తాను పదవిలో ఉన్నప్పుడే ఎన్నికలు నిర్వహించాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంథం ఎట్టకేలకు నెరవేరబోతోంది. ఎట్టకేలకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సైతం తీర్పునివ్వడంతో నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు రెడీ అయ్యారు.
ఫిబ్రవరి చివరి వరకూ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత వాయిదా పడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ గట్టి పట్టుదలతో ఉన్నారు. ప్రతి ఒక్కరికీ ఒకరోజు వస్తుందని అంటుంటారు. ఇప్పుడు ఏపీలో నిమ్మగడ్డ టైమ్ వచ్చింది. ఇంతకాలం జగన్ సర్కార్ ఆయనతో ఓ ఆట ఆడేసుకుంటే.. ఇప్పుడు పూర్తిగా బంతి నిమ్మగడ్డ కోర్టుకు చేరింది. ఇక ఆయన ఓ ఆట ఆడేసుకోబోతున్నారు. ఇప్పటికే యాక్షన్ మొదలు పెట్టారు. నిమ్మగడ్డ గేమ్ ఆడుతుంటే జగన్ సర్కార్ చేష్టలుడిగి ప్రేక్షక పాత్ర పోషించాల్సిందే తప్ప చేసేదేమీ లేదు.
ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టిన రెండురోజుల్లోనే జగన్ ప్రభుత్వానికి నిమ్మగడ్డ గట్టి షాక్ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం కక్కలేక, మింగలేక అన్న రీతిలో లోలోపలే రగిలిపోతోంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లను బదిలీ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరస్కరించి మొదటి షాక్ ఇచ్చారు. ఆ ఇద్దరిపై ‘సెన్సూర్’ పేరిట క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ చేయడంతోపాటు అభిశంసిస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు.
గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విధి నిర్వహణలో వారు విఫలమైనట్లుగా వారి సర్వీసు రికార్డులో నమోదు చేయాలని ఆదేశించారు. సెన్సూర్ కింద క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆ ఇద్దరు ఉన్నతాధికారులకు ఒక ఏడాదిపాటు పదోన్నతులకు అవకాశం ఉండదు. ఇంతటితో నిమ్మగడ్డ గేమ్ ఆగలేదు. గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లుగా కొత్త వారిని నియమించేందుకు వీలుగా ముగ్గురు చొప్పున అధికారులను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానల్‌ను కూడా నిమ్మగడ్డ తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎస్‌కు రాసిన లేఖలో ఆయన తెలిపారు. విజిలెన్స్ కేసుల్లేని వారి పేర్లనే సూచించాలన్నారు. అప్పటివరకు వారి బాధ్యతలను ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్–1కు అప్పగించాలని నిమ్మగడ్డ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఎస్ఈసీ ఆదేశాల మేరకు గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, చిత్తూరు కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తాలతోపాటు తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డిలను జీఏడీకి సరెండర్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇంటింటికీ రేషన్ పంపిణీ పథకం కొత్తదా లేక పాతదా? అనే విషయమై వివరణ ఇవ్వాలని సీఎస్‌కు నిమ్మగడ్డ లేఖ రాశారు. ఇప్పుడు నిమ్మగడ్డ చేతికి అధికారాలు రావడంతో ఇక ఆడిందే ఆట.. పాడిందే పాటలా మారింది ఆయన పాలన.