ఓవైపు ప్రాణాలు పోతున్నాయంటే ఎవరైనా ఏం చేస్తారు.. దగ్గరుండి వారి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తారు. చేత కాకపోతే కనీసం సహకరిస్తారు. కానీ కరుడుగట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏపీ నుంచి వస్తున్న కోవిడ్ రోగులను సరిహద్దుల్లోనే అడ్డుకుంటూ వారి ప్రాణాలు పోయేలా చేస్తోంది. కేసీఆర్ నా దోస్త్ అని చెప్పుకునే ఏపీ సీఎం జగన్ సైతం ఈ మారణహోమం సరిహద్దుల్లో జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకపోవడం రోగులను మరింత కృంగదీస్తోంది. మానవత్వం లేని ప్రభుత్వాల నిర్ధయతో ఇప్పుడు సరిహద్దుల్లోనే రోగుల ప్రాణాలు పోతున్న దైన్యం కనిపిస్తోంది.
ఉమ్మడి ఏపీ విడిపోయినప్పుడు దాదాపు పదేళ్లు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను సాగించుకోవచ్చని వెసులు బాటు కల్పించారు. హైదరాబాద్ నుంచే ఏపీ పాలన తొలి నాళ్లలో సాగింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఏపీ సచివాలయ భవనాలు ఉన్నాయి. పదేళ్ల వరకు ఇద్దరూ వాడుకోవచ్చు. పరిపాలన చేసుకోవచ్చు. హైదరాబాద్ రాత్రికి రాత్రి ఊడిపడింది కాదు. అంత పెద్ద మెట్రో పాలిటిన్, మెడికల్ హబ్ గా మారడం వెనుక ఆంధ్రుల కష్టం, వారి పెట్టుబడులు ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఉన్న ఫళంగా ఏపీకి రాజధాని తరలిపోవడంతో హైదరాబాద్ తెలంగాణ సొత్తు అయినట్టు కేసీఆర్ సర్కార్ ఆంధ్రులను ఇక్కడి వైద్యం చేయించుకోవడానికి వీల్లేదు అన్నట్టుగా సరిహద్దుల్లో ఏపీ అంబులెన్స్ లను ఆపేశారు. ఈ ఘటనలో పలువురు రోగులు చనిపోయారు. దీనిపై హైకోర్టు హెచ్చరించినా ఇప్పటికీ పోలీసులు అనుమతించడం లేదని వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే తెలంగాణ పరిధిలోని జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ గేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ఏపీ వాసులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏపీ నుంచి అంబులెన్స్ లను అనుమతించని నేపథ్యంలో తెలంగాణ వాహనాలను కూడా ఏపీ వైపు రాకుండా అడ్డుకున్నారు. పూల్లూరు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట కూడా జరిగింది. తెలంగానలోకి తమను రానివ్వనప్పుడు ఏపీలోకి ఎలా వస్తారని బీజేపీ నేతలు నిలదీశారు.
ఇక తెలంగాణ సరిహద్దు సూర్యపేట జిల్లా రామాపురం క్రాస్ రోడ్డు వద్ద కూడా తెలంగాణ పోలీసులు ఏపీ రోగులను అడ్డుకుంటున్నారు. దీనిపై బంధువులు ఆందోళనకు దిగుతున్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఏపీ వాసులు వచ్చి తెలంగాణ పోలీసులతో గొడవకు దిగుతున్నారు. కోవిడ్ రోగుల అంబులెన్స్ లను అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.
కరోనా కల్లోలంలో ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు మానవత్వం ముఖ్యమని.. ఇప్పటికే చచ్చిపోతున్న రోగులను కాపాడాలని.. ఇందులో ఆంధ్రా, తెలంగాణ అని చూడవద్దని ప్రజలు, రోగులు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నారు. మనుషులు బ్రతకలేకపోతున్న ఈ సమయంలో కూడా ఆంధ్రా, తెలంగాణ అన్న వివిక్ష ఎక్కడిది? అని ముందు మనం మనుషులుగా గుర్తించాలని ప్రజలు హితవు పలుకుతున్నారు.
పుల్లూరు టోల్ గేట్ వద్ద ఏపీ వాసుల ఆందోళన