Gummadi Anuradha: సర్పంచ్ కొడుకు ఊళ్లో రాజకీయాలను కంటిచూపుతో శాసిస్తున్న రోజులివి. ఎమ్మెల్యే కూతురు భూ దందాలు చేస్తున్న రోజులివి. మంత్రి బంధువులు దౌర్జన్యాలకు తెగబడుతున్న రోజులు కూడా ఇవే. అదేదో సినిమాలో చెప్పినట్టు.. రాజకీయాలనేవి పేటెంట్ రైట్ లాంటివి. వారసులు ఏమైనా చేయవచ్చు. దేనికైనా తెగించవచ్చు.. అప్పుడు అనిపిస్తుంది ఇది ప్రజాస్వామ్యమా? అని.. అదే సమయంలో కొంతమంది వల్ల ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలుగుతుంది.. అలాంటి వారే గుమ్మడి అనురాధ. ఈమె తండ్రి పేరు గుమ్మడి నరసయ్య. గుమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. అత్యంత సామాన్యమైన జీవితం గడుపుతున్నారు. తన లాగే తన పిల్లలనూ పెంచారు. తన కూతురు గుమ్మడి అనురాధను ఏకంగా ఓయూ లా కాలేజ్ ప్రిన్సిపాల్ ను చేశారు.. రాష్ట్ర చరిత్ర ఓయూ లా కాలేజ్ కు ఒక మహిళ ప్రిన్సిపల్ కావడం ఇదే మొదటిసారి.
తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని..
గుమ్మడి నరసయ్య న్యూ డెమోక్రసీ పార్టీ ద్వారా ఇల్లందులో పోటీ చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. చిన్నప్పటినుంచి తండ్రినే చూస్తూ పెరిగిన అనురాధ.. ఆయన లాగానే ప్రజా సమస్యలు పరిష్కరించాలని అనుకుంది. కూతురు ఇష్టాన్ని గమనించిన నరసయ్య కూడా ఆమెను అదేవిధంగా ప్రోత్సహించాడు. మూడో తరగతి వరకు అనురాధ స్వగ్రామంలోనే చదివింది. ఇల్లందు మండలం సుదిమల్ల లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్లో 10 వరకు చదివింది. అక్కడి గిరిజన కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. తర్వాత డిగ్రీ ఇల్లందులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పూర్తిచేసింది. ఎమ్మెల్యే కూతురు అయినప్పటికీ ఎక్కడ కూడా ఆ దర్పాన్ని ప్రదర్శించలేదు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే పీడీఎస్ యూ విద్యార్థి సంఘం వైపు ఆకర్షితురాలయింది. బహుశా తన తండ్రి న్యూ డెమోక్రసీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం వల్ల కావచ్చు, ఆమె వామపక్ష విద్యార్థి సంఘాన్ని ఇష్టపడింది. ఆ సంఘంలో ఉంటూనే విద్యార్థి సమస్యల పై పోరాటాలు సాగించింది. వాస్తవానికి కలెక్టర్ కావాలనుకున్న అనురాధ.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం న్యాయవాద వృత్తి వైపు మళ్ళింది.. ఉస్మానియా యూనివర్సిటీలో లా ప్రవేశ పరీక్ష రాసింది. మెరుగైన మార్కులు సాధించి న్యాయవిద్యను అభ్యసించింది. గిరిజనుల ఆస్తి హక్కులపై పీహెచ్ డీ పూర్తి చేసింది.
న్యాయవిద్యాలయ ప్రొఫెసర్ గా..
పీహెచ్డీ పూర్తి చేసిన తర్వాత అనురాధ వంద సంవత్సరాల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. ఒక ఆదివాసీ మహిళ న్యాయవాద ప్రొఫెసర్ గా నియమితులవడం ఇదే తొలిసారి..కేవలం న్యాయవిద్యను బోధించే ప్రొఫెసర్ గా మాత్రమే ఆగిపోకుండా ఆదివాసీల సమస్యలపై అనురాధ పోరాటం సాగిస్తున్నారు. చదువుకు దూరంగా ఉంటున్న ఆదివాసులను పాఠశాలలకు పంపిస్తున్నారు. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రకారం దక్కాల్సిన హక్కులు గిరిజనులకు అందే విధంగా ఆమె త్వరగా చేస్తున్నారు. ఆర్ ఓ ఎఫ్ ఆర్( షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డివెల్లర్స్/ రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) యాక్ట్ 2006, పెసా( ది ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయతీస్ షెడ్యూల్డ్ ఏరియాస్ టు ఎక్స్ టెన్షన్) యాక్ట్, 1996 చట్టాలు సరిగా అమలయ్యేందుకు అడుగులు వేస్తున్నారు. ఇవి సరిగా అమలు కాకపోవడం వల్ల చాలావరకు ఆదివాసి సమూహాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. 33 సంవత్సరాలు ఉన్న ఈ ఆదివాసి యువతీ తండ్రి ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ, ఆదివాసి సమూహాల్లో కొత్త భరోసాగా నిలవడం నిజంగా అభినందనీయం.. కేవలం చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని నిరూపించడం మరింత ప్రశంసనీయం. ఈమెను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ఆదివాసీలు ఈరోజు చదువుల్లో రాణిస్తున్నారు. అంతకుమించిన ఆనందం ఇంకొకటి ఏముంది. ఐదుసార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ గుమ్మడి నరసయ్య ఎన్నడు తన పిల్లల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించలేదు. ప్రజల్లోనే ఉన్నాడు. ప్రజల కోసం పాటుపడుతున్నాడు. ఆయన పిల్లలు కూడా ఆయన దారిని అనుసరిస్తున్నారు. ఒక ప్రజా నాయకుడికి ఇంతకంటే కావాల్సింది ఏముంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని పెత్తనం చెలాయించే ముఖ్యమైన మంత్రుల కంటే, తండ్రి అధికారాన్ని ఆసరాగా తీసుకొని లిక్కర్ స్కాములు చేసే కూతుళ్ల కంటే.. గుమ్మడి నరసయ్య పిల్లలు కోటిపాళ్ళు నయం. ఆ జాబితాలో గుమ్మడి అనురాధ పులు కడిగిన ముత్యం.