Homeజాతీయ వార్తలుHyderabad: టెర్రరిస్టుల డెన్‌గా హైదరాబాద్‌.. సౌత్‌ వెస్ట్‌ జోన్‌లో మకాం!

Hyderabad: టెర్రరిస్టుల డెన్‌గా హైదరాబాద్‌.. సౌత్‌ వెస్ట్‌ జోన్‌లో మకాం!

Hyderabad: ఒకప్పటి హైదరాబాద్‌ నార్త్‌ జోన్‌.. పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ఏర్పడిన సౌత్‌ వెస్ట్‌ జోన్‌ ఉగ్రవాదుల డెన్‌గా మారింది. నగరంలోని తొలి సంచలనాత్మక టెర్రర్‌ ఉదంతమైన అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్‌ హత్య నుంచి మొదలు మంగళవారం చిక్కిన హిజ్బూ ఉత్‌ తహరీర్‌ (హెచ్‌యూటీ) ఉగ్రవాదుల ఉదంతం వరకు ఇదే స్పష్టం చేస్తోంది. మధ్యప్రదేశ్‌ ఏటీఎస్‌ అధికారులు అరెస్టు చేసిన అయిదుగురిలో ముగ్గురు ఈ జోన్‌లోని గోల్కొండ చుట్టపక్కల నివసిస్తున్న వాళ్లే. ఈ జోన్‌ ఇలా మారడానికి ఎన్నో కారణాలున్నాయి. తాజా అరెస్టులతో అప్రమత్తమైన నిఘా, పోలీసు విభాగాలు ఈ మండలంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.

కలిసి వస్తున్న అంశాలెన్నో...
ఈ జోన్‌లో ఉగ్రవాదులు తలదాచుకోవడానికీ ఉపకరించే అనేకాంశాలు ఉన్నాయి. ఓపక్క ఖరీదైన ప్రాంతాలతోపాటు మధ్య తరగతి ప్రజలు నివసించే కాలనీలు, సామాన్యులు ఉండే బస్తీలు సైతం ఈ మండలంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఏ తరహాకు చెందిన వారైనా ఇక్కడ తేలిగ్గా ఆశ్రయం పొందే అవకాశం ఉంటోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ముష్కరులు ఈ మండలాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు.

విద్య, ఉద్యోగ కారణాలు చూపిస్తూ…
సౌత్‌ వెస్ట్‌ జోన్‌ పరిధిలో విద్యాకేంద్రాలు సైతం ఉంటున్నాయి. సైబరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ సంబంధింత వ్యాపార, ఉద్యోగ సంస్థలు ఎన్నో ఉన్నాయి. వాటిలో పనిచేసే వారిలో అనేక మంది ఈ మండలంలో నివసిస్తుంటారు. వీటికితోడు మెహదీపట్నం, షేక్‌పేట్‌ తదితర ప్రాంతాలు విద్యా సంస్థలకు పెట్టింది పేరు. అకడమిక్‌ విద్యతోపాటు సాంకేతిక విద్యనూ బోధించే చిన్న, పెద్ద సంస్థలు అనేకం ఇక్కడ ఉన్నాయి. వీటికీ తమకు అనుకూలంగా మార్చుకుంటున్న ఉగ్రవాదులు ఆయా సంస్థల్లో విద్యనభ్యసించడం, ఉద్యోగాలు చేయడం వంటి అంశాలతోపాటు ఆ ముసుగులోనూ తలదాచుకుంటున్నారు. ఈ జోన్‌ పరిధిలో దాదాపు అన్ని రాష్ట్రాలతోపాటు కొన్ని దేశాలకూ చెందిన ప్రజలు వసలవచ్చి నివసిస్తుండటంతో ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇక్కడ జీవనం సాగించడం తేలికగా మారిపోయింది.

కొన్ని ఘటనలు..

– 1992లో టోలిచౌకిలోని బృందావన్‌కాలనీలో తలదాచుకున్న ముజీబ్‌ మాడ్యుల్‌ను పట్టుకోవడానికి వెళ్లిన అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్, ఆయన గన్‌మెన్‌లు హత్యకు గురయ్యారు.

– ఐసిస్‌తో లింకులు ఉన్నాయనే ఆరోపణలపై గత నెలలో డిపోర్టేషన్‌కు గురైన కెన్యా యువతి అమీనా నివసించింది టోలిచౌకి ప్రాంతంలోనే.

– గుజరాత్‌ పోలీసులకు మోస్ట్‌వాంటెడ్‌ అయిన గులాం జాఫర్‌ గులాం హుస్సేన్‌ ఫేక్‌ సుదీర్ఘకాలం ఐఏఎన్‌ కాలనీలో టైలర్‌గా ‘అజ్ఞాతవాసం’ చేస్తూ చిక్కాడు.

– ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ శంషాబాద్‌ విమానాశ్రయంలో చిక్కిన సల్మాన్‌ మొహియుద్దీన్‌ హబీబ్‌నగర్‌లోని బజార్‌ఘాట్‌కు చెందిన వాడు.

– 2015 నాటి ‘ఐసిస్‌ త్రయం’ కేసుతో పాటు ఇటీవల నమోదైన ‘ఉగ్ర త్రయం’ కేసులో నిందితుడైన మాజ్‌ హసన్‌ హుమయూన్‌ నగర్‌కు చెందిన వాడు.

– హెచ్‌యూటీ మాడ్యుల్‌లో కీలకంగా వ్యవహరించిన మహ్మద్‌ సల్మాన్‌తో (స్వస్థలం భోపాల్‌) పాటు అబ్దుర్‌ రెహ్మాన్‌(స్వస్థలం ఒడిశా), షేక్‌ జునైద్‌ గోల్కొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించిన వాళ్లే.

– మధ్యప్రదేశ్‌ ఏటీఎస్, తెలంగాణ నిఘా విభాగం నుంచి త్రుటిలో తప్పించుకున్న మహ్మద్‌ సల్మాన్‌ ఇక్కడి శివాజీనగర్‌ వాసి. జవహర్‌నగర్‌లో ఉగ్ర కదలికలు ఉన్నాయని సమాచారంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version