
MLA Vasantha Krishna Prasad: మొన్నటివరకూ క్రమశిక్షణ కలిగిన పార్టీ అయిన వైసీపీలో అనూహ్యంగా ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. అసంతృప్త రాగాలు బయటపడుతున్నాయి. హైకమాండ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 175 నియోజకవర్గాలకు 175 గెలుస్తామన్న ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఎపిసోడ్ తరువాత మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఆ జాబితాలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తో పాటు ఆయన తండ్రి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆగమేఘాల మీద తాడేపల్లి ప్యాలెస్ ను పిలిపించుకున్న జగన్ చర్చలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
2018 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వసంతకృష్ణ ప్రసాద్ కు మైలవరం టిక్కెట్ ఇచ్చారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి దేవినేని ఉమాపై కృష్ణప్రసాద్ గెలుపు సాధించారు. పార్టీ అన్నా.. అధినేత అన్నా వీర విధేయతతో ఉండే కృష్ణప్రసాద్ మూడున్నరేళ్ల తరువాత తన మనసు మార్చుకున్నారు. తన నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ కలుగజేసుకుంటుండడంతో కలత చెందారు. అందుకే అసమ్మతి గళాన్ని వినిపించడం ప్రారంభించారు. గుంటూరులో తొక్కిసలాట ఘటనకు సంబంధించి కామెంట్స్ చేశారు. కార్యక్రమ నిర్వాహకుడిపై కేసు, అరెస్ట్ ల పర్వాన్ని తప్పుపట్టారు. అదే సమయంలో తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు వసంత కృష్ణప్రసాద్ తండ్రి , మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు టీడీపీ ఎంపి కేశినేని నానితో భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. బాలక్రిష్ణ సినిమా వీరసింహారెడ్డి విడుదల సమయంలో వసంత కృష్ణప్రసాద్ పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది.
అయితే తాజాగా ఆయన తండ్రి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైసీపీలో కమ్మలకు ప్రాధాన్యం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అటు కృష్ణప్రసాద్ సైతం కొద్దిరోజులుగా సైలెంట్ అవ్వడంతో ఆయన టీడీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంది. వసంత కృష్ణ ప్రసాద్ కు లైన్ క్లీయర్ చేసేందుకు దేవినేని ఉమాను వేరే నియోజకవర్గానికి పంపిస్తారన్న టాక్ కూడా నడిచింది. ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ అలెర్ట్ అయ్యింది. ఎమ్మెల్యేతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేసింది. తన నియోజకవర్గంలో జోగి రమేష్ పెత్తనం చెలాయించడంపై కృష్ణప్రసాద్ గట్టిగానే తన వాదనలు వినిపించారు. దీంతో నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం గలాటగా మారింది.

ఈ నేపథ్యంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి వసంత కృష్ణప్రసాద్ కు సమాచారం వచ్చింది. దీంతో ఆయన తాడేపల్లి వెళ్లి జగన్ తో చర్చించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, మంత్రి జోగి రమేష్ మితిమీరిన జోక్యం, తన కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారం తదితర పరిణామాలను జగన్ కు వసంతకృష్ణప్రసాద్ వివరించినట్టు తెలుస్తోంది. అవన్నీ తాను చూసుకుంటానని..మీ పని మీరు చేసుకోండి అంటూ జగన్ భరోసా ఇచ్చినట్టు సమాచారం. దీంతో సమావేశం నుంబి బయటకు వచ్చిన వసంత కృష్ణప్రసాద్ తాను చివరి వరకూ జగన్ వెంటే ఉంటానని… వైఎస్ కుటుంబానికి వీర విధేయుడినని ప్రకటించారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ ను కలిసినప్పుడు ఇటువంటి మాటలే చెప్పారని.. ఇప్పుడు కృష్ణప్రసాద్ కూడా అదే బాటలో ఉన్నారన్న ప్రచారం అయితే సాగుతోంది. అతడు వైసీపీ కి గుడ్ బై చెప్పడం ఖాయమని.. టీడీపీలో చేరిక నిర్ణయం కూడా జరిగిపోయిందన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి.
Also Read:Mahasena Rajesh: మహాసేన రాజేశ్ పార్టీ మార్పు వార్తల్లో నిజమెంత?