక్కి వెళ్ళిపోయాయి. తాలిబన్ల చేతిలోకి పాలన రావడంతో ఆఫ్గనిస్తాన్ రాక్షస రాజ్యం అయిపోయింది. అక్కడిదాకా ఎందుకు ఉక్రెయిన్ పై రష్యా సాగించిన యుద్ధంలో ఎంతో విధ్వంసం జరిగింది. ఇప్పుడు అక్కడ శిధిలాలు తప్ప మనుషుల ఆనవాళ్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలోనూ గాజాలో అదే పరిస్థితి కనిపిస్తోంది. పైగా హమాస్ తీవ్రవాదులను మట్టు పెట్టేందుకు ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం.. ప్రపంచాన్ని నివ్వెర పరుస్తోంది. ముఖ్యంగా గాజా ప్రాంతం మీద ఇజ్రాయిల్ దళాలు విపరీతంగా దాడులు చేస్తున్న నేపథ్యంలో.. ఆ ప్రాంతం చరిత్రలో ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆసుపత్రి పై దాడి చేశారు

గాజాలోని ఓ ఆస్పత్రిపై ఇజ్రాయిల్ ఏరియల్‌ దాడులు జరిపింది. ఏకంగా 500 మంది మృతిచెందారు. గాజాలోని అల్‌-అహ్లీ బాప్టిస్ట్‌ ఆస్పత్రిపై మంగళవారం సాయంత్రం బాంబు దాడులు జరిగినట్లు హమాస్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్‌ వరుస దాడుల నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకాలేర్పడుతున్నాయని ఆరోపించింది. అయితే.. ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్ (ఐడీఎఫ్‌) వర్గాలు దీన్ని ఖండించాయి. ఆస్పత్రిలో దాచిన మందుగుండు వల్ల నష్టం జరిగి ఉంటుందని వ్యాఖ్యానించాయి. మరోవైపు ఇజ్రాయెల్‌ అల్టిమేటం మేరకు గాజాలోని 10 లక్షల మంది పాలస్తీనియన్లు దక్షిణ ప్రాంతానికి చేరుకోగా.. ఐడీఎఫ్‌ మంగళవారం ఉదయం నుంచి సెంట్రల్‌ గాజాపై ఏరియల్‌ స్ట్రైక్స్‌ను పెంచింది. దాడుల్లో 88 మంది పౌరులు, వైద్యులు, వైద్య సిబ్బంది చనిపోయారని హమాస్‌ వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటి వరకు 2,778 మంది పౌరులు చనిపోయారని, వారిలో మూడింట రెండొంతుల మంది మహిళలు, చిన్నారులేనని వివరించాయి. ఇజ్రాయెల్‌లోనూ మరణాల సంఖ్య 1,400గా ఉందని ఐడీఎఫ్‌ వర్గాలు తెలిపాయి.

బుధవారం నుంచి మరింత ఉధృతం?

ఇజ్రాయెల్‌-హమాస్-హిజ్బుల్లా మధ్య యుద్ధం.. బుధవారం నుంచి మరింత తీవ్ర రూపు దాల్చింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఉదయం 10నుంచి ఇజ్రాయిల్ లో పర్యటిస్తున్నారు. ఆ తర్వాత ఇజ్రాయెల్‌ మరింత దూకుడుగా వ్యవహరించడమో.. గాజాలో సహాయకచర్యలకు సహకరించడమో జరుగుతుందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. వైట్‌హౌస్‌ వర్గాలు మాత్రం.. గాజాలో మానవతా సాయానికి సహకరిస్తేనే.. తన పర్యటన సాగుతుందనే షరతును బైడెన్‌ విధించారని.. ఇజ్రాయెల్‌ అందుకు ఒప్పుకొన్నందునే బుధవారం ఉదయం ఆయన టెల్‌ అవీవ్‌కు వెళ్లారని పేర్కొన్నాయి. యుద్ధాన్ని విరమించేలా ఈజిప్ట్‌ అధ్యక్షుడు ఫతా, ఇరాక్‌ ప్రధాని మహమ్మద్‌ షియా-అల్‌-సుదానీ, జర్మనీ చాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్జేతో బైడెన్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపాయి. గాజాపై గ్రౌండ్‌ వార్‌కు సిద్ధమని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్ (ఐడీఎఫ్‌) ఇప్పటికే ప్రకటించినా.. బైడెన్‌ పర్యటన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గాజాపై యుద్ధాన్ని ఆపాలని పలుదేశాలు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెస్తున్నాయి. తమ వద్ద ఉన్న బందీలు క్షేమమేనని పేర్కొంటూ హమాస్‌ ఉగ్రవాదులు 78 సెకన్ల నిడివిగల ఓ వీడియోను విడుదల చేశారు. ఇజ్రాయెల్‌లోని జైళ్లలో ఉన్న 6 వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తేనే.. తమ వద్ద ఉన్న బందీలను వదిలిపెడతామంటూ హమాస్‌ ఉగ్రవాదులు ఆ వీడియోలో వెల్లడించారు. గాజాపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఇరాన్‌ సుప్రీంలీడర్‌ అయతుల్లా అలీ ఖమేని ఇజ్రాయెల్‌ను డిమాండ్‌ చేశారు. గాజాపై బాంబుల దాడి జరుగుతుంటే.. ఇస్లామిక్‌ దేశాలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించారు. కాగా, ఓవైపు హమాస్ తో పోరు జరుగుతుండగా.. లెబనాన్‌ నుంచి హిజ్బుల్లా ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో.. ఐడీఎఫ్‌ లేజర్‌ ఆయుధాలను(ఐరన్‌ బీమ్‌) ఉపయోగించాలని యోచిస్తోంది.