Homeజాతీయ వార్తలుటీఆర్ఎస్ కు బలాన్ని ఇచ్చిన బెంగాల్ మమత

టీఆర్ఎస్ కు బలాన్ని ఇచ్చిన బెంగాల్ మమత

4 capitals issue india

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కసారిగా తేనెతుట్టను కదిల్చారు. మరోసారి దేశానికి నాలుగు రాజధానులు ఉండాలనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో ఇప్పుడు కన్నంతా హైదరాబాద్‌ మీదనే పడింది. తెలంగాణ జనాభాలో మూడో వంతు హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేస్తే దీనికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి పరిపాలన విభాగం ఏర్పాటు చేస్తారు. శాంతిభద్రతలు కేంద్రం నియంత్రణలోకి వెళ్తాయి. అదే జరిగితే రాష్ట్రానికి రాజకీయంగా, ఆర్థికంగా గుండె కాయలాంటి హైదరాబాద్ పై టీఆర్ఎస్ పెత్తనం పోతుంది. తెలంగాణ నామ్ కే వాస్తే రాష్ట్రంగా మిగిలిపోతుంది.

ఇప్పటికే తెలంగాణలో పట్టుసాధించాలని బీజేపీ ఆరాటపడుతోంది. రానున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో పట్టు సాధించాలని యోచిస్తోంది. ఒకవేళ అలా జరగకపోతే రెండో రాజధానిని తమ అజెండాలోకి తెచ్చుకునేందుకు రెడీ అవ్వనుంది. ఇప్పుడు మమత లేవనెత్తిన నాలుగు కుంపట్లతో ఇక ఈ వివాదం జోలికి పోకపోవచ్చు. బీజేపీకి అల్టీమేట్‌గా దేశంలో శాశ్వతంగా అధికారంలో ఉండే వ్యూహం ముఖ్యం. ఇంకా దేశానికి సంబంధించి తన అజెండాను పూర్తిగా అమలు చేయాలంటే మరో రెండు మూడు దఫాలు వరుసగా అధికారం అవసరమని బీజేపీ అగ్రనాయకత్వం అభిప్రాయపడుతోంది. జమ్ము కశ్మీర్ ను అత్యంత సాహసోపేతంగా విడదీసి ఆ మేరకు కమలం పార్టీ దేశవ్యాప్తంగా రాజకీయ ప్రయోజనం సాధించింది. మతపరంగా బలమైన పట్టుకోసం మరో కొత్త ఎత్తుగడతో వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది.

నిన్నామొన్నటి వరకూ హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం క్రమేపీ వివిధ రాష్ట్రాల్లో వేళ్లూనుకుంటోంది. ఇది బీజేపీకి లాభించే చర్యనే. ఎంఐఎంను చూపించి హిందూ ఓట్లను సంఘటితం చేసుకోవచ్చు. లౌకిక వాదం ప్రస్తావనతో మైనారిటీల పట్ల మౌనం వహించే ఇతర పార్టీలు తీవ్రంగా నష్టపోతాయి. ముస్లింల సంఖ్య మరీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఎంఐఎం లాభపడుతుంది. హిందూ ఓట్లు అత్యధికంగా ఉండే మొత్తం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసి వస్తుంది. ఈ ఫార్ములా బాగానే వర్కవుట్ అవుతోంది. అయితే ఎంఐఎంను కట్టడి చేయకపోతే , దానిపై చర్యలకు పూనుకోకపోతే కాంగ్రెస్‌తో, ప్రతిపక్షాలతో కలిసే ప్రమాదం ఉంది. అందువల్ల ఎంఐఎంను శాశ్వత శత్రువుగా తనతో నేరుగా పోటీ పడే ప్రత్యర్థిగా మలచుకోవాలని బీజేపీ భావిస్తోంది.

మరోవైపు.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమబంగాల్‌, కర్ణాటక, తెలంగాణల్లో ఎంఐఎం కారణంగా బీజేపీకి భారీగా లబ్ధి చేకూరుతుందనేది రాజకీయ అంచనా. కేంద్ర పెత్తనంతో హైదరాబాద్ పై రాజకీయంగా పట్టు సాధిస్తే దేశంలో ఎంఐఎంను నియంత్రించగల శక్తి బీజేపీ మాత్రమే అని ప్రజలు భావిస్తారు. అందుకే దేశంలో రెండో రాజధాని ప్రతిపాదనకు బీజేపీ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే.. బీజేపీ రాజకీయ ప్రయోజనాల సంగతి ఎలా ఉన్పప్పటికీ దేశంలో రెండో రాజధాని దక్షిణభారతంలో ఏర్పాటు కావాల్సిన వ్యూహాత్మక అవసరం ఉంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్ అందుకు అనువైన ప్రాంతం. అదే విధంగా సుప్రీం కోర్టు బెంచ్ కూడా దక్షిణాదిలో చెన్నై, బెంగుళూరుల్లో ఒకచోట ఏర్పాటు చేయడం సముచితం.

ఉత్తర, దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ హక్కులు అనే డిమాండ్ పెరిగితే ఒకే దేశం ఒకే భాష, ఒకే మతం అన్నట్లుగా రాజకీయాలు నడుపుతున్న కమలం పార్టీ అవకాశాలకు గండి పడుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకూ లోప్రొఫైల్ లో తన మత పరమైన అజెండా ప్రాతిపదికగానే పట్టు పెంచుకునే వ్యూహాలను అమలు చేస్తుంది. అధికార వికేంద్రీకరణ , దక్షిణాదికి సముచిత ప్రాధాన్యం వంటివి మరుగున పడిపోవచ్చు. అయితే మమత లేవనెత్తిన అంశాల కారణంగా రాష్ట్రాలకు వేరే కోణంలో కొంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. 2026లో లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాదిన ఉన్న సీట్ల సంఖ్య మరింత కుదించుకుపోవచ్చు. రాజకీయంగా అలజడి తలెత్తవచ్చు. అందువల్ల మొత్తం సీట్లను పెంచి, దామాషా పద్ధతిలో దక్షిణభారత రాష్ట్రాల ప్రాతినిధ్యం ఇప్పటిలాగే ఉండేలా చూడవచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version