Telangana Elections 2023: తెలంగాణలో పోలింగ్ ముగిసింది. మరో 48 గంటల్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇంతలో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ కట్టబెట్టాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తెలంగాణ ఫలితాల ప్రభావం ఏపీ పై తప్పకుండా చూపుతాయని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలతో తెలంగాణలో సైతం సీన్ మారినట్లు తెలుస్తోంది. అవే బీఆర్ఎస్ కు ఇబ్బంది కలిగించినట్లు అనుమానాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమైతేడిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయమే.
ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత పరిణామాలు శరవేగంగా మారాయి. అదే సమయంలో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. అయితే చంద్రబాబు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ నుంచి భిన్న వైఖరి వ్యక్తం అయ్యింది. చంద్రబాబు అరెస్టుపై హైదరాబాదులో జరిగిన నిరసనల విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నష్టం చేకూర్చాయని కామెంట్స్ ప్రారంభమయ్యాయి.ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే.. దాని ప్రభావం ఏపీ పై తప్పకుండా చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో వైసిపి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. విపక్షాలన్నీ ముప్పేట దాడి చేస్తున్నాయి. అన్నింటికీ మించి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. బిజెపి సైతం తప్పకుండా కలిసి రావాల్సిన అనివార్య పరిస్థితి ఎదురు కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏపీలో టీడీపీ,జనసేన కూటమిలో చేరేందుకు బిజెపి శరవేగంగా పావులు కదిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో సైతం బిజెపికి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే.. టిడిపి, జనసేన కూటమి కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితి ఉంటుందన్న అంచనా కూడా ఉంది.
ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు.. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు కనబరిస్తే మాత్రం తెలుగుదేశం తో పాటు చాలా పార్టీలు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. అయితే ఎన్నికల ముంగిట కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల నుంచి తప్పుకోవాలంటే బీజేపీతో ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తే మాత్రం… చంద్రబాబుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నేతలు పునరాలోచనలో పడే అవకాశం ఉంది. ఒకవేళ బిజెపితో కలిసి నడవాలంటే.. ఆ పార్టీ ఏపీ విషయంలో కాస్త వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తం పరిణామాలు ఏపీలో అధికార వైసీపీకి మైనస్ గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి డిసెంబర్ 3న ఒక క్లారిటీ రానుంది.