Revanth Reddy- Gangavva: గంగవ్వ.. ఒకప్పుడు ఎవరికీ పెద్దగా తెలియని పేరు.. మై విలేజ్ షోతో యూట్యూబ్ ప్రేక్షకులను ఆకట్టుకుని బిగ్‌బాస్‌లో సందడి చేసిన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది గంగవ్వ. అమాయక గంగవ్వ ప్రేమ, ఆప్యాయతకు కొదువ లేదు. అతిథులకు తెలంగాణ సంప్రదాయంలో మర్యాదలు చేస్తూ ఆకట్టుకుంటోంది గంగవ్వ. తాజాగా పాదయాత్ర ద్వారా కొండగట్టుకు వచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని గంగవ్వ కలిసింది. ఆమెతో పీసీసీ చీఫ్ చాలాసేపు మాట్లాడారు. తాను పాదయాత్రలో చూసిన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా.. గంగవ్వ రేవంత్ రెడ్డి ఆకలి తీర్చారు. ప్రేమతో మిర్చీ బజ్జీలు ఇచ్చారు. గంగవ్వ ప్రేమకు రేవంత్‌రెడ్డి ఫిదా అయ్యారు. జగిత్యాలకు వచ్చినప్పుడు నీ ఇంటికి వస్తా.. అని గంగవ్వకు హామీ ఇచ్చారు రేవంత్.
Also Read: Naveen Murder Case: నవీన్ హత్య కేసులో నిహారిక ప్రమేయం..అందరి చెవిలో ఇలా పూలు పెట్టింది!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర..
తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా.. రేవంత్ రెడ్డి వివిధ వర్గాల ప్రజలతో మమేకం అవుతూ.. ముందుకు సాగుతున్నారు. మంగళవారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్న రేవంత్‌రెడ్డి.. ఓ ప్రత్యేక అతిథిని కలిశారు. రేవంత్ తన క్యాంపులో ఉండగా.. గంగవ్వ అక్కడికి వెళ్లింది. రేవంత్‌రెడ్డిని ఆప్యాయంగా పలకరించింది. తాను తీసుకొచ్చిన మిర్చీ బజ్జీలు తీసి.. తిను బిడ్డ.. అని రేవంత్‌కు ఇచ్చింది.
పొంగిపోయిన టీపీసీసీ చీఫ్..
గంగవ్వ ప్రేమకు రేవంత్‌రెడ్డి పొంగిపోయారు. మిర్చీ బజ్జీలను తిన్నారు. అయితే.. ‘‘ఈ బజ్జీలు ఎట్ల ఉన్నయ్.. మీ భార్య చేసినట్టు ఉన్నయా.. ముసల్ది చేసినట్టు ఉన్నయా..’’ అని గంగవ్వ అడిగింది. రేవంత్ రెడ్డి నవ్వుతూ.. ‘‘మా అవ్వ చేసినట్టు ఉన్నయ్’’ అని సమాధానం చెప్పారు. దీంతో క్యాంపులో ఉన్న వారంతా నవ్వారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ములుగు ఎమ్మెల్యే సీతక్కకు కూడా గంగవ్వ మిర్చీ బజ్జీలు ఇచ్చి.. సరదాగా మాట్లాడింది. గంగవ్వ తన దగ్గరకు రావడంపై రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
ప్రేమను పంచిన అమ్మ..
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘గంగవ్వ.. తెలంగాణకు పరిచయం అక్కరలేని అవ్వ.. ప్రపంచానికి తనొక సెలబ్రిటీ. నాకు మాత్రం ప్రేమను పంచిన అమ్మ. నా కోసం ఆప్యాయంగా.. నాకిష్టమైన మిర్చీ బజ్జీ తెచ్చి.. తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది. ‘‘యాత్ర’’లో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా.. నా అనుభవాలను నా తల్లితో ఇలాగే ముచ్చటించే వాడిని. తల్లిని గుర్తు చేసిన గంగవ్వను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను’ అని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
తెలంగాణ ఆపాయ్యత.. గంగవ్వ ప్రేమ అట్లుంటది మరీ.. అని రీట్వీట్ చేస్తున్నారు నెటిజన్లు.
Also Read:Women’s Day 2023: మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు.. ఈ సంవత్సరం ప్రాధాన్యతేంటి?