AP BJP: ఏపీలో పొత్తుల విషయంలో బిజెపి ఆలోచన చేస్తోందా? రాష్ట్ర బిజెపి నాయకత్వం అగ్రనేతలకు నివేదించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజెపి ది కీరోల్. కానీ రాష్ట్రంలో దానివల్ల బిజెపికి వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఓట్లు, సీట్లు పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న పార్టీగా మాత్రమే బిజెపికి గుర్తింపు ఉంది. ఆ పార్టీ పట్ల అభిమానం, భక్తి అంటూ ఇతర పార్టీలకు లేదు. కేవలం రాజకీయ అవసరాల కోసమే బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఏపీలో రాజకీయ ప్రయోజనాలు వచ్చినప్పుడు మిగతా పార్టీలు తన్నుకు పోతున్నాయి. ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు బిజెపి వైపు నెట్టేస్తున్నాయి. దీంతో రాజకీయంగా ముందుకెళ్లలేని పరిస్థితుల్లో ఏపీ బీజేపీ నేతలు ఉన్నారు. వారిది అరణ్య రోదనే. అందుకే అగ్రనేతలకు వాస్తవాలు చెప్పేందుకు రాష్ట్ర బిజెపి బృందం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం.
తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళనున్నట్లు పవన్ ప్రకటించారు. వస్తే బిజెపిని కలుపుకొని వెళ్తామని.. లేకుంటే రెండు పార్టీలు కూటమితో ముందుకు సాగుతాయని స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో పవన్ వెనక్కి తేవడం అనేది దాదాపు కస్త సాధ్యం. అలా అని జనసేన ను విడిచిపెట్టి ఒంటరి పోరాటం అంటేనే సాహసంతో కూడుకున్న పనే. కనీసం ఒక్క శాతం ఓట్లను కూడా తెచ్చుకునే పరిస్థితి లేదని బిజెపి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ఆ రెండు పార్టీలతో కలిసి వెళ్లడమే శ్రేయస్కరమని మెజారిటీ బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. క్షేత్రస్థాయిలో టిడిపికి బలమైన కేడర్ ఉండడం.. పవన్ క్లీన్ ఇమేజ్ తోడైతే మాత్రం ఆ రెండు పార్టీల కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని బిజెపి నేతలు ఒక అంచనాకు వచ్చారు. అందుకే హై కమాండ్ పెద్దలపై ఒత్తిడి తేవాలని భావిస్తున్నారు.
బిజెపి అధ్యక్షురాలుగా నియమితులైన పురందేశ్వరి పొత్తుకు సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్యాడర్లో 80 శాతం మంది తెలుగుదేశం, జనసేన తో కలిసి వెళ్లడం ఉత్తమమని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాయలసీమకు చెందిన మాజీ మంత్రి, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, విశాఖకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే, నంద్యాలకు చెందిన బలమైన నేత రాష్ట్రవ్యాప్తంగా పొత్తు కోరుకునే బిజెపి నేతలను సమీకరిస్తున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఈ బృందం ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్ర నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది.
భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గానీ మేల్కొనకుంటే రాజకీయంగా ఇబ్బందులు ఎదురు కావడం తప్పదని బిజెపి రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. ముందుగా ఏపీలో సీట్లు, ఓట్లు పెంచుకునే వ్యూహం అమలు చేయాలని కోరుతున్నారు. బలం పెంచుకొని రాజకీయ వ్యూహాలు అమలు చేయగలిగితే 2029 నాటికి ఏపీలో బిజెపిని బలోపేతం చేయవచ్చని హైకమాండ్కు నివేదించనున్నట్లు సమాచారం. అయితే బిజెపి అగ్రనేతలు ఎటువంటి స్పష్టతనిస్తారో తెలియాల్సి ఉంది.