naga shourya farm house Controversial
Naga Shaurya: కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత గాయి చేస్తుందో.. ఇప్పుడు మీడియా కూడా కోతికి మించి కొండెంగలాగా తయారైంది. సెలబ్రెటీలపై పడి గత్తెర లేపుతోంది. వారి తప్పు ఉందా? లేదా? కనీస వివరణ కూడా తీసుకోకుండా అభాండాలు వేస్తోంది. గుట్టుగా కష్టపడి పనిచేసుకుంటున్న వారిని బజారుకీడుస్తోంది. తమ ప్రమేయం లేకున్నా మీడియా చేస్తున్న అతికి పాపం ఆ సెలబ్రెటీల కుటుంబం ఎంత మానసిక క్షోభను అనుభవిస్తుందోనన్న కనీసం ఇంగితం లేకుండా ప్రవర్తిస్తోంది.
naga shourya farm house Controversial
తెలుగు న్యూస్ చానెల్స్ లో తనకు తానే నంబర్ 1 అని చెప్పుకునే ఆ చానెల్ తీరుపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి సంబంధించి ఎలా అయ్యిందో కూడా స్వయంగా హెల్మెట్ పెట్టుకొని మరీ బైక్ మీద ఎక్కి ఆ చానెల్ యాంకర్ చేసిన యాక్టింగ్ చూసి జనాలు విస్తుపోయారు. సోషల్ మీడియాలో ఆ చానెల్ ను తిట్టిపోశారు. మీకు మానవత్వం లేదా? అని దుమ్మెత్తిపోశారు.అయినా బురదలో దొర్లుతున్న ఆ చానెల్ దాన్ని కడుక్కునే ప్రయత్నం చేయకుండా ‘నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు’ అనే తరహాలో అదే బురదను మరింత మందికి అంటిస్తోంది. ఆ చానెల్ అభాండాలకు తాజాగా మరో హీరో బలయ్యాడు.
నాగశౌర్య.. టాలీవుడ్ లోనే యంగ్ టాలెంటెడ్ హీరో. నిర్మాతలకు తన సినిమాల ద్వారా మినిమం గ్యారెంటీ ఇచ్చే సక్సెస్ ఫుల్ హీరో. నాగశౌర్యతో సినిమా చేసే ఈ ఏ నిర్మాత అయినా గుండెల మీద చేయి వేసుకొని కలెక్షన్ల పరంగా కంగారు పడడు. పెద్దగా రెమ్యూనరేషన్ అడగకుండా నిర్మాతల హీరో అనిపించుకుంటాడు. అలాంటి నీట్, క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో కుటుంబంపై తాజాగా తెలుగులోనే టాప్ న్యూస్ చానెల్ తన రేటింగ్ కోసం ‘స్టింగ్’ ఆపరేషన్ పేరిట చేసిన దందాకు బలి చేసింది. హీరో నాగశౌర్యకు సంబంధం లేని వివాదంలోకి ఆయనను లాగి అప్రతిష్ట పాలు చేసింది. కనీసం ఆయన వివరణను.. ఆయన తండ్రి వివరణను తీసుకోకుండా వారి ఫాంహౌస్ లో దొరికిన పేకాట శిబిరంపై అవాస్తవాలతో కట్టుకథలు అల్లింది. రేటింగ్ కోసం ఒక మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న నాగశౌర్య కుటుంబాన్ని చానెల్ అవమానించింది. ఆ కుటుంబం ఎంత క్షోభ పడుతుందన్న కనీస సోయి లేకుండా అవాస్తవాలతో కథనాలు వల్లెవేసింది..తాజాగా పోలీసుల విచారణలో ఈ పేకాట క్లబ్ కు నాగశౌర్యకు కానీ.. ఆయన తండ్రికి కానీ ఎలాంటి సంబంధం లేదని.. వారు లీజుకు ఇవ్వగా ఎవరో అక్రమార్కులు ఇలా తెలియకుండా చేసిన నిర్వాకం అని తేలింది. పోలీసులే నాగశౌర్య కుటుంబానికి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పుడు వారిపై అవాస్తవాలు రాసిన సదురు చానెల్ తల ఎక్కడ పెట్టుకుంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు ఈ పేకాట దందాకు గల అసలు కారణాలను నాగశౌర్య కుటుంబానికి చెందిన సన్నిహితులు నిజాలు బయటపెట్టారు. నాగశౌర్య కుటుంబానికి అసలు ఈ విషయంలో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఆ అగ్ర చానెల్ కుట్ర కోణాన్ని బయటపెట్టారు.
-నాగశౌర్య ఫాంహౌస్ లో పేకాట.. అసలు జరిగింది ఇదీ..
తెలుగు అగ్రన్యూస్ చానెల్ నాగశౌర్య ఫాంహౌస్ లో పేకాట దందా జరిగిందని స్టింగ్ ఆపరేషన్ చేసి దీని వెనుక నాగశౌర్య, ఆయన తండ్రి, బాబాయ్ ఉన్నారంటూ అవాస్తవాలు ప్రచారం చేసింది. నిజానికి ఈ దందాలో అసలు వారికి సంబంధమే లేదని వారి సన్నిహితులు చెబుతున్నారు.
నాగశౌర్య(Naga Shaurya) వాళ్ల చిన్నాన్న వివిధ పనుల నిమిత్తం ఫాంహౌస్ ను ఆఫీసుగా మార్చారు. సినిమాలకు సంబంధించి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలను ఇందులో చేసుకునేవారు. అయితే గత రెండు మూడు నెలలుగా నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’ సినిమా షూటింగ్ లు, ప్రోస్ట్ ప్రొడక్షన్ మీద బిజీగా ఉండడంతో నాగశౌర్య కుటుంబం ఆ ఫాంహౌస్ ను పట్టించుకోలేదు. వారి వ్యవహారాల్లో వారు మునిగిపోయారు. ఆ గెస్ట్ హౌస్ కు నాగశౌర్య కానీ.. ఆయన తండ్రి, బాబాయ్ ఎవ్వరూ వెళ్లడం లేదు. నాగశౌర్యకు ఆ ఫాంహౌస్ కు అస్సలు సంబంధం లేదు. ఒక్కసారి కూడా నాగశౌర్య ఆ గెస్ట్ హౌస్ కు వెళ్లింది లేదు.
పేకాట జరిగిన ఫాంహౌస్ నాగశౌర్య నాన్న శంకర్ ప్రసాద్ పేరు మీద ఉంది. ఆయన తన వ్యాపారాల్లో బిజినెస్ వ్యవహారాల్లో ఆఫీసుల్లో బిజీగా ఉంటూ ఇటు వైపే పట్టించుకోలేదు. నాగశౌర్య చిన్నాన్నకు సన్నిహితుడు.. రెగ్యులర్ గా ఆయనతోపాటు వచ్చే ‘సాగర్’ అనే వ్యక్తి బర్త్ డే పార్టీ ఉందని ఫాంహౌస్ వాచ్ మెన్ ను అడిగి తాళాలు తీసుకున్నారు. రెగ్యులర్ గా వచ్చే వ్యక్తి కావడంతో వాచ్ మెన్ కూడా ఆ తాళాలు ఇచ్చేశాడు. అసలు ఈ విషయం నాగశౌర్య బాబాయ్ కి కానీ.. వారి ఫ్యామిలీకి కానీ తెలియదు. అయితే సాగర్ ఇలా అసాంఘిక కార్యకలాపాలకు ఈ ఫాంహౌస్ ను వాడుకుంటాడన్న విషయం నాగశౌర్య కుటుంబానికి తెలియదు. ఇప్పుడు అదే జరిగింది. సాగర్ అందులో పేకాట ఆడడం.. పోలీసులకు , మీడియాకు ఉప్పందండం వారు దాడి చేసి నానా యాగీ చేయడం జరిగింది.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..అస్సలు నాగశౌర్య కుటుంబం అనుమతి లేకుండా ఆయన బాబాయ్ కు కూడా చెప్పకుండా వీరి సన్నిహితుడైన సాగర్ ఈ ఫాంహౌస్ తాళాలు తీసుకొని ఈ దందా చేశాడు. ఇదొక కుట్ర కోణం. దీన్ని టాప్ న్యూస్ చానెల్ ఇరికించి రచ్చ చేసింది. పోలీసులతో కలిసి దాడులు చేయించి క్యాష్ చేసుకుంది. కనీసం దీనిపై విచారణ చేయకుండా వివరణ అడగకుండానే నాగశౌర్య కుటుంబంపై అభాండాలు వేసింది. నాగశౌర్య తండ్రి పేరును కూడా తప్పుగా రాసేసి మీడియా వికటట్టహాసం చేసింది. బర్త్ డే పార్టీ పేరిట చెప్పి తీసుకొని అందులో పేకాట ఆడితే పాపం నాగశౌర్య కుటుంబాన్ని ఇందులో ఇన్ వాల్వ్ చేసి మీడియా చేసిన అతి అంతా ఇంతాకాదు.. ఇది ఆ టాప్ చానెల్ చేసిన ట్రాప్ అని ఆరోపణలున్నాయి. ఎవరో బర్త్ డే పార్టీ అని తీసుకొని పేకాట ఆడితే దానికి నాగశౌర్య కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ టీవీ చానెల్ చేసిన కుట్రలో ఇప్పుడు నాగశౌర్య ఫ్యామిలీ బలైపోయింది.
-నాగశౌర్య తండ్రికి క్లీన్ చిట్ ఇచ్చిన పోలీసులు
పేకాట ఆడుతూ పట్టుబడిన వ్యవహారంలో ఫాంహౌస్ ఓనర్ అయిన నాగశౌర్య తండ్రికి పోలీసులు నోటీసులు పంపారు. దీనికి వెళ్లి క్లియర్ గా తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని.. తమకు తెలియకుండానే బర్త్ డే పార్టీ అని ఇలా చేశారని వివరించారు. ఈ విషయంలో తాము బాధితులమేనని ఆధారాలతో సహా నాగశౌర్య తండ్రి కాల్ రికార్డులతో వివరించారు. దీంతో పోలీసులు కూడా ఈ విషయంలో నాగశౌర్య తండ్రికి, కుటుంబానికి సంబందం లేదని క్లీన్ చిట్ ఇచ్చారు. నాగశౌర్య తండ్రిని కూడా బాధితులుగా పోలీసులు నిర్ధారించారు.
-ఆ టాప్ చానెల్ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటుంది?
తప్పు సాగర్ అనే వ్యక్తి చేశాడు. బర్త్ డే పార్టీ పేరిట అతడు నాగశౌర్య కుటుంబం ఫాంహౌస్ లోకి వెళ్లి పేకాట ఆడాడు. కనీసం వారికి చెప్పలేదు.దీన్ని దొరికింది కదా అని కనీసం వివరణ తీసుకోకుండా టాప్ చానెల్ నానా యాగీ చేసింది. సంబంధం లేదని తెలిసినా హీరో నాగశౌర్యను కానీ.. ఆయన తండ్రిని కనీసం వివరణ అడగకుండా అభాసుపాలు చేసింది. ఇప్పుడు పోలీసుల విచారణలో అసలు నాగశౌర్య కుటుంబానికి తెలియకుండా ఇదంతా జరిగిందని వాళ్లు తప్పు ఏం లేదని తేలింది. మరి ఇప్పుడు ఇంత రచ్చచేసిన ఆ టాప్ చానెల్.. దాంతోపాటు రెచ్చిపోయిన మీడియా చానెల్స్ తమ తప్పుకు నాగశౌర్య కుటుంబానికి క్షమాపణ చెబుతాయా? వారి కుటుంబం అనుభవించిన క్షోభకు పశ్చాత్తాపం ప్రకటిస్తాయా? అంటే వాటి నుంచి అసలు సమాధానమే లేదు.
మీడియా చేతిలో ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరించడం వల్ల మంచి వారిని కూడా ప్రజలు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా నిజనిజాలు తెలుసుకొని మీడియా వ్యవహరిస్తే అందరికీ మంచిది. లేదంటే అందరూ నాగశౌర్య కుటుంబం లాగా మంచివారు కాదు.. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు ఈ మీడియాకు తగిన బుద్ది చెప్పక మానరు.. తస్మాత్ జాగ్రత్త!
Also Read: ఘనంగా నిర్వహించిన వరుడు కావలెను సక్సెస్ మీట్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Hero nagashouryas family abused by media zeal
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com