జీవితం సంపూర్ణం కావాలంటే.. పెళ్లి చేసుకోవాల్సిందే. కాపురం పండాలంటే.. ‘తొలిరేయి’ జరగాల్సిందే. ఆ తర్వాత ప్రతిరేయీ నిత్యనూతనం కావాల్సిందే. ఇందుకోసం వధూవరులు ఎన్నో కలలు కంటారు. పెళ్లి తర్వాత జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలాంటి భాగస్వామిని మోసగిస్తే..? ఆ వేదన వర్ణనాతీతం. ఇలాంటి ఘటనే ఒకటి కర్నాటకలో చోటు చేసుకుంది.
అతనో బ్యాంకు ఉద్యోగి, ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్. 2018లో వీళ్లిద్దరికీ పెళ్లైంది. అంగరంగ వైభవంగా పెళ్లిసందడి ముగిసిన తర్వాత ఇంకేముంటుందీ? ‘‘ఎన్నాల్లో వేచిన చీకటి’’ అని పాటేసుకోవాల్సిందే. ఏర్పాట్లు కూడా చేశారు. వధువు కొత్త కోరికలతో గదిలో అడుగు పెట్టింది. అతగాడు మాత్రం ‘మడి కట్టుకు’ కూర్చున్నాడు.
ఆ విధంగా తొలిరేయి వట్టిగానే తెల్లారిపోయింది. మలిరేయి కూడా అంతే. మూడో రాత్రి కూడా అదే కథ. అది మూడు రోజులకు మాత్రమే పరిమితం కాలేదు. మూడు సంవత్సరాల వరకూ దారితీసింది. ఏమైందని భార్య అడిగితే.. తనకు అడిగినంత కట్నం ఇవ్వలేదన్నాడు. మరింత కట్నం తెస్తేనే.. డ్యూటీ చేస్తానన్నాడు. తల్లిదండ్రులకు చెప్పిన బాధితురాలు.. మరింత కట్నం కూడా తెచ్చింది.
అయినాగానీ.. వ్యవహారం ముందుకు సాగలేదు. మళ్లీ ఏమైందంటే.. ఇంకేదో చెబుతున్నాడు. అదీ అయిపోతే.. మరొకటి చెబుతున్నాడు. ఇలా మూడేళ్లు గడిచాయి. భార్యతో కన్నా.. ఫోన్లోనే ఎప్పుడూ మునిగిపోయి ఉంటున్నాడు. ఎవరితోనో అఫైర్ ఉన్నట్టుందని అనుమానించ సాగింది భార్య. ఒకరోజు అతను లేని సమయంలో ఫోన్ తెరచి చూస్తే.. గుండెలు పగిలిపోయాయి. అతనికి అఫైర్ ఉన్నమాట వాస్తవమే కానీ.. అమ్మాయితో కాదు. అబ్బాయిలతో! అవును.. అతగాడు గే. ఇదేంటని నిలదీయడంతో నేల చూపులు చూశాడు.
తీవ్రంగా దుఃఖించిన బాధితురాలు.. విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కింది. తనను మోసగించిన వారిని శిక్షించాలని కోరుతోంది. ఇతగాడికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. మొదటి అమ్మాయి కూడా ఈ కారణంగానే విడిపోయిందని సమాచారం. అంతా తెలిసీ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు. అందుకే.. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం ఉన్నోడు కదా అని.. ముందూ వెనకడా చూసుకోకపోతే అమ్మాయి జీవితాన్నే బలిపెట్టినవాళ్లు అవుతారు. తస్మాత్ జాగ్రత్త!