Pawan Kalyan: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజా రాజకీయాల్లో కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా రాజకీయాల్లో మార్పులకు తనదైన శైలిలో చేస్తున్న ప్రసంగాలను అన్ని రాజకీయ పార్టీల నాయకులు అంగీకరించేలా ఉంటున్నాయి. స్టార్ హీరోగా ఉన్న పవన్ చేస్తున్న ప్రసంగాలు ప్రస్తుత నేతల ప్రసంగాలకు పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయి. అనుభవజ్ఞలైన నేతలు సైతం అసూయపడేలా, ఎంతో అనుభవం, రాజకీయ పరిజ్ఞానం ఉన్న నేతలు కూడా మాట్లాడని విధంగా, స్ఫూర్తిని నింపేలా పవన్ ప్రసంగాలు ఉంటున్నాయి. పవన్ మాటల్లో నిజాయతీ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత నేతల్లో మనసులో ఒకటి, బయట ఇంకోటి పెట్టుకుని మాట్లాడడం లేదు. కుండ బద్దలు కొట్టినట్లుగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్న తీరు ప్రజలకు సైతం నచ్చుతోంది.
అహం పక్కనపెట్టి..
వాస్తవంగా హీరోలు రాజకీయాల్లోకి వస్తే.. రాజకీయాల్లో ఉన్న నేతల తరహాలో మాట్లాడలేదు. కానీ పవన్ సినిమాల్లో నటిస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోగా ఎదిగారు. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా.. తన కష్టంలో సినిమాల్లో పైకి వచ్చారు. ఇక రాజకీయాల్లో సైతం అహం పక్కన పెట్టి ఎంతో పరిణతి చెందిన రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారు. వారాహి యాత్రలో పవన్ ప్రసంగాలు గతం కంటే భిన్నంగా ఉండడమే ఇందుకు నిదర్శనం.
అభిమానిస్తున్న సినిమా నటులు..
ఒకప్పుడు పవన్ రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని విమర్శించిన ఇతర నటీనటుల అభిమానులు, ప్రస్తుతం పవన్ ప్రసంగాలు విని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతని రాజకీయ ప్రయాణం లక్ష్యంవైపు సాగుతోందని పేర్కొంటున్నారు. తక్కువ సమయంలోఎక్కువ రాజకీయ పరిణతి సాధించిన పవన్.. కాబోయే గొప్ప రాజకీయ నేతగా పేర్కొంటున్నారు. మరోవైపు అభిమానులు కూడా తమ నాయకుడిలో మార్పును స్వాగతిస్తున్నారు.
మాటే మంత్రంగా..
వచ్చే ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాటే మంత్రంగా పనిచేస్తుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఆకట్టుకునే ప్రసంగం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నైజం , మాటల్లో నిజాయతీ పవన్ రాజకీయ పరిణతికి నిదర్శనంగా పేర్కొంటున్నారు. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో జనసేనకు సానుకూల అంశాలుగా మారతాయని అంటున్నారు. ఇది విజయవంతమైన రాజకీయ ప్రచారానికి మార్గం వేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.