Chandrababu Arrest: ఎవడితోనైనా పెట్టుకోగాని.. బాల్య స్నేహితులతో కాదు.. ఆ మధ్యన వచ్చిన ఓ సినిమాలో కామెడీ డైలాగు ఇది. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో ఈ డైలాగ్ గుర్తుకొస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్, ఆయన రిమాండ్ తదనంతర పరిణామాలు అందరికీ తెలిసిన విషయమే.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం తెలుగు వారు ఉండే ప్రతి చోట నుంచి ఆయనకు మద్దతు వెల్లువెత్తింది. ఎవరికి వారుగా బయటకు వస్తూ ఆందోళనలు, నిరసనలు చేపడుతున్న ఉదంతాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి.
అయితే రోజుకో రీతిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు వినూత్న స్థాయిలో నిరసనలు చేపడుతున్నారు.తాజాగా చంద్రబాబు బాల్యమిత్రులు తెరపైకి వచ్చారు.తమ మిత్రుడి అక్రమ అరెస్టు నిరసిస్తూ వారంతా దీక్ష బూనారు.చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితంలో పెద్దగా స్నేహితులు ఉండరని.. ఎవరికి ఎలాంటి సాయం చేయరని.. ఏదైనా పనిచేయాలని అడిగితే.. ఎక్కడ ఇబ్బంది వస్తుందో నన్న ఉద్దేశంతో తప్పించుకుంటారన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే తాజాగా ఆయన బాల్యమిత్రులు నిరసన చేపట్టడం అందర్నీ ఆకట్టుకుంటుంది. చంద్రబాబు విషయంలో వారు చెబుతున్న మాటలు విస్మయానికి గురిచేస్తున్నాయి. మా స్నేహం మీద ఒట్టు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయరని బాల్యమిత్రులు, సన్నిహితులు చెబుతుండడం హాట్ టాపిక్ గా మారింది.
తిరుపతి జిల్లా చంద్రగిరిలో చంద్రబాబు బాల్య స్నేహితులు రిలే దీక్షలు చేపట్టారు. భారీ స్థాయిలో హాజరయ్యారు. ఆయన బాల్య స్నేహితులు మాట్లాడుతూ చిన్నతనము నుంచే చంద్రబాబుది కష్టపడే మనస్తత్వం. కుట్రలు, కుతంత్రాలు, నీతిమాలిన రాజకీయాలు ఆయనకు తెలియవు. కష్టం విలువ తెలిసిన వ్యక్తి. సీఎం జగన్ కక్ష సాధింపులో భాగంగానే ఆయనను జైలుకు పంపారు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వీరంతా చంద్రబాబు సొంత సామాజిక వర్గం వారు కాదు.వారి పేర్లు,నేపథ్యం చూస్తుంటే అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారిగా కనిపిస్తున్నారు. మొత్తానికైతే చంద్రబాబుకు మద్దతుగా బాల్యమిత్రులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతూ ఉండడం విశేషం.