Kamineni Srinivas
Kamineni Srinivas: మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నాయకుడు కామినేని శ్రీనివాస్ జనసేనలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014 నుంచి భారతీయ జనతా పార్టీలో కామినేని కొనసాగుతున్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. గత కొంతకాలంగా రాజకీయ ఊగిసలాట లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కైకలూరు నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో దిగేందుకు శ్రీనివాస్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే బిజెపి కంటే జనసేన శ్రేయస్కరమని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తాజాగా పవన్ వారాహి యాత్ర కోసం ఏకంగా జనసేన పార్టీ శ్రేణులతో ఆయన సమీక్ష జరపడం విశేషం. దీంతో ఆయన జనసేనలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో కామినేని శ్రీనివాస్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీలోనే ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. కైకలూరు నియోజకవర్గంలో నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 44 వేల ఓట్లు సాధించారు. టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన జయ మంగళ వెంకటరమణ కేవలం 974 ఓట్లతో విజయం సాధించగలిగారు.2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సిఫార్సుల మేరకు ఆయనకు బిజెపి టికెట్ దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత టిడిపిలోకి వెళ్లాలనుకున్న శ్రీనివాస్ ను చంద్రబాబు అడ్డుకొని… పొత్తులో భాగంగా బిజెపికి ఆ సీటు అప్పగించి కామినేని తో పోటీ చేయించారని టాక్ నడిచింది. అలా బిజెపి అభ్యర్థిగా విజయం సాధించిన కామినేని శ్రీనివాస్ కు పవన్ మద్దతుతో చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారని ఇప్పటికీ ఒక ప్రచారం ఉంది. అయితే టిడిపి, జనసేనల మధ్య పొత్తు కుదరడం.. బిజెపి కలిసి రాకపోవడంతో ఆయన పునరాలోచనలో పడినట్లు సమాచారం.
2019 ఎన్నికల్లో కామినేని శ్రీనివాస్ పోటీ చేయలేదు. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి కైకలూరు నుంచి గెలుపొందాలని కామినేని శ్రీనివాస్ భావిస్తున్నారు. మరోవైపు పొత్తులపై బిజెపి క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ తరుణంలో ఆయన తాజాగా కైకలూరులో టిడిపి, జనసేన, బిజెపి నేతలతో సమావేశం కావడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. మూడు పార్టీల నేతలతో సమావేశం నిర్వహించడం విశేషం. అయితే అక్టోబర్ 6 నుంచి పవన్ వారాహి యాత్ర కైకలూరులో ఉండడంతో.. దానికోసమే ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు వారాహి యాత్రలో బిజెపి పాల్గొనలేదు. పొత్తు ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో మూడు పార్టీల తరఫున కామినేని శ్రీనివాస్ నాయకత్వ బాధ్యతలు తీసుకోవడం విశేషం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జయ మంగళం వెంకటరమణ వైసీపీ గూటికి చేరారు. కామినేని శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారని సమాచారం అందుకునే వెంకటరమణ వైసీపీలోకి జంప్ చేశారని టాక్ నడిచింది. కానీ కామినేని మాత్రం బిజెపిలోనే కొనసాగుతున్నారు. మూడు పార్టీలు మధ్య పొత్తు కుదురుతుందని ఆశాభావంతో ఉన్నారు. ఒకవేళ బిజెపి తట పటాయిస్తే జనసేనలో కచ్చితంగా చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సీటు కామినేని శ్రీనివాస్ కు కన్ఫర్మ్ అయ్యిందని.. పొత్తులో భాగంగా జనసేన, బిజెపిలో ఏ పార్టీకి కేటాయించినా అభ్యర్థి మాత్రం కామినేని శ్రీనివాస్ అని ప్రచారం జరుగుతోంది.