IPL CSK Final 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో చెన్నై.. ఏ జట్టుతో మ్యాచ్ ఆడినా ధోని నామస్మరణతో ఆ స్టేడియాలు మార్మోగాయి. వేలాదిగా తరలివచ్చిన ధోని అభిమానులు చెన్నై జట్టును ఉత్సాహపరిచే ప్రయత్నం చేసేవారు. ఈ క్రమంలోనే చెన్నై జట్టు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మే నెలలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ టీమ్స్ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రపంచంలోనే రెండో స్థానాన్ని సంపాదించుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ను ఐదోసారి కైవసం చేసుకుంది ఈ జట్టు. ధోని సారధ్యంలోని సీఎస్కే జట్టు ఐపిఎల్ టైటిల్ ఐదోసారి గెలిచిన రెండోజట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ మాత్రమే ఈ రికార్డును తన పేరిట నమోదు చేసుకోగా, చెన్నై జట్టు ఈ ఏడాది టైటిల్ గెలుచుకుని దానిని సమం చేసింది. ఈ క్రమంలోనే చెన్నై జట్టు మరో అద్వితీయమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మే నెలలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ టీమ్స్ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ చోటు దక్కింది. ఈ జాబితాలో ఏకంగా రెండో స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం.
చెన్నై జట్టుకు 30.2 మిలియన్ల స్పందనలు..
ఫేస్ బుక్ లో వచ్చిన స్పందనల ఆధారంగా డిపార్టీస్ అండ్ ఫినాంజస్ అనే సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ జాబితాలో తొలి స్థానంలో ఫుట్ బాల్ టీమ్ రియల్ మాడ్రిడ్ 31.6 మిలియన్ స్పందనలతో తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాత చెన్నై జట్టు 30.2 మిలియన్ స్పందనలతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే, మాంచెస్టర్ సిటీ 27.9 మిలియన్ స్పందనలతో మూడో స్థానంలో, బార్షిలోన 24.2 మిలియన్స్ స్పందనలతో నాలుగో స్థానంలో, లివర్ పూల్ 14.9 మిలియన్ స్పందనలతో ఐదవ స్థానంలో నిలిచింది. సాధారణంగా ఇటువంటి జాబితాలో ఫుట్బాల్ టీములు మాత్రమే ఉంటాయి. అయితే, ధోని క్రేజ్ వల్ల తొలిసారిగా క్రికెట్ జట్టు ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. దీని పట్ల క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ తో అహ్మదాబాద్ వేదికగా చెన్నై జట్టు ఫైనల్ మ్యాచ్ లో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. గుజరాత్ జట్టులో వృద్ధి మాన్ సాహా 39 బంతుల్లో 54 పరుగులు చేయగా, గిల్ 20 బంతుల్లో 39 పరుగులు, సాయి సుదర్శన్ 47 బంతుల్లో 96 పరుగులు, హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 21 పరుగులు చేయడంతో చెన్నై జట్టుకు భారీ లక్ష్యాన్ని విధించగలిగింది గుజరాత్ టైటాన్స్. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి చెన్నై జట్టు దిగాల్సి ఉండగా.. ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో 15 ఓవర్లలో లక్ష్యాన్ని 171 పరుగులకు ఎంపైర్లు కుదించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. ఋతురాజ్ గైక్వాడ్ 16 బంతుల్లో 26 పరుగులు, డెవాన్ కాన్వే 25 బంతుల్లో 47 పరుగులు, శివమ్ దుబే 21 బంతుల్లో 32 పరుగులు, రహనే 13 బంతుల్లో 27 పరుగులు, అంబటి రాయుడు 8 బంతుల్లో 19 పరుగులు, రవీంద్ర జడేజా ఆరు బంతుల్లో 15 పరుగులు చేయడంతో చెన్నై జట్టు చివరి బంతికి అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి రెండు బంతుల్లో జట్టు విజయానికి 10 పరుగుల అవసరం కాగా రవీంద్ర జడేజా వరుసుగా సిక్స్, ఫోర్ బాది జట్టుకు ఘన విజయాన్ని అందించి పెట్టాడు. దీంతో చెన్నై జట్టు ఐదోసారి టైటిల్ కైవసం చేసుకుంది.