Telangana Assembly Election: తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. డబ్బుల సర్దుబాటులో నేతలు తలమునకలవుతున్నారు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఓ రాజకీయ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులకు ఒక దఫా డబ్బు సర్దుబాటు చేసిందని సమాచారం. మరికొద్ది రోజులు గడిచిన తర్వాత మిగతా డబ్బు కూడా అందజేస్తామని ఆ పార్టీ పెద్దలు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణకు సరఫరా చేసేందుకు సిద్ధం చేసిన నగదు ఐటీ అధికారులకు దొరుకుతుండడం నివ్వెర పరుస్తోంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఈ స్థాయిలో భారీగా నగదు లభిస్తుందడం కర్ణాటక అధికారులను కూడా ముక్కున వేలేసుకునే విధంగా చేస్తున్నది.
కట్టల కొద్ది నగదు
మంచం కింద వరుసగా అట్టపెట్టెలు.. తెరిచి చూస్తే రూ.500 నోట్ల కట్టలు.. లెక్కిస్తే ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.42 కోట్లు. కళ్లుచెదిరే ఇంత భారీ మొత్తాన్ని బెంగళూరులో ఒక కాంట్రాక్టర్‌కు చెందిన ఫ్లాట్‌లో ఆదాయం పన్ను (ఐటీ) అధికారులు జప్తు చేయటం కలకలం రేపింది. కర్ణాటకలో రాజకీయ ఆరోపణలకు, ప్రత్యారోపణలకు ఈ ఘటన కేంద్రంగా నిలిచింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం పంపించటానికి బెంగళూరులో పెద్ద ఎత్తున నగదు సిద్ధమవుతోందనే ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు గురువారం ఉదయం నుంచే పలువురు కాంట్రాక్టర్ల ఇళ్లపై దాడులు కొనసాగించారు. ఈ క్రమంలో ఆర్టీనగర్ పరిధిలో ఉండే సుల్తాన్‌పాళ్యలో కాంట్రాక్టర్ అంబికాపతి ఫ్లాట్‌లో గురువారం, శుక్రవారం రాత్రుళ్ళు పొద్దుపోయే దాకా అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ గదిలో మంచం కింద 23 అట్టపెట్టెలు ఉండటం గమనించి వాటిని తెరిచి చూశారు. ప్రతీ పెట్టెలో రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి. వాటన్నింటిని కలిపి లెక్కిస్తే రూ.42 కోట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ ఇంట్లో అంబికాపతి తమ్ముడు ప్రదీప్ నివసించేవారని తెలుస్తోంది. గత బీజేపీ ప్రభుత్వంపై 40 శాతం కమీషన్ ఆరోపణలు చేసిన బెంగళూరు సివిల్ కాంట్రాక్టర్ల సంఘానికి అంబికాపతి అధ్యక్షుడు కావడం గమనార్హం. కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘానికి ఆయన ఉపాధ్యక్షుడు కూడా. అంబికాపతి భార్య అశ్వత్థమ్మ బెంగళూరు మాజీ కార్పొరేటర్. 2001లో కావలభైరసంద్ర 95 వార్డు నుంచి ఆమె కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఇదే ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యేకు ఆమె సమీప బంధువని సమాచారం. కాగా, ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అధికారులు రావడం మరో గంట ఆలస్యమై ఉంటే నగదు రవాణా జరిగిపోయేదని, దీనికోసం వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారని తెలిసింది. కాగా, శుక్రవారం పొద్దుపోయాక కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. పట్టుబడిన సొమ్ము గురించి ఐటీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
మరో వైపు దీనిపై జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి స్పందిస్తూ.. ఐటీ అధికారులు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.42 కోట్లు స్వాధీనం చేసుకోవడం.. భారీ స్థాయిలో వసూళ్లు జరుగుతున్నాయని రుజువు చేస్తోందని, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో తేలాలన్నారు. ఈ సొమ్ము పొరుగున ఉన్న తెలంగాణకు వెళ్తున్నట్టు తెలిసిందని చెప్పారు. బీజేపీ నేత, మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ మాట్లాడుతూ, అవినీతి రహిత ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేత ఇంట్లో రూ.42 కోట్లు సీజ్ చేశారని ఎద్దేవా చేశారు. ఈ అక్రమ సొమ్ము నేపథ్యాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్య వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఆరోపణలను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తోసిపుచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా ఐటీ శాఖను వినియోగించుకుంటోందని విమర్శించారు. కాగా, ఇదే అంశంపై తెలంగాణలో రాజకీయ దుమారం చెలరేగింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు.