Group-4 Exam Hall Tickets: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్–4 పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. జూలై 1న పరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్ –1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు పేపర్–2 పరీక్షలు జరుగుతాయి. మొత్తం 8వేలకు పైగా ఉద్యోగాలకు గతేడాది నోటిఫికేషన్ జారీ చేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 9.5 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్షకు 15 నిమిషాల ముందు వరకు హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
బయోమెట్రిక్ తప్పనిసరి..
గతేడాది నిర్వహించిన గ్రూప్–1 పేపర్ లీక్ కావడం, తిరిగి ఇటీవల మళ్లీ పరీక్ష నిర్వహించగా అందులో బయోమెట్రిక్ తీసుకోకపోవడం, ఓఎంఆర్ షీట్లపై ఫొటో, హాల్‌టికెట్ నంబర్ లేకుండా ఇవ్వడంపై ఇటీవల అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మళ్లీ అవకతవకలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో తాజాగా గ్రూప్–4 పరీక్షలకు బయోమెట్రిక్ తప్పనిసరి చేస్తూ టీఎస్‌పీఎస్సీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఎగ్జామ్ హాల్‌లోకి అనుమతించేటప్పుడు హాల్‌టికెట్‌తోపాటు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డును పరిశీలించనున్నారు.
గ్రూప్–1లో ఇబ్బందులు..
గతేడాది నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలో బయోమెట్రిక్ అమలు చేశారు. కానీ ఆ ఎగ్జామ్‌కు సంబంధించి చాలా మంది అభ్యర్థుల బయోమెట్రిక్‌ను తీసుకోలేకపోయారు. కొందరు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడం, పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి బయోమెట్రిక్ తీసుకోలేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు.. అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖాన్ని సరిచూసి సంతకం, వేలిముద్ర తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
అవకతవకలు జరుగకుండా..
గ్రూప్–4 పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలు తెరిచే కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక కేంద్రంలోకి ఎవరూ సెల్‌ఫోన్ తీసుకెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఎవైనా ఫోన్ తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్‌పీఎస్సీ అధికారులు హెచ్చరించారు.