CM Jagan: రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ గెలిస్తే తమ బ్రతుకులే మారిపోతాయని చాలా వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. వారి ఆశలు తీరకపోగా.. తిరిగి వారే ప్రభుత్వ బాధిత వర్గాలుగా మారిపోయారు. ఏం చేయాలో తెలియక లో లోపల వారు మదన పడుతున్నారు. కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం విచారకరం.
సర్పంచులుగా ఎన్నికై రెండేళ్లు గడుస్తోంది. రాజ్యాంగబద్ధంగా రావలసిన నిధులు పంచాయతీలకు దక్కడం లేదు. చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదు. కనీసం సచివాలయ ఉద్యోగులకు, వలంటీర్లకు ఉన్న గౌరవం సైతం సర్పంచులకు లేదు. అప్పులు తెచ్చి మరి పనులు చేసిన వారికి రిక్త హస్తము ఎదురవుతోంది. వడ్డీలు పెరుగుతుండడంతో వారిలో ఆందోళన నెలకొంటుంది. అటు ప్రజల్లోనూ చులకన అవుతున్నారు. దీంతో బలవన్మరణాలకు ఆశ్రయిస్తున్నారు.
పల్నాడు జిల్లాలో రోజుల వ్యవధిలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ తో పాటు ఆయన కుమారుడు మృతి చెందారు. గురజాల మండలం గంగవరం గ్రామ సర్పంచ్ గా వైసీపీ నాయకుడు బుక్కిశెట్టి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు నాగేశ్వరరావు స్థానికంగా కొన్ని పనులు చేయించారు. వీటికి గాను సుమారు 20 లక్షల రూపాయలు అప్పులు చేశారు. పంచాయతీలో నిధులు లేకపోవడం, ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వడ్డీలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో రుణదాతల నుంచి ఒత్తిడి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న నాగేశ్వరరావు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటినుంచి మనస్థాపంతో తండ్రి వెంకటేశ్వర్లు కుమిలిపోయారు. అనారోగ్యానికి గురై ఆదివారం మృతి చెందారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది
అయితే ఇది ఓ వెంకటేశ్వర్ల కుటుంబం పరిస్థితి కాదు. రాష్ట్రంలో అధికార పార్టీ సర్పంచులు సైతం తెగ బాధపడుతున్నారు. వైసిపి ప్రభుత్వం లో ఎందుకు ఎన్నికయ్యామా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని.. కనీసం పంచాయితీలో చిన్నపాటి పనులు కూడా పూర్తి చేయలేక సతమతమవుతున్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న జగన్ కు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.