Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కుంభకోణంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు శుక్రవారం భారీ ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని నిబంధనలు మాత్రం విధించింది. జూన్ 1 వరకు అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. అనేక రకాల షరతులు విధించింది. అరవింద్ కేజ్రివాల్ ముఖ్యమంత్రి విధులకు దూరంగా ఉండాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు మార్చి 21న అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. అయితే అరవింద్ కేజ్రీవాల్ పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే వాటిని కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్ లను వ్యతిరేకిస్తూ ఈడీ కూడా సమర్ధంగా వాదించింది. ఈ నేపథ్యంలో ఇటీవల మరోసారి అరవింద్ కేజ్రివాల్ బెయిల్ పిటిషన్ కోర్టు ఎదుట విచారణకు వచ్చింది. ఆ కేసును విచారించిన కోర్టు తీర్పును మే పదో తేదీకి రిజర్వ్ చేసింది.
శుక్రవారం తీర్పును వెలువరించింది. దీంతో అరవింద్ కేజ్రివాల్ బెయిల్ మంజూరు పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తనకు అవకాశం ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ చేసుకున్న అభ్యర్థనపై ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని కోర్టులో వాదించారు. ఇక గత మే 3న అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. సందర్భంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ ఇచ్చే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని.. తాము వెలువరించే తీర్పుపై ఎవరూ ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. “ఒకవేళ ముఖ్యమంత్రిగా ఏదైనా ఫైల్స్ పై సంతకాలు చేయాల్సి వస్తే”.. అనే విషయాన్ని కూడా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పరిశీలించాలని వివరించింది.. బెయిల్ మంజూరు చేస్తే ముఖ్యమంత్రి బాధ్యతలకు దూరంగా ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు సూచించింది. నాటి మాటలను శుక్రవారం నాటి తీర్పులో ధర్మాసనం మరోసారి గుర్తు చేసింది. బెయిల్ పై జైలు నుంచి విడుదలైనా.. అరవింద్ కు అధికారాలు ఉండవు. ఎటువంటి అధికారిక కార్యక్రమాలలో పాల్గొనే హక్కు ఉండదు. కేవలం ఆయన ఎన్నికల్లో ప్రచారం మాత్రమే చేయగలుగుతారు.