Rahul Gandhi- Gaddar: మొన్ననే కదా ప్రజాయుద్ధం నౌక ప్రజాశాంతి పార్టీ నుంచి బహిష్కరణకు గురైంది.. అంతటి పాల్ మహాశయుడు ఏ హే బయటికి వెళ్లిపో అని వెళ్లగొట్టింది. దెబ్బకు ఆ ప్రజా యుద్ధనౌకకు కోపం తారస్థాయికి వెళ్ళింది. మీరేంటి నన్ను బయటకు వెళ్ళగొట్టేది నేనే ఒక పార్టీ పెడతా అంటూ భీష్మ ప్రతిజ్ఞలు చేశారు. అంతేకాదు అప్పటికప్పుడు ఒక పాట కూడా అందుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఖమ్మంలో జరిగిన సభలో కనిపించాడు. రాహుల్ గాంధీ వేదిక మీదికి రాగానే అతడికి గద్దర్ ను రేవంత్ రెడ్డి పరిచయం చేశాడు. తన జీవితంలో ఎన్నో ప్రజల బాధలకు సంబంధించిన పాటలు పాడిన గద్దర్.. ఒక్కసారిగా కమ్యూనిస్టు నుంచి బూర్జువా పార్టీ అవతారం ఎత్తుకున్నాడు. రాహుల్ ని చూడగానే తన్మయత్వానికి గురయ్యాడు. ఆలింగనం చేసుకున్నాడు. నుదుటి మీద ముద్దులు పెట్టాడు. అంతేకాదు రెండు నిమిషాలు చెవిలో ఏదో గుస గుస చెప్పాడు. చూసేవాళ్ళకు ఇది విచిత్రంగా అనిపించినప్పటికీ.. గద్దర్ లో అనూహ్య మార్పు ఊహించిందని ఒక సెక్షన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.
వాస్తవానికి గద్దర్ వామపక్ష భావజాలానికి ఆకర్షితుడైనవాడు. అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నవాడు. బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమానికి కారణమైనవాడు. ముదిగొండ కాల్పుల్లో కమ్యూనిస్టులు కన్నుమూస్తే కన్నీరు పెట్టినవాడు. అలాంటి గద్దర్.. కమ్యూనిజాన్ని భుజాన మోసినవాడు.. తన నోటి వెంట అత్యంత ఆశువుగా పాటలు పాడిన వాడు.. కానీ ఎందుకనో ఆ కమ్యూనిస్టు పోస్ట్ మీద, ఆ భావజాలం మీద విరక్తి పెంచుకున్నాడు. జీవితంలో దేవుడు అంటేనే శిలా అనుకుంటానని చెప్పినవాడు.. ఏకంగా కొమరవెల్లి మల్లన్న దగ్గరికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పట్లోనే పెరిగిన తన తెల్ల గడ్డాన్ని తొలగించినవాడు. భుజాన గొంగడి, ధోతి కట్టుకునే వ్యక్తి ప్యాంటు షర్టు ధరించాడు.. మొత్తానికి బొట్టు పెట్టుకొని కమ్యూనిజానికి నీళ్ళు వదిలాడు.. గద్దర్ లో ఇలాంటి మార్పు రావడానికి ప్రధాన కారణం అందులో ఉన్న నాయకులే. చాలా సంవత్సరాలకు ఓపిక పట్టిన అతడు ఇక తన వల్ల కాదు అనుకుని దాని నుంచి బయటికి వచ్చేసాడు.
రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకున్నప్పుడు చాలామంది కాంగ్రెస్లోకి వస్తాడు అనుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా అతనితో సంప్రదింపులు కూడా జరిపినట్టు సమాచారం. ముదిగొండలో పోటీ చేసిన గద్దర్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ బరిలో ఉంటాను ప్రతిజ్ఞ కూడా ఆ మధ్య చేశాడు. మరి ఈసారి రేవంత్ రెడ్డి గద్దర్ ను ఒకవేళ కాంగ్రెస్లో తీసుకొస్తే కెసిఆర్ మీద పోటీ చేయిస్తాడా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఎక్కడ ఎలాంటి ప్రజా ఉద్యమం జరిగిన తాను వాలిపోయి, తన గొంతుకతో జన వాణిని వినిపించేవాడు. మండే ఎండలో, వణుకు పుట్టించే చలిలో, నిండా ముంచే వానలో.. ఇలా ఎలాంటి పరిస్థితిలో అయినా తన గళాన్ని ప్రజా సమస్యల కోసం వినియోగించేవాడు. గద్దర్ గుండె చప్పుడు పేరుతో తనకంటూ ఒక శైలిని ఏర్పరచుకున్నాడు. అవంటి గద్దర్ నేడు రాహుల్ గాంధీకి ముద్దులు పెట్టి ఏకంగా ముద్దలు అయిపోయాడు. బషీర్బాగ్, ముదిగొండ ఘటనలను మర్చిపోయి తాను కూడా ఒక బూర్జువా పార్టీకి వంత పాడటం మొదలుపెట్టాడు. కాల మహిమ అంటే ఇదే కావచ్చు.