CM Jagan vs Raghurama Krishnam Raju: ఆ పార్టీ అసమ్మతి ఎంపీ పార్టీ అధిష్టానంపైనే నేరుగా విమర్శలు చేస్తాడు. తూలనాడుతూ మాట్లాడుతాడు. పార్టీకి ఇష్టంలేని మీడియాను వేదికగా చేసుకొని ప్రభుత్వ విధానాలనే తప్పుపడతాడు. అధినేత మాటలను, హవభావాలను అనుకరించి వ్యంగ్యంగా మాట్లాడతాడు. గత మూడేళ్లుగా మాట్లాడుతునే ఉన్నాడు. పార్టీకి కొరకరాని కొయ్యగా మారాడు. నేతలకు కంటిమీద నలుసులా మారాడు. అయినా ఇంతవరకూ ఆయనపై చర్యలు లేవు సరికదా. పార్టీ నుంచి కూడా సస్పెన్షన్ వేటు పడలేదు. ఇంతకి ఆ ఎంపీ ఎవరంటే మన రఘురామక్రిష్ణంరాజు. నరసాపురం నుంచి వైసీపీ తరుపున ఎంపీగా గెలిచిన రఘురామక్రిష్ణంరాజు కొద్దినెలల పాటే వైసీపీతో భౌతికంగా కలిసి ఉన్నారు. తరువాత పార్టీ అధినేత తీరును విభేదిస్తూ వచ్చారు. చివరకు అక్రమ కేసులను సైతం ఎదుర్కొన్నారు.
పోలీస్ లాఠీ దెబ్బలను సైతం చవిచూశారు. కానీ ఈయన విషయంలో కేసులు, వేధింపులు పక్కనపెడితే.. సీఎం జగన్ ఏమీచేయలేకపోయారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఎంతో పరపతి ఉన్న జగన్ రాజు గారి విషయంలో మాత్రం చతికిలపడిపోతున్నారు. నాకంటూ ఒక ఈమేజ్ ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు నన్నే గెలిపిస్తారన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటన తో సీఎం జగన్ కు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపేశారు. అదే రఘురామరాజు విషయానికి వచ్చేసరికి మాత్రం జగన్ వెనుకడుగు వేయడంపై మర్మమేమిటో అన్నది హాట్ టాపిక్ గా మారింది. 151 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలు ఉన్న పార్టీకి ఒక్క ఎంపీని వదులుకోవడం ఇష్టం లేదా? లేకుంటే రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Also Read: Internal Conflicts In YCP: జగన్ కు కొత్త తలనొప్పులు.. పార్టీలో అసలేం జరుగుతోంది?
రెండున్నరేళ్లుగా..
రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలని గత రెండున్నరేళ్లుగా వైసీపీ నేతలు కోరుతూ వస్తున్నారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. తాజాగా రఘురామపై అనర్హతా వేటుకు అవకాశం లేదని లోక్‌సభ స్పీకర్ కార్యాలయం తెలిపింది. విప్ ఉల్లంఘించినప్పుడు మాత్రమే అనర్హతా వేటుకు అవకాశం ఉంటుందని స్పీకర్ ఆఫీస్ తెలిపింది. ఇతర ఫిర్యాదుల విషయం ప్రివిలేజ్ కమిటీ వద్ద ఉందని.. వాటిపై విచారణ జరుగుతోందని.. ఆ నివేదిక ఎప్పుడు వస్తుందో తెలియదని ప్రకటన విడుదల చేసింది. అలాగే రఘురామ ఫిర్యాదు చేసిన తనపై పోలీసుల దాడి అంశం కూడా స్పీకర్ కార్యాలయం పరధిలోకి రాదన్నారు. స్పీకర్ కార్యాలయం ప్రకటన ప్రకారం రఘురామపై అనర్హతా వేటు సాధ్యం కాదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు వైసీపీ జారీ చేసిన ఎలాంటి విప్‌ను ధిక్కరించలేదు. ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనో.., మరో కారణం చేతనో ఆయనపై వేటు వేయలేరు. చట్టం ఆ వెసులుబాటు కల్పించలేదు. దీంతో వైసీపీ ప్రయత్నాలు పూర్తిగా విఫలమైనట్లేనని అర్థం చేసుకోవచ్చు.
వైసీపీ వర్గాల్లో నిరాశ..
స్పీకర్ ఈ అంశంపై స్పష్టత ఇవ్వడంతో వైసీపీ వర్గాలు కూడా నిరాశపడుతున్నాయి. నిజానికి రఘురామపై అనర్హతా వేటు సాధ్యం కాదని న్యాయనిపుణులు ముందు నుంచీ చెబుతున్నారు. అనర్హతా చట్టంలో చాలా స్పష్టంగా ఎప్పుడు అనర్హతా వేటు వేయాలో చెప్పారు. ఓ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ విప్‌ను ఉల్లంఘించినప్పుడు అనర్హతా వేటు వేయాలని చట్టంలో ఉంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినా వేటు వేయవచ్చు. అయితే రఘురామ ఏ పార్టీలోనూ చేరలేదు. తాను వైసీపీలోనే ఉన్నానంటున్నారు. ఈ కారణంతో జగన్ పంతం నెరవేరే అవకాశం లేదని తేలిపోయింది. రాజకీయ ఒత్తిళ్లు తెచ్చినా ప్రయోజనం లేకపోయింది.ఒక వేళ వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా ఆయన మరింత స్వతంత్రంగా వ్యవహరిస్తారు. ఇప్పటికి మించి విమర్శలు గుప్పిస్తారు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరవుతారు. అప్పుడు పరిస్థితి మరింత జఠిలమవుతుంది. అందుకే వైసీపీకి అచీతూచీ వ్యవహరిస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read:Chandrababu And Pawankalyan: పవన్ తో పొత్తుకు పోదామా..? పంతం నెగ్గిచ్చుకుందామా..?