Homeజాతీయ వార్తలుTelangana BJP: తెలంగాణలో హంగ్‌ వస్తే బీజేపీ మద్దతు ఆ పార్టీకే..!?

Telangana BJP: తెలంగాణలో హంగ్‌ వస్తే బీజేపీ మద్దతు ఆ పార్టీకే..!?

Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల రోజులే గడువు ఉంది. నవంబర్‌ 30 ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్‌ 3న ఫలితాలు ప్రకటించనున్నారు. దీంతో అధికార బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌పై కన్నేసింది. విపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామంటే తామంటూ ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌పై 60 శాతం వ్యతిరేకత ఉంది. మిగతా 40 శాతం కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు ఉంది. అయితే.. ప్రీపోల్‌ సర్వేలన్నీ తెలంగాణలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని చెబుతున్నాయి. మూడు పార్టీల సొంత సర్వేల్లో కూడా ఇవే ఫలితాలు వచ్చాయి. పైకి మూడు పార్టీలు అధికారం తమదే అని చెబుతున్నా.. అంతర్గతంగా అధికారం దక్కించుకునేందుకు ప్లాన్‌ ఏతోపాటు ప్లాన్‌ బి కూడా సిద్ధం చేసుకుంటున్నాయి.

కాంగ్రెస్‌ అభ్యర్థులకు బీఆర్‌ఎస్‌ ఆర్థిక సాయం..
తెలంగాణలో 9 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ కాంగ్రెస్, టీడీపీలను కోలుకోకుండా చేశారు. సంపూర్ణ మెజారిటీ ఉన్నా.. ఆ పార్టీల గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఈసారి బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత ఉన్న దృష్ట్యా సంపూర్ణ మెజారిటీ రాకపోతే ప్లాన్‌ బీలో భాగంగా కాంగ్రెస్‌ను చీల్చాలని ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌ నుంచి గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులకు ఆర్థికసాయం చేయాలని కూడా భావిస్తున్నారు. డబ్బులకు కొదవ లేని కేసీఆర్‌ ఇప్పటికే ఆర్థికసాయం చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం.

కాంగ్రెస్‌ మెజారిటీకి దగ్గరగా వస్తే..
ఇక కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లకు దగ్గరగా వచ్చినా కూడా ఆ పార్టీకి అధికారం దక్కకుండా చేయడమే కేసీఆర్‌ లక్ష్యం. ఈ సమయంలో ప్లాన్‌ సీ కూడా రెడీ చేసుకున్నారు. ఇందులో భాగంగా బీజేపీ, ఎంఐఎం మద్దతుతో తెలంగాణలో మూడోసారి సర్కార్‌ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఈమేరకు ఇప్పటి నుంచే బీజేపీతో రాయబేరం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ రెడీ..
ఇక బీజేపీ కూడా తెలంగాణలో అధికారంలోకి వస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అయితే ఇటీవల బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్‌.సంతోష్‌ మాత్రం తెలంగాణలో హంగ్‌ వస్తుందని అధికారం మాత్రం తామే చేపడతామని ప్రకటించారు. బీజేపీకి బలం లేకపోయినా గద్దెనెక్కడం ఖాయం అని పేర్కొన్నారు. దీంతో బీజేపీ కూడా ప్లాన్‌ బి రెడీ చేసుకున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణలో హంగ్‌ వస్తే కాంగ్రెస్‌కు అధికారం దక్కకుండా చేయడానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకావం కనిపిస్తోంది. బీఎల్‌.సంతోష్‌ ప్రకటనే ఇందుకు నిదర్శనం. అయితే బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిస్తే ఎంఐఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇక్కడ మీకు.. అక్కడ మాకు..
తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడానికి బీజేపీ మద్దతు ఇచ్చి… ప్రతిగా 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు బీఆర్‌ఎస్‌ మద్దతు తీసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ బండి సంజయ్‌ను మార్చి కిషన్‌రెడ్డికి పగ్గాలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్‌ ఉన్నప్పుడు దూకుడుగా ఉన్న బీజేపీ, కిషన్‌ రెడ్డి వచ్చాక రేసులో వెనుకబడింది. దీంతో బీజేపీ–బీఆర్‌ఎస్‌ మధ్య లోపాయకారి ఒప్పందం జరిగిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంగా అధికారం కోసం బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version