Telangana Politics: ఏ లీడర్ కైనా పార్టీయే అల్టిమేట్. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సిందే. పార్టీ అప్పగించిన బాధ్యతలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. అయితే పార్టీ అన్నాక వచ్చే నాయకులుంటారు.. బయటకు పోయే నేతలుంటారు. కానీ కొత్త, పాత నాయకులు అన్న గీటురాయి మాత్రం ఉంటుంది. ప్రపంచంలో ఏ పార్టీలోనైనా ఇదే పరిస్థితి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నాం కాబట్టి తమకు ఆధిపత్యం కావాలని పాత నాయకులు.. కొత్తగా వచ్చి పార్టీకి ఊపు తెచ్చాం కాబట్టి పార్టీని తమకు అప్పగించాలని కొత్త నాయకులు కోరడం ఇటీవల రివాజుగా మారింది. ఈ క్రమంలో ప్రత్యర్థులపై రాజకీయ పోరాటం కంటే సొంత పార్టీ వారిపైనే ఎక్కువ మంది కత్తులు దూసుకుంటున్నారు. తెలంగాణలో ఈ పరిస్థితి ఇప్పుడు అన్ని పార్టీలకు దాపురించింది.

కాంగ్రెస్ పార్టీ ఇటువంటి సంస్కృతికి దగ్గరగా ఉంటోంది. ఎప్పుడో గాంధీ పుట్టించిన పార్టీ కనుక వాక్ స్వాతంత్ర్యం ఎక్కువ. ప్రజాస్వామ్య భావజాలం మరింత ఎక్కువ. అందుకే కాబోలు తెలంగాణ కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయిన నాటి నుంచి పాత, కొత్త నాయకత్వాలు అంటూ లొల్లి ప్రారంభమైంది. దానిని సాకుగాచూపి చాలా మంది బయటకు వెళ్లిపోయారు. పార్టీలో ఉన్నోళ్లు వీధి పోరాటాలకు దిగుతున్నారు. ఎప్పుడు నుంచో ఉన్న తమను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇవ్వడం ఏమిటా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సీనియర్లు కొందరు తిరుగుబాటు చేశారు. దీంతో హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ ను దూతగా దించింది. మల్లు భట్టి విక్రమార్క, పరమేశ్వర్ రెడ్డి లాంటి నేతలతో ఆయన చర్చించారు. వారు కూడా మొత్తబడ్డారు. సందడ్లో సడేమియా అన్నట్టు మీరంతా బీజేపీ గూటికి వచ్చేయ్యండని.. కొద్దిరోజుల ముందే కాషాయదళంలోకి దూరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉచిత సలహా ఇచ్చి మరింత హీటెక్కించారు.
అటు అధికార భారతీయ రాష్ట్ర సమితి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అక్కడ కూడా ఉద్యమ తెలంగాణ, బంగారు తెలంగాణగా కొత్త,పాత నాయకులు విడిపోతున్నారు. ఉద్యమ తెలంగాణ అంటే ప్రారంభం నుంచి టీఆర్ఎస్ వెంట నడిచిన వారు.. బంగారు తెలంగాణ అంటే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత చేరి పదవులు చేజిక్కించుకున్నవారు. ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధిస్తే.. పాలన పేరిట కేసీఆర్ ఇతర పార్టీల నాయకులను పార్టీలో తీసుకోవడం పాత నాయకులను రుచించలేదు. మంత్రి పదవులు దక్కక ముందు శ్రీనివాస్ గౌడ్, నాయని నరసింహారెడ్డి ఇదేరకమైన వాదన తెచ్చారు. మంత్రి పదవులొచ్చాక సైలెంట్ అయ్యారు. అయితే ఇటీవల మల్లారెడ్డి పై తిరుగుబాటు విషయంలో బీఆర్ఎస్ లోని ఉద్యమ తెలంగాణ నాయకులు తెరపైకి వచ్చారు. బీఆర్ఎస్, కేసీఆర్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు.

అయితే కాంగ్రెస్, టీఆర్ఎస్ కంటే బీజేపీలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడ ఆధిపత్యం కోసం కొత్తగా చేరిన నేతలు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. హైకమాండ్ మాత్రం ఆవిర్భావం నుంచి ఉన్న వారికే ప్రయారిటీ ఇస్తోంది. కొత్తగా చేరిన వారు మాత్రం తమ వల్లేపార్టీకి ఊపు వచ్చిందని.. తెలంగాణలో అధికార పార్టీకి దీటుగా పార్టీ ఎదిగిందని గుర్తుచేస్తున్నారు. తమ చేతికి పార్టీని అప్పగించాల్సిందేనని సవాల్ చేస్తున్నారు. పక్క పార్టీలో మంచి గుర్తింపుతో ఉన్న తమను ఎందుకు పిలిచారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే తెలంగాణలో ప్రధాన మూడు పార్టీలో పాత, కొత్త నాయకుల మధ్య కీచులాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. అవి పార్టీకే మైనస్ చేస్తాయని ఆయా పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.