తప్పెవరిది: ప్రైవేటు ఆసుప‌త్రుల‌దా.. ప్రభుత్వానిదా?

ఆరోగ్యం విష‌యంలో క‌ష్ట‌కాలం ఎప్పుడు వ‌చ్చినా.. అంద‌రూ ప‌రిగెత్తేది ప్రైవేటు డాక్ట‌ర్ల‌ వ‌ద్ద‌కే. ఆ త‌ర్వాత డ‌బ్బుల విష‌య‌మై అంద‌రూ ప‌డిపోయేది ప్రైవేటు ఆసుప‌త్రుల మీద‌నే. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఏ రోగానికైనా తెల్ల‌గోలి మాత్ర‌మే ఇస్తార‌ని, ఒక‌టే సూది పొడుస్తార‌నే సెటైర్ ద‌శాబ్దాల కాలంగా న‌డుస్తున్న‌దే. అందుకే.. క్వాలిటీ ప్రైవేటు ఆసుప‌త్రుల్లోనే దొరుకుతుంద‌ని జ‌నం మొత్తం అక్క‌డికే వెళ్లిపోతున్నారు. ప్ర‌తీఏడాది జ్వ‌రాల సీజ‌న్లో ఆసుప‌త్రులు నిండుతుంటాయి. అప్పుడు కొన్ని రోజులు అధిక ఫీజులు, దోపిడీ అంటూ ప్ర‌చారంలోకి […]

Written By: K.R, Updated On : May 30, 2021 3:18 pm
Follow us on

ఆరోగ్యం విష‌యంలో క‌ష్ట‌కాలం ఎప్పుడు వ‌చ్చినా.. అంద‌రూ ప‌రిగెత్తేది ప్రైవేటు డాక్ట‌ర్ల‌ వ‌ద్ద‌కే. ఆ త‌ర్వాత డ‌బ్బుల విష‌య‌మై అంద‌రూ ప‌డిపోయేది ప్రైవేటు ఆసుప‌త్రుల మీద‌నే. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో ఏ రోగానికైనా తెల్ల‌గోలి మాత్ర‌మే ఇస్తార‌ని, ఒక‌టే సూది పొడుస్తార‌నే సెటైర్ ద‌శాబ్దాల కాలంగా న‌డుస్తున్న‌దే. అందుకే.. క్వాలిటీ ప్రైవేటు ఆసుప‌త్రుల్లోనే దొరుకుతుంద‌ని జ‌నం మొత్తం అక్క‌డికే వెళ్లిపోతున్నారు.

ప్ర‌తీఏడాది జ్వ‌రాల సీజ‌న్లో ఆసుప‌త్రులు నిండుతుంటాయి. అప్పుడు కొన్ని రోజులు అధిక ఫీజులు, దోపిడీ అంటూ ప్ర‌చారంలోకి వ‌చ్చేస్తుంది. ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు క‌రోనా నేప‌థ్యంలో ప‌రిస్థితి సుదీర్ఘంగా సాగుతోంది కాబ‌ట్టి.. సెకండ్ వేల్‌ అల్ల‌క‌ల్లోలం చేయ‌డంతో రోగుల‌కు బెడ్ కూడా దొరికే ప‌రిస్థితి లేకుండాపోయింది కాబ‌ట్టి.. ప్రైవేటు దోపిడీ చ‌ర్చ కూడా కాస్త ఎక్కువ కాల‌మే న‌డుస్తోంది.

అయితే.. అస‌లు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌ను నాశ‌నం చేసింది ఎవ‌రు? ఆసుప‌త్రులు కావొచ్చు, విద్యాసంస్థ‌లు కావొచ్చు.. మ‌రొక‌టి కావొచ్చు, ఇంకోటి కావొచ్చు.. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌కంటే ప్రైవేటులోనే క్వాలిటీ ఉంటుంద‌నేలా జ‌నాల‌ను త‌యారు చేసింది ఎవ‌రు? ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లాలంటేనే జనం భయపడేలా మార్చింది ఎవరు? ప్రభుత్వాలు కాదా? ఈ విష‌యం అడిగేవారు ఎంద‌రు?

అలాగ‌ని చెప్పి.. ప్రైవేటు ఆసుప‌త్రుల దోపిడీని స‌మ‌ర్థించాల‌ని చెప్ప‌డం కాదు. ప్రైవేటు ఆసుప‌త్రులు అధిక సొమ్ములు కాజేస్తుంటే అడ్డుకోవాల్సింది ఎవ‌రు? నిబంధనలు అతిక్రమిస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన వ్యవస్థలు ఎవరి దగ్గర ఉన్నాయి? అన్నీ ప్ర‌భుత్వం ద‌గ్గ‌రే క‌దా.. మ‌రి ఎందుకు మౌనంగా ఉంటున్నాయి ప్ర‌భుత్వాలు?

ఏ రోగానికి ఎంత ఫీజు తీసుకోవాలి? ఏ ఆప‌రేష‌న్ కు ఎంత తీసుకోవాలో స‌ర్కారే నిర్ణ‌యించొచ్చు క‌దా? ఈ నిర్ణ‌యాన్ని ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు క‌దా? ఇవ‌న్నీ చేయని ప్ర‌భుత్వాన్ని వ‌దిలేసి.. ఆసుప‌త్రుల‌ను అన‌డం ద్వారా ఉప‌యోగం ఏముందీ? అన్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. మ‌రి, ఇది జ‌నాల‌కు ఎప్పుడు అర్థ‌మ‌వుతుందో అన్న‌ది స‌మాధాన‌మే లేని ప్ర‌శ్న‌.