Internal Conflicts In YCP: ఆ పార్టీలో అధినేత మాటకు తిరుగులేదు. ఆయన మాటే శాసనం. క్రమశిక్షణ కలిగిన పార్టీ. కట్టుదాటితే నేతల పని అంతే. ఇన్నాళ్లూ ఏపీలో అధికార వైసీపీ గురించి అందరూ చేసే వ్యాఖ్యానాలివి. అన్ని పార్టీల్లా కాదు వైసీపీ అంటే అన్న మాట వినిపించేది. కానీ క్రమేపీ ఆ పార్టీ కూడా అన్ని రాజకీయ పక్షాల మాదిరిగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అన్ని పార్టీల మాదిరిగా నేతలు బహిరంగంగానే తిట్టుకొంటున్నారు. కొట్టుకొని రచ్చకెక్కుతున్నారు. ఇప్పటివరకూ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడిన నేతలకు విసుగొచ్చిందేమో.. సొంత పార్టీ నేతలపై కూడా నోరు పారేసుకుంటున్నారు. పార్టీలో మేమంటే మేము అంటూ ఆధిపత్యం చెలాయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు భగ్గుమనడంతో అధిష్టానానికి తలనొప్పులు ప్రారంభమయ్యాయి. అధినేత అంటే భయం అన్న మాట ఉత్తిదే అని తేలిపోయింది. నేతలు కట్టుదాటుతున్నా కట్టడి చేయలేక అధిష్టాన పెద్దలు సైతం చేతులెత్తేస్తున్నారు.
అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు నేతలు ప్రయత్నిస్తుండడంతో విభేదాలు ముదురుతున్నాయి. టిక్కెట్ రాదన్న అభద్రతా భావంతో ఒకరు, ఎలాగైనా టిక్కెట్ సాధించాలన్న ప్రయత్నంతో నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ రచ్చకెక్కుతున్నారు. పార్టీ పరువును బజారున పడేస్తున్నారు.
Also Read: Chandrababu:పొత్తుకు పోదామా..? పంతం నెగ్గిచ్చుకుందామా..?
తాజాగా కృష్ణా జిల్లాలో చోటు చేసుకున్న పరిణామం ఒక విధంగా పార్టీలో ప్రకంపనలు రేపిందనే చెప్పాలి. ఆ ఇద్దరు నేతల పేరు చెబితే విభేదాలనే మాటే గుర్తుకురాదు. కానీ మూడేళ్లుగా సైలెంట్ గా ఉన్న నియోజకవర్గం.. కాస్త లైన్ క్రాస్ చేసింది. అటు ఎమ్మెల్యే.. ఇటు ఎంపీ.. తగ్గేదేలే అనే విధంగా వ్యవహరించడంతో పార్టీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.ఇప్పటికే పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మంత్రి విడదల రజినీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరూ కలిసి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్నది లేదు. తాజాగా ఇదే లిస్ట్ లో కృష్ణా జిల్లా కేంద్ర మచిలీపట్నం చేరింది. బందరు ఎంపీకి, ఎమ్మెల్యేకి మధ్య సైలెంట్ గా సాగుతున్నవార్ కాస్తా.. ఇప్పుడు ఓపెన్ అయింది.
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరీని.. స్థానిక ఎమ్మెల్యే పేర్నినాని వర్గం అడ్డుకోవడంతో ఒక్కసారిగా దుమారం రేగింది.బందరులో పలుచోట్ల పర్యటించేందుకు బాలశౌరి సిద్ధమవగా.. పేర్ని నాని వర్గానికి చెందిన కార్పొరేటర్ తో పాటు పలువురు ఎంపీని అడ్డుకున్నారు. అంతేకాదు ఎంపీ గౌ బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు. దీంతో తన నియోజకవర్గంలో తనను ఎందుకు తిరగనీయరంటూ.. ఇక్కడే ఉండి ఎవరి సంగతి ఏంటో తేలుస్తానని బాలశౌరి ఛాలెంజ్ చేశారు. ఆ తర్వాత ఏకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. బందరులో పేర్ని నాని ఆగడాలకు అంతేలేకుండా పోతోందని.. మూడేళ్లుగా ఒక్క కార్యక్రమానికి కూడా తనను పిలవలేదని ఆయన ఆరోపించారు. అంతేకాదు ఇతర పార్టీకి చెందిన సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తో అంటకాగుతున్నారని బాంబు పేల్చారు. అంతేకాదు తన ప్రత్యర్థి, టీడీపీకి చెందిన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను వారంవారం కలుస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య అగాధం
ఐతే పార్టీలో అసంతృప్తుల సంగతి పక్కనబెడితే.., పేర్నినానికి మంత్రిపదవి ఉన్నంత కాలం ఎంపీ బాలశౌరి సైలెంట్ గానే ఉన్నారు. నానిని కేబినెట్ నుంచి తప్పించిన తర్వాత అసమ్మతి బయటపడింది. మంత్రిగా ఉండగా పేర్ని నాని.. ఎంపీని జనంలోకి రాకుండా అడ్డుకున్నారనేది బాలశౌరి ఆరోపణల ద్వారా తెలుస్తోంది. ఇన్నాళ్లు ఇంత జరుగుతుంటే ఎంపీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లలేదా.. ఒకవేళ ఇంటర్నల్ మీటింగ్స్ లో చెప్పినా.. పేర్ని నాని తన మాటనెగ్గించుకున్నారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదు. తాజాగా ఈ లిస్టులో కృష్ణాజిల్లా చేరడం వైసీపీ అధిష్టానానికి పెద్ద తొలనొప్పే. గడిచిన ఎన్నికల్లో వైసీపీకి చెందిన 23 మంది ఎంపీలుగా ఎన్నికయ్యారు. పేరుకే ఎంపీలుకానీ వారికి ఎటువంటి గుర్తింపు లేదు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కాలు పెట్టనీయడం లేదు. దీంతో వారు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయామని తెగ బాధ పడుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీచేయాలని భావిస్తున్నారు. అధిష్టానం కూడా ఎమ్మెల్యేలను మార్చుతామని భావిస్తున్న తరుణంలో ఎంపీలు కూడా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడే విభేదాలు వెలుగుచూస్తున్నాయి. అయితే కట్టడి ప్రయత్నం చేస్తే పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న భయం అధిష్టానానికి వెంటాడుతోంది.
Also Read:KTR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. కేటీఆర్ సంచలన ప్రకటన!