TSPSC Group 1 Exam: గ్రూప్_1 కు లైన్ క్లియర్: ఈసారి అభ్యర్థులు పాటించాల్సిన నియమనిబంధనలు ఇవే

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పిన వివరాల ప్రకారం జూన్ 11న గ్రూప్ 1కు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించబోతోంది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జూన్ 11 ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.

Written By: Bhaskar, Updated On : June 6, 2023 11:05 am

TSPSC Group 1 Exam

Follow us on

TSPSC Group 1 Exam: టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీకి సంబంధించి కేసులు నమోదు అవుతుండడం.. కొత్త కొత్త నిందితుల పేర్లు వస్తుండడంతో.. బోర్డు అప్రమత్తమైంది. పేపర్ లీకేజీ వెలుగు చూడగానే బోర్డు ప్రకటించినట్టు జూన్లో పరీక్ష నిర్వహించేందుకు సమాయత్తమైంది. అయితే దీనిపై కొన్ని సంఘాలు హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో.. ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించకుండా అడ్డుకోలేమని సోమవారం తీర్పునిచ్చింది. దీంతో పరీక్ష నిర్వహించేందుకు బోర్డు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్ పేపర్ లీక్ కావడంతో ఈసారి అటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఉండేందుకు బోర్డు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు ప్రకటించింది. ఈసారి సరికొత్త నిబంధనలు తెరపైకి తీసుకొస్తున్నట్టు వివరించింది.

జూన్ 11న

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పిన వివరాల ప్రకారం జూన్ 11న గ్రూప్ 1కు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించబోతోంది. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. జూన్ 11 ఆదివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే సంబంధిత పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తామని బోర్డు తెలిపింది. ఉదయం 10:00 15 నిమిషాల తర్వాత అభ్యర్థులను ఎగ్జామ్స్ సెంటర్లలోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఓఎంఆర్ షీట్ ను నింపే విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఓఎంఆర్ షీట్ ని సమయంలో ఏదైనా తప్పు చేస్తే కొత్తది ఇచ్చే ప్రసక్తి లేదని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థులు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే ఓఎంఆర్ షీట్లో ఆన్సర్లను బబ్లింగ్ చేయాలని సూచించింది. ఇంకా పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్లతో బబ్లింగ్ చేస్తే ఓఎంఆర్ షీట్లు చెల్లవని స్పష్టం చేసింది. డబుల్ బబ్లింగ్ చేస్తే కూడా అంగీకరించేది లేదని వెల్లడించింది.

ఇవి చాలా ముఖ్యం

అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఆధార్, పాన్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఫోటోలతో కూడిన ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులను కూడా తీసుకురావాలని బోర్డు అధికారులు సూచిస్తున్నారు. పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే అభ్యర్థులు ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని ప్రకటిస్తున్నారు.. ఇక హైకోర్టులో బోర్డుకు అనుకూలంగా తీర్పు రావడంతో పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో లీకేజీ వంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈసారి పరీక్ష కేంద్రాల వద్ద జామర్లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు అమలు చేస్తారు? ఒకవేళ అమలు చేస్తే అక్కడ స్థానికంగా ఉన్న వారికి సెల్ ఫోన్ సిగ్నల్స్ అందవు. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు అధికారులు మొగ్గు చూపుతారా అనేది వేచి చూడాల్సి ఉంది.