Telugu Media: ఆ పత్రిక యజమాని ఒకప్పుడు పాత్రికేయుడే. ఆ పత్రికను ప్రారంభించినప్పుడు అతడి ఆర్థిక స్థితి అంతంత మాత్రం గానే ఉండేది.. కానీ రాను రాను తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను శాసించే స్థాయికి ఆయన ఎదిగిపోయారు. కానీ ఆయన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు (పై స్థాయిలో ఉన్న వారు మినహా) మిగతా వారంతా అంతంత మాత్రం జీతాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. కరోనా సమయంలో ఐతే ఆ పత్రికా యాజమాన్యం అడ్డగోలుగా ఉద్యోగులను తొలగించింది. ఉన్న వాళ్ళతోనే పని మొత్తం చేయించింది. పైగా పేజీల సంఖ్య కూడా కుదించింది.. దీనికి తోడు వేతనాలలో సగం కోత విధించింది. ఆ తర్వాత దశలవారీగా పూర్తిస్థాయిలో వేతనాలను ఇవ్వడం మొదలుపెట్టింది.. ఉద్యోగుల వేతనాల నుంచి కోత విధించిన మొత్తాన్ని ఇంతవరకు వేయలేదంటే ఆ యాజమాన్యానికి ఉద్యోగులపై ఏ స్థాయిలో ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఆ పత్రిక యాజమాన్యానికి రెండు తెలుగు రాష్ట్రాలలో అనుకూలమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ప్రతిరోజు ఆ పత్రిక లో జాకెట్ యాడ్స్ ప్రచురితమవుతున్నాయి. కమర్షియల్ యాడ్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. అయినప్పటికీ ఆ పత్రికా యాజమాన్యం ఉద్యోగులకు వేతనాల పెంపుదల విషయంలో ఇప్పటికీ పిల్లి మొగ్గలు వేస్తోంది. అయితే ఇప్పుడు మీడియా సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈనెలలో వేతనాల పెంపుదల ఉంటుందట.. ఇదే విషయాన్ని పై స్థాయిలో పనిచేసే కీలక విభాగాధిపతులు కిందిస్థాయి సిబ్బందికి లీక్ చేశారట.
షరతులు వర్తిస్తాయి
వేతనాలు పెరుగుతాయని ఇది స్థాయి సిబ్బంది జబ్బలు చరుచుకుంటున్నప్పటికీ.. దాని వెనుక వేరే సూత్రం దాగి ఉందట. వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగానే ఉద్యోగులకు వేతనాల పెంపుదల ఉంటుందట.. ఒక్కో ఎడిషన్ లో ఇన్ ఛార్జ్ తో కలిపి ఆరు నుంచి ఏడు మంది మాత్రమే పనిచేస్తున్నారు.. గతంలో 15 మంది పనిచేసినచోట.. ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. అది మేనేజ్మెంట్ కు వ్యక్తిగత ప్రదర్శనలాగా కనిపించడం లేదు. కేవలం ఎడిటోరియల్ మాత్రమే కాదు.. నెట్వర్క్, అడ్వర్టైజ్మెంట్, సర్కులేషన్, మార్కెటింగ్, ప్రింటింగ్, పర్సనల్ డిపార్ట్మెంట్.. ఇలా విభాగం చూసుకున్నా ఉద్యోగులు సగానికి సగం తగ్గిపోయారు.. అయినప్పటికీ జీతాలను పెంచడానికి యాజమాన్యానికి మనసు రావడం లేదు.. ఒకపటిలాగా ప్రింటింగ్ ఖర్చు కూడా లేదు. పేజీల సంఖ్య కూడా చాలావరకు కుదించారు. అయినప్పటికీ మేనేజ్మెంట్ వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగానే వేతనాల పెంపుదల ఉంటుందని షరతు విధించిందట. కార్డ్ టారిఫ్ ను ప్రతి మూడు నెలలకు పెంచే ఆ పత్రికా యాజమాన్యానికి.. ఉద్యోగుల వేతనాల పెంపుదలలో మాత్రం ఆ స్థాయిని ప్రదర్శించడం లేదు.. అన్నట్టు వేతనాల పెంపుదల విషయంలో వ్యక్తిగత ప్రదర్శనకు ఓటేస్తామని చెబుతున్న ఆ పత్రిక యాజమాన్యం.. కార్మిక చట్టాలను అమలు చేస్తుందా? దానికి తగ్గట్టుగానే వేతనాలు ఇస్తుందా? ఏమో ఈ ప్రశ్నలకు ఆ యాజమాన్యమే సమాధానం చెప్పాల్సి ఉంది.