Polavaram: ఏపీ జీవనాడి పోలవరం. దశాబ్దాలు గడుస్తూనే ఉన్నాయి కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం ఏపీ ప్రభుత్వ జేబు సంస్థగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాడు తెలుగుదేశం పార్టీ, నేడు వైసీపీ సర్కార్ కు నిధుల వరద పారించే ప్రాజెక్టుగా మారిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు, జగన్ ఒక్కటేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరం పనుల సమీక్ష పేరిట చంద్రబాబు హడావిడి చేసేవారు. తామే ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని.. కేంద్ర భాగస్వామ్యం లేకుండా చేశారు. అలాగని పనుల్లో ముందడుగు వేయలేకపోయారు. రాజకీయ తప్పిదాలతో చివరకు ఆ అపవాదును కేంద్ర ప్రభుత్వం పై నెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వైసీపీ సర్కార్ సైతం అడుగడుగునా నిర్లక్ష్యం చూపుతోంది. గడువుల మీద గడువులు విధించుకొని కాలయాపన చేస్తోంది. సవరించిన అంచనాలపై అవసరమైన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని పిపిఏ కోరినా.. పదేపదే గుర్తుచేసినా అందించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి సహాయ మంత్రి ఇటీవల స్వయంగా ప్రకటించారు.
పోలవరం నిర్మాణం విషయంలో ప్రత్యేక ప్రణాళిక అంటూ ఏదీ లేదు. నిర్మాణాలు చేపడుతుండడం.. అవి కొట్టుకుపోతుండడం రివాజుగా మారింది. నాటి చంద్రబాబు హయాం నుంచి నేటి జగన్ వరకు ఇదే పరిస్థితి. అందుకే కేంద్ర ప్రభుత్వం పోలవరం ఏపీ పాలకులకు జేబు సంస్థగా మారిపోయిందని ఎద్దేవా చేస్తున్నారు. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని టిడిపి విభేదించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని మోదీ చంద్రబాబుపై అదే విసుర్లు విసిరారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం గా మారిపోయిందని ఆరోపించారు. ఇటీవల అంచనా వ్యయాలకు సంబంధించి వివరాలను కేంద్రం కోరిన రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేదు. దీంతో మరోసారి ఏపీ తీరుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. పోలవరం విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న విధానాన్నే.. జగన్ సైతం అనుసరిస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.