TRS MLAs Purchase Case: తెలంగాణతో పాటుగా జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ నుంచి శనివారం విడుదల అయ్యే అవకాశం ఉంది. మోయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బాధితులుగా చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 22 రోజులుగా ప్రగతి భవన్‌లోనే ఉంటున్నారు. ఫాం హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకు వచ్చిన తరువాత ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వారిని ఇన్నాళ్లు తనతోనే ఉంచుకున్నారు. జెడ్‌ప్లస్ భద్రత, బుల్లెట్‌ప్రూఫ్ కారు సమకూర్చారు. అయినా.. బయటకు మాత్రం కనిపించకుండా దాచారు. ఎట్టకేలకు వారికి కేసీఆర్ విముక్తి కల్పించబోతున్నారు. శనివారం నుంచి ఆ నలుగురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు వెళ్లనున్నారు.

22 రోజుల తరువాత బయటకు
ఆ నలుగురు ఎమ్మెల్యేలు.. 22 రోజులుగా ప్రగతి భవన్‌లోనే ఉన్నారు. మధ్యలో మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్లే సమయంలో సీఎం కేసీఆర్ తన వెంట తీసుకెళ్లారు. వేదికపైన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వారిగా పరిచయం చేశారు. ఇన్ని రోజులు ఈ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌లోనే ఉండటం పైన రాజకీయంగానూ విమర్శలు ఎదురయ్యాయి. తాండూరు, కొల్లాపూర్ ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కనిపించడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు కొల్లాపూర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు.
తాండూరులో పట్నంకు పైలెట్ దెబ్బ
ఇక, ఇప్పుడు బయటకు వస్తున్న నలుగురు ఎమ్మెల్యేలు నేరుగా తమ నియోజకవర్గాలకు వెళ్లనున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో కీలకంగా వ్యవహరించిన తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి.. ఇకపై తాను నియోజకవర్గ అభివృవృద్ధిపై దృష్టి సారించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి వర్సస్ రోహిత్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో రోహిత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు అని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
పల్లె పల్లెకు పైలట్..
పట్నం మహేందర్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి మధ్య జరుగుతున్న అంతర్గత పోరు నేపథ్యంలో తాండూరులో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో పల్లెపల్లెకు పైలట్ పేరిట నియోజకవర్గంలో పర్యటించి సమస్యలను గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని రోహిత్ నిర్ణయించారు.
కొల్హాపూర్‌లోనూ అంతే..
కోల్హాపూర్ నియోజకవర్గంలోనూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్దన్‌రెడ్డి మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే జూపల్లి టీఆర్‌ఎస్‌తో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గం వారిని స్వతంత్ర అభ్యర్థులుగా నిలిపి గెలిపించుకుని టీఆర్‌ఎస్‌కు షాక్ ఇచ్చారు. అయినా తాను టీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని ప్రకటిస్తున్నారు. కాగా, కేసీఆర్ సిట్టింగులకే టికెట్ అని ప్రకటించిన నేపథ్యంలో 22 రోజుల తర్వాత నియోజకవర్గానికి వెళ్తున్న హర్షవర్దన్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

గువ్వల, రేగా పరిస్థితి ఏమిటో..
22 రోజుల తర్వాత సొంత నియోజకవర్గానికి వెళ్తున్న గువ్వల బాలరాజు, రేగా కాంతరావు పరిస్థితిపై కూడా ఉత్కంఠ నెలకొంది. నలుగురు ఎమ్మెల్యేల్లో గువ్వల బాలరాజు ఒక్కరే టీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచారు. అయితే ఆయనపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. నియోజకవర్గ ప్రజలు ఆయనకే ఫోన్ చేసి పరువు తీయడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఆయనను ఎలా స్వీకరిస్తారనేది ఆసక్తిగా ఉంది. ఇక రేగా కాంతరావు పరిస్థితి కూడా అంతే.. ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. తన పట్టు నిలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేగా వర్గానికి చెక్‌పెట్ట ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా టీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని తరచూగుర్తుచేస్తున్నారు. టికెట సిట్టింగులకే అని ప్రకటించిన నేపథ్యంలో రేగాపై కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.