Google Playstore : గూగుల్ ప్లే స్టోర్‌లో ఊహించని మార్పు సంభవించింది. ఒకే సారి లక్షల యాప్స్ మాయం అయ్యాయి. వాస్తవానికి ఇది షాకింగ్ విషయమే కానీ.. యూజర్లకు మాత్రం ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మీరు ఇటీవల గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్‌ల సంఖ్యను గమనించినట్లు అయితే గతంలో కంటే ఇప్పుడు తక్కువ యాప్‌లు కనిపిస్తున్నాయి. దీనికి కారణం గూగుల్ చేపట్టిన భారీ ప్రక్షాళనే.
2024 ప్రారంభంలో ప్లే స్టోర్‌లో దాదాపు 34 లక్షల యాప్‌లు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ సంఖ్య కేవలం 18 లక్షలకు పడిపోయింది. అంటే సగానికి పైగా యాప్‌లను గూగుల్ తొలగించింది. మొదటి సారి ఇది ఓ రకంగా వింతగా అనిపించినప్పటికీ.. నిజానికి ఇది వినియోగదారులకు శుభవార్తే. ఎందుకో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
1. పనికిరాని యాప్‌లపై గూగుల్ కొరడా
గతంలో ఎవరైనా ఏదో ఒక యాప్‌ను ప్లే స్టోర్‌లో అప్‌లోడ్ చేసేవారు. ఒకే వాల్‌పేపర్‌కు సంబంధించిన యాప్‌లు, కేవలం టెక్స్ట్ మాత్రమే చూపించే యాప్‌లు, అసలు ఏమీ చేయని యాప్‌లు కూడా ఉండేవి. అయితే జూలై 2024లో గూగుల్ వీటన్నింటి మీద నిషేధం విధించింది. అప్పటి నుండి పనికిరాని యాప్‌లను ప్లే స్టోర్ నుండి తొలగిస్తున్నారు. అంటే ఇకపై మీరు అనవసరమైన లేదా నకిలీ యాప్‌ల బారిన పడకుండా గూగుల్ మిమ్మల్ని రక్షిస్తుంది.
2. యూజర్ భద్రతకు అత్యంత ప్రాధాన్యత
గూగుల్ కేవలం పనికిరాని యాప్‌లను మాత్రమే తొలగించడం లేదు. మీ డేటాను దొంగిలించే లేదా మీ ఫోన్‌కు హాని కలిగించే యాప్‌లను కూడా తొలగించింది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం.. 2.36 మిలియన్ల (అంటే 23 లక్షలకు పైగా) ప్రమాదకరమైన యాప్‌లను ప్రారంభించకముందే బ్లాక్ చేశారు. అలాగే 1.58 లక్షలకు పైగా మోసపూరిత డెవలపర్‌లను నిషేధించారు. గూగుల్ ఇప్పుడు మనుషులు, AI రెండింటి ద్వారా యాప్‌లను తనిఖీ చేయడం ప్రారంభించింది. అంటే ఇకపై ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసినప్పుడు అది సురక్షితంగా ఉండే అవకాశం చాలా ఎక్కువ.
3. కొత్త నిబంధనలతో డెవలపర్ల స్వచ్ఛంద నిష్క్రమణ
2024లో యూరప్‌లో ఒక కొత్త రూల్ వచ్చింది. ప్రతి యాప్ డెవలపర్ తమ అసలు గుర్తింపును (పేరు, చిరునామా) తప్పనిసరిగా వెల్లడించాల్సి వచ్చింది. ఈ నిబంధనను పాటించని డెవలపర్‌లు స్వయంగా తమ యాప్‌లను తొలగించుకున్నారు. ఆపిల్‌పై కూడా ఈ రూల్ వర్తించినప్పటికీ అక్కడ ఇప్పటికే కఠినమైన విధానాలు ఉండటం వల్ల యాప్‌ల సంఖ్యపై పెద్దగా ప్రభావం చూపలేదు.
ప్లే స్టోర్‌లో ఇక మీదట సురక్షితకమైన యాప్‌లు మాత్రమే ఉంటాయని గూగుల్ స్పష్టం చేసింది.
Also Read : ఈ 8 యాప్స్ ఉంటే మీ బ్యాంక్ ఖాతా డబ్బులు హుష్ కాకినే.. వెంటనే డిలీట్ చేయండి