Pawan Kalyan- Vijayasai Reddy: రాజకీయాలన్నాక ఎత్తూ పల్లాలు ఉంటాయి. గెలుపోటములు సహజం. ఈ రోజు ఓడిన వారు గెలుస్తున్నారు. గెలిచిన వారు ఓడిపోతున్నారు. రాజకీయ దిగ్గజాలకే ఓటమి తప్పలేదు. అలాగని ఓడిపోయిన వారంతా అసలు నాయకులే కాదనుకోవడం అమాయకత్వం. రెండు స్థానాలతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ విస్తరించలేదా? 300 పైచిలుకు స్థానాలకు ఇప్పుడు చేరుకోలేదా? అందుకే ఏ పార్టీని, ఏ వ్యక్తిని, ఏ వ్యవస్థను తక్కువ అంచనా వేయకూడదు. ఇవన్నీ ఎందుకంటే పవన్ అంటేనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఒకరకమైన చులకన భావం ఉండేది. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఒక నాయకుడేనా? ప్యాకేజీ తీసుకున్న నువ్వెక్కడ? 151 స్థానాలు గెలిచిన జగన్ ఎక్కడ అని అసందర్భ వ్యాఖ్యలతో పవన్ ను విజయసాయిరెడ్డి తూలనాడుతూ వచ్చారు. అంతులేని విజయం, ఆర్థిక, అంగబలం తమకే ఉన్నట్టు రెచ్చిపోయారు. ఇప్పుడు అదే విజయసాయిరెడ్డి పవన్ అంటే భయపడుతున్నారు. ఆ మాట వింటే హడలెత్తిపోతున్నారు.

ప్రస్తుతం విజయసాయి రెడ్డి పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. తాను ఎప్పుడో అవినీతిలో కూరుకుపోగా.. ఇప్పుడు కుటుంబసభ్యులను కూడా ఊబిలో దించేశారు. దానిని నుంచి బయటపడలేక లోలోన మదనపడుతున్నారు. ఢిల్లీ పెద్దల కళ్లా వేళ్లా పడిన వారు కనికరించడం లేదు. పొద్దున్న లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకూ వారికి గుడ్ మార్నింగ్ ల నుంచి పొగుడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టినా వర్కవుట్ కాలేదు. చట్టం తన పని తాను చేసుకుందన్న రీతిలో విజయసాయిరెడ్డి అండ్ కో జైలుబాట పడుతున్నారు. ప్రస్తుతానికి అల్లుడు సోదరుడు వెళ్లాడు. ఇప్పుడు అల్లుడు అరెస్ట్ కాక తప్పదంటున్నారు. రేపో మాపో తన పేరు సైతం బయటకు వస్తుందని విజయసాయిరెడ్డికి బెంగ వెంటాడుతోంది.

సరిగ్గా ఇదే సమయంలో ప్రధాని మోదీ నుంచి పవన్ కు ఆహ్వానం అందింది. దీంతో విజయసాయిరెడ్డికి ముచ్చెమటలు పడుతున్నాయి. గతంలో తాను పవన్ పై చేసిన కామెంట్స్ ఒక్కొక్కటీ గుర్తుకు వస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కామెంట్స్ తోనే విశాఖలో విజయసాయి భూదందా బయటపడింది. ఆయన అల్లుడు, కుమార్తె బినామీ సంస్థల రాచకార్యాలు బయటపడ్డాయి. మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అల్లుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో పట్టుబడితే.. కూతురు విశాఖలో రుషికొండను ఆక్రమించేశారు. అయినా ఎలాగోలా బీజేపీ పెద్దల సహకారంతో బయటపడడానికి విజయసాయి చేయని ప్రయత్నం లేదు. కానీ అవన్నీ బెడిసికొట్టాయి, అరెస్ట్ ల పర్వం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పవన్ కనుక బీజేపీకి రూట్ మ్యాప్ అడిగితే అది విజయసాయిరెడ్డి అక్రమాలతో మొదలయ్యే అవకాశముంది. ప్రధాని వద్ద పవన్ ప్రస్తావించే చాన్స్ ఉంది. అందుకే పవన్ క పీఎంవో కార్యాలయం నుంచి ఆహ్వానం అందకుండా శకుని ప్రయత్నాలు చేసిన ఆయన నీరుగారిపోయారు. పవన్ కు నేరుగా ఆహ్వానం అందేసరికి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. ఒక వైపు ప్రధాని పర్యటనకు తోరణాలు, బ్యానర్లు కట్టించే పనిలో విజయసాయి ఉండగా… రాచ మర్యాదలతో పవన్ ప్రధాని చెంతకు చేరనున్నారు. రాజకీయాలు అంటే ఇలానే ఉంటాయి మరీ.