
Achampet MLA: హుజూరాబాద్ ఫలితం చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. ఈ ఎన్నిక రాష్ట్రం ప్రజల దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు ఇప్పటికీ చాలా మంది నేతలకు మింగుడుపడటం లేదు. ఈ ఫలితం పర్యావసానాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. తాజాగా టీఆర్ఎస్‌కు చెందిన మరో నేతకు ఈ ఫలితం తలనొప్పిగా మారింది. ఎక్కడెక్కడి నుంచో ఆయనకు కాల్స్ చేసి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరా నేత ? ఎందుకు ఆయనకే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ?
ఎన్నికలకు ముందు ఛాలెంజ్..
హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్బంగా టీఆర్ఎస్ నేతలంతా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈటెల రాజేందర్ పై ఆరోపణలు చేశారు. అక్కడ టీఆర్ఎస్ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ‘‘హుజూరాబాద్‌లో బీజేపీ గెలిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని’’ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఓ టీవీలో డిబేట్ సందర్భంగా ఆయన బీజేపీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అక్కడ ఎవరూ ఊహించని విధంగా ఈటెల రాజేందర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో ఆ ఎమ్మెల్యేకు ఒత్తిడి ఎక్కువవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు, ఇతర పార్టీలకు చెందిన వారు ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఫోన్ చేస్తున్నారు. ‘‘ సార్ హుజూరాబాద్ లో బీజేపీ గెలిచింది కదా.. మరి ఎప్పుడు రాజీనామా చేస్తారు’’ అంటూ కాల్స్ చేస్తున్నారు. ‘‘ ఈటెల విజయం సాధిస్తే మీరు రాజీనమా చేస్తానని ఛాలెంజ్ విసిరారు కదా ఇంకా ఎందుకు చేయడం లేదు’’ అంటూ ఆయనకు కాల్ చేసి సెటైరికల్ గా మాట్లాడుతున్నారు.
ఇలాంటి కాల్స్ ఆయనకు ప్రతీ రోజు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఆయన ఇబ్బంది పడుతున్నారు. టీఆర్ఎస్‌కు బలం చేకూరుస్తామని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎమ్మెల్యే బాలరాజుకే తలనొప్పిగా మారాయి. ఈ మధ్య వచ్చే ఇలాంటి కాల్స్‌కు సమాధానం చెప్పలేక విసిగిపోతున్నారు. ఈ కాల్స్ ను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాట్సాప్ ల ద్వారా షేర్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలోనూ దాడి..
అచ్చంపేట ఎమ్మెల్యే(Achampet MLA) గువ్వల బాలరాజుకు ఫోన్ కాల్స్ ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో ద్వారా కూడా బీజేపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారు. టీవీ డిబేట్‌లో మాట్లాడిన క్లిపింగ్స్, ఈటెల విజయానికి సంబంధించిన క్లిప్పింగ్స్ జోడించి మీమ్స్ తయారు చేస్తున్నారు. రాజీనామా ఎప్పుడు చేస్తారంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్‌కు చేసిన కాల్స్ చేసి, ఆ రికార్డింగ్స్‌ను అందులో పోస్ట్ చేస్తూ ఆనందం పొందుతున్నారు.
Also Read: సీఎం కేసీఆర్ మదిలో ఉన్నది వారే.. ఎమ్మెల్సీ పదవులు వారికే..