MLC Kavitha -BJP: తెలంగాణ రాజకీయాలు మరోమారు వెడెక్కాయి. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూతురు, ఎమ్మెల్యే కవితపై చేసిన ఆరోపణలు బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య అగ్గి రాజేసింది. సీఎం కేసీఆర్ తన కూతురును బీజేపీలోకి ఆహ్వానించారని సంచలన ఆరోపణ చేశారు. దీనికి బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి.. కవితను బీజేపీ ఆహ్వానించలేదని, కవితనే కాంగ్రెస్‌లో చేరాలని చూస్తోందని సంచలన ఆరోపణ చేశారు. ఈమేరకు ఆమె ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో ఫోన్‌లో మాట్లాడినట్లు ఏఐసీసీ ఆఫీస్ బేరర్ తనకు చెప్పాడని తెలిపారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య మళ్లీ వ్యక్తిగత ధూషణలకు దారి తీశాయి. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిచేసే వరకూ వెళ్లాయి.

కేసీఆర్ కుటుంబం టార్గెట్‌గా..
ఎమ్మెల్యేల కొనుగోలుతో బీజేపీ తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిందని సీఎం కేసీఆర్‌తోపాటు తెలంగాణ మంత్రులు పదేపదే ఆరోపిస్తున్నారు. దీనికి బీజేపీ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారని తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబంలోనే సఖ్యత లేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఎంపీ అర్వింద్ కవిత కాంగ్రెస్ గూటికి వెళ్లాలని చూసినట్లు ఆరోపించారు. దీని ద్వారా కేసీఆర్‌కే, కవితకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పదల్చుకున్నారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ ప్రకటన సమయంలో కేసీఆర్ కవితను, ఎంపీ సంతోష్‌కుమార్‌ను ఆహ్వానించకపోవడాన్ని కూడా ప్రస్తావించారు.
కాంగ్రెస్‌లో చేరే పరిస్థితి ఉందా..
వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ పతన దిశలో పయనిస్తోంది. ప్రస్తుతం ఈ పార్టీని వీడుతున్నవారే తప్ప చేరుతున్న వారు కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో కవిత కాంగ్రెస్‌లో చేరాలని చూసిందన్న అర్వింద్ ఆరోపణలు నమ్మశక్యంగా అనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితే. లిక్కర్ స్కాం నుంచి బయట పడేందుకు కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లాలని ప్రయత్నించి ఉంటుందని అనుకునే అవకాశం కూడా లేదు. ఎందకంటే ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లినా లిక్కర్ స్కాం కేసు మాఫీ కాదు. ఎందుకంటే కాంగ్రెస్ కేంద్రంలో కూడా అధికారంలో లేదు. ఈ నేపథ్యంలో అర్వింద్ చేసిన ఆరోపణలు క్రెడిబులిటీ లేకుండా పోయాయి..

బీజేపీ ఆఫర్ నిజమేనా..?
మరి ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లు బీజేపీ నేతలు కవితను కమలం గూటికి రావాలని ఆహ్వానించింది నిజమేనే అంటే అవికూడా అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు క్రెడిబులిటీ 50–50గా ఉంది. ముఖ్యమంత్రి కూతురును లాగడం ద్వారా టీఆర్‌ఎస్‌ను దెబ్బతీయవచ్చని బీజేపీ ఆలోచించి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో కేసీఆర్, కేటీఆర్‌పై కవిత అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమే బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లి ఉండొచ్చన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. తాను బీజేపీలోకి వెళితే తన వెంట ఎమ్మెల్యేలు వస్తారని కవిత కూడా కమలనాథులతో చర్చించి ఉండవచ్చన అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆఫర్ ఇచ్చినవారి పేర్లు ఎందుకు చెప్పడం లేదు..
తన కూతురును బీజేపీలోకి ఆహ్వానించారన్న కేసీఆర్.. వారి పేర్లు చెప్పడం లేదు. మోయినాబాద్ ఫాంహౌస్ కేసులో కాల్ రికార్డులు, పేర్లు బయటకు చెప్పిన కేసీఆర్ తన కూతురు విషయంలో పేర్లు చెప్పకపోవడం, కాల్ రికార్డులు బయట పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక కవిత కూడా తనకు ఏక్‌నాథ్ షిండే లాంటి ఆఫర్ ఇచ్చారని ప్రకటించింది. కానీ ఆఫర్ ఇచ్చినవారి పేర్లు మాత్రం చెప్పనని ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. లిక్కర్ కేసు నుంచి బయటపడేందుకు ఆమే బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లి ఉంటారని తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే కవిత తనను బీజేపీలోకి ఆహ్వానించిన వారి పేర్లు చెప్పడానికి ఇష్టపడి ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు.