Ali- Jagan: గత ఎన్నికల్లో వైసీపీకి సినీ గ్లామర్ తోడైంది. మోహన్ బాబు, పోనాకి కృష్ణమురళి, థర్టీ ఈయర్స్ పృధ్వీ, అలీ, విజయ్ చందర్, భానుచందర్ తదితరు బాహటంగానే వైసీపీకి మద్దతు తెలిపారు. అటు నాగార్జున వంటి వారు పరోక్షంగా సహకరించారు. కానీ తీరా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కరూ దూరమయ్యారు. నాగార్జున ఇప్పటికీ జగన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఒకానొక దశలో ఆయన విజయవాడ ఎంపీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తారని ప్రచారం జరిగింది. కానీ తన ఒంటికి రాజకీయాలు పడవంటూ నాగార్జున నేరుగానే స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ జగన్ కు సన్నిహితుడుగా ఉంటానని మాత్రం సంకేతాలిచ్చారు. అటు థర్టీ ఈయర్స్ పృధ్వీ ఎపిసోడ్ ముగిసింది. ఆయన జనసేన గూటికి చేరిపోయారు. అటు మోహన్ బాబు సైతం దూరమయ్యారు. ఇన్నాళ్లూ తన బంధువు సీఎం జగన్ అంటూ చెప్పుకొచ్చిన ఆయన ఇటీవల ఆ పేరు ఎత్తడం ప్రారంభించారు. పోసాని క్రిష్ణ మురళీ సైతం కొద్దిరోజులుగా సైలెంట్ అయ్యారు. అటు విజయచందర్, భానుచందర్ లు సైతం కనిపించడం మానేశారు. అటు సినిమా టిక్కెట్ల ప్రభావం, సినిమారంగంపై పెట్టిన ఆంక్షలు పుణ్యమా అని తెలుగు సినీ పరిశ్రమ వైసీపీకి దాదాపు దూరమైన పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే గత ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ప్రజాప్రతినిధి అయిపోతామని కలలుగన్న అలీకి వైసీపీలో చుక్కెదురు అయ్యింది. అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యసభ, వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అంటూ హడావుడి నడిచింది. ఇలా మూడున్నరేళ్లు గడిచిపోయింది. అయితే పవన్ రూపంలో ఎదురవుతున్న చిక్కులు, సినీ పరిశ్రమ దూరమవ్వడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. అలీకి ఏపీ మీడియా సలహాదారుడుగా నియమించారు. అయితే అప్పటివరకూ పెద్ద పెద్ద పదవులపై ఆశలు పెట్టుకున్న అలీ…వందలాది మందిలో ఒక సలహాదారు పదవి కేటాయించడంతో విస్తుపోయారు. పైగా రెండేళ్ల పాటు పదవి ఉంటుందని చెప్పి మరీ.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లేదని సంకేతాలిచ్చేశారు. దీంతో ఇష్టం లేకున్నా అలీ బలవంతంగా పదవి తీసుకోవాల్సిన పరిస్థితి. అటు వెనక్కి తగ్గితే నవ్వులపాలవుతామని ఆయన భావిస్తున్నారు. అందుకే పదవి తీసుకొని.. సరైన సమయంలో జగన్ కు ఝలక్ ఇవ్వాలని భావిస్తున్నారు.
పూర్వాశ్రమంలో అలీ టీడీపీలో యాక్టివ్ గా ఉండేవారు. అటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఆప్త మిత్రుడుగా కొనసాగుతూ వచ్చారు. అటు పవన్ కూడా సినిమారంగంలో అలీకి ఇచ్చిన ప్రాధాన్యత ఎవరికీ ఇచ్చేవారు కాదు. అయితే గత ఎన్నికల ముందు జరిగిన పరిణామాలతో అలీ అనూహ్యంగా టీడీపీకి దూరమయ్యారు.

పవన్ ను కాదని వైసీపీలో చేరారు. అటు తరువాత పరిణామాలతో పవన్, అలీ మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంలో గత మూడున్నరేళ్లుగా జగన్ మోసం చేస్తూ వస్తుండడంతో అలీ పునరాలోచనలో పడ్డారు. అనవసరంగా పవన్ కు దూరమయ్యాని తెగ బాధపడేవారుట. అలాగని తిరిగి ఆయన వద్దకు వెళ్లడానికి ఆత్మాభిమానం అడ్డుగా నిలిచింది. అయితే ఇద్దరి మధ్య మొహమాటం అడ్డంకిగా ఉంది. అయితే అలీ వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం ఎన్నికలకు ముందు తిరిగి పవన్ గూటికి చేరే అవకాశముందని సన్నిహితులు చెబుతున్నారు. ఏపీకి సీఎం అయ్యే అర్హతలు పవన్ కు ఉన్నాయని.. ఆది నుంచి తనది ఇదే అభిప్రాయమని అలీ వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు కూడా ఏపీకి నెక్స్ట్ సీఎం పవనేనని అలీ తన క్లోజ్ సర్కిల్ వద్ద ప్రస్తావిస్తుండడం చర్చనీయాంశమవుతోంది.