Vijaysai Reddy
Vijaysai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గుతోందా? జగన్ ఆయనను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉన్నారా? ఢిల్లీ బాధ్యతల నుంచి తప్పించేందుకే ఆ నాలుగు జిల్లాల బాధ్యుడిగా నియమించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఢిల్లీ బాధ్యతలు నుంచి విజయసాయిని తప్పించి వైవి సుబ్బారెడ్డి అప్పగిస్తారని సమాచారం. ఒక వ్యూహం ప్రకారమే విజయ్ సాయి రెడ్డిని తప్పిస్తున్నట్లు వైసిపిలో టాక్ నడుస్తోంది.
ఆ మధ్యన కొద్ది నెలలపాటు విజయ్ సాయి రెడ్డి పార్టీలో సైలెంట్ అయ్యారు. పార్టీకి అంటి ముట్టనట్టుగా వ్యవహరించారు. అయితే ఇటీవల తిరిగి యాక్టివయ్యారు. ప్రత్యర్థులపై సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో విజయ్ సాయి ని నాలుగు జిల్లాల ఇంచార్జిగా నియమించారు. అయితే ఈ నియామకం వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఢిల్లీ రాజకీయాలనుంచి విజయసాయిని తప్పించేందుకే ఈ కొత్త ఎత్తుగడ అని తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ పదవి నుంచి వైవి సుబ్బారెడ్డిని తొలగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయనకు ఢిల్లీ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఢిల్లీ వేదికగా విజయసాయిరెడ్డి వైసీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేశారన్న అనుమానం నాయకత్వంలో ఉంది. అందుకే అకస్మాత్తుగా విజయసాయిని పిలిపించి రాయలసీమలో నాలుగు జిల్లాల బాధ్యతను కట్టబెట్టారు. ఇదంతా ముందస్తు వ్యూహం మేరకు చేసిన పనేనని తెలుస్తోంది.
వాస్తవానికి ఒక్క రాజ్యసభ పదవి తప్పించి విజయ్ సాయి రెడ్డి వద్ద మరి ఏ పోస్టు లేదు. తొలుత ఉత్తరాంధ్ర ఇన్చార్జి పదవి నుంచి తొలగించారు. సోషల్ మీడియా సైతం తప్పించారు. అనుబంధ విభాగాల సమన్వయ బాధ్యతల నుంచి సైతం పక్కన పెట్టారు. అయితే నాయకత్వంతో ఎక్కడో తేడా కొట్టినందువల్లే తప్పించారని పార్టీలో ప్రచారం ప్రారంభమైంది. అయితే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలతో విజయ్ సాయి రెడ్డి అవసరం అనివార్యంగా మారింది. దీంతో జగన్ పిలిపించి ఆ నాలుగు జిల్లాల బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పగించారు. అయితే ఆ నాలుగు జిల్లాల్లో వైసిపి పటిష్టంగా ఉంది. అక్కడ విజయ్ సాయి చేయడానికి పని అంటూ లేదు. అందుకే పనిలేని బాధ్యతలు అప్పగించి.. ఢిల్లీ పగ్గాలకు కోత వేసినట్లు తెలుస్తోంది.