Jonny Bairstow Runout: గెలుపు కోసం ఆస్ట్రేలియా దొంగాట.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా బెయిర్ స్టో అవుట్..!

ఇంగ్లాండ్ జట్టు ఐదో రోజు తొలి సెషన్లో బ్యాటింగ్ చేస్తోంది. ఐదు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసిన దశలో.. క్రీజులో బెన్ స్టోక్స్, బెయిర్ స్టో క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో బౌలింగ్ కు వచ్చిన కామెరూన్ గ్రీన్ వేసిన బౌన్సర్ ను తప్పించుకునేందుకు.. బెయిర్ స్టో కిందకు వంగాడు. బంతి నేరుగా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లోకి వెళ్లిపోయింది.

Written By: BS, Updated On : July 3, 2023 11:35 am

Jonny Bairstow Runout

Follow us on

Jonny Bairstow Runout: లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు తోండాట ఆడిందా..? అంటే అవునన్నా సమాధానమే క్రికెట్ అభిమానుల నుంచి, మాజీ క్రికెటర్ల నుంచి వినిపిస్తోంది. దొంగాటతోనే ఆస్ట్రేలియా జట్టు రెండో టెస్టులో విజయం సాధించిందని అభిమానులు మండిపడుతున్నారు. యాషెస్ సిరీస్ లో భాగంగా జరిగిన రెండో టెస్టులో 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విజయం క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి ఆస్ట్రేలియా విజయం దక్కించుకుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గెలుపు కోసం ఆస్ట్రేలియా జట్టు అడ్డదారుల తొక్కుతుందన్న విమర్శలను మరోసారి వాస్తవం చేసిందంటూ పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా చేసిన తప్పేంటో..? అభిమానులు ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారో మీరూ చదివేయండి.

యాషెస్ సిరీస్ లో భాగంగా ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది. గత నెలలో జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు చివరి క్షణాల్లో విజయం నమోదు చేసుకుని సిరీస్ లో ఆధిక్యం ప్రదర్శించింది. తాజాగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా జట్టు 43 పరుగులు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసింది. అయితే, రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం వెనుక తొండాట ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అడ్డగోలు వ్యవహారాలతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించిందని మాజీ క్రికెటర్లు కూడా విమర్శిస్తున్నారు.

బెయిర్ స్టోను అవుట్ చేసిన విధానంపై విమర్శలు..

ఇంగ్లాండ్ జట్టు ఐదో రోజు తొలి సెషన్లో బ్యాటింగ్ చేస్తోంది. ఐదు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసిన దశలో.. క్రీజులో బెన్ స్టోక్స్, బెయిర్ స్టో క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో బౌలింగ్ కు వచ్చిన కామెరూన్ గ్రీన్ వేసిన బౌన్సర్ ను తప్పించుకునేందుకు.. బెయిర్ స్టో కిందకు వంగాడు. బంతి నేరుగా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లోకి వెళ్లిపోయింది. అయితే, బంతి కీపర్ చేతిలోకి వెళ్ళిపోవడంతో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న బెన్ స్టోక్స్ ను కలిసేందుకు జానీ బెయిర్ స్టో అటువైపుగా వెళ్ళాడు. ఈ క్రమంలో బెయిర్ స్టో క్రీజును వీడాడు. అయితే, కీపర్ బంతితో వికెట్లను కొట్టి గట్టిగా అప్పిలు చేశాడు. ఇది చూసిన బెయిర్ స్టో, స్టోక్స్ తోపాటు స్టేడియంలో ఉన్న అభిమానులు కూడా షాక్ అయ్యారు. బెయిర్ స్టో పరుగు తీయలేదు కాబట్టి ఇది నాటౌట్ గా ఎంపైర్ ప్రకటిస్తాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా థర్డ్ ఎంపైర్ ఎరాస్మస్ అవుట్ గా ప్రకటించాడు. బంతి డెడ్ కాలేదని భావించి స్టంప్ అవుట్ గా ప్రకటించాడు. దీంతో బెయిర్ స్టోతోపాటు మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులు కూడా షాక్ అయ్యారు.

ఆస్ట్రేలియా కెప్టెన్ తో చర్చించిన ప్రయోజనం శూన్యం..

ఈ విధంగా స్టంప్ అవుట్ చేయడం అనైతికమంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ తో జానీ బెయిర్ స్టో, స్టోక్స్ ఎంత మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఇంగ్లాండ్ జట్టు.. బెయిర్ స్టో క్రీజులో ఉంటే ఇబ్బందులు తప్పవని భావించిన ఆస్ట్రేలియా జట్టు.. ఈ అప్పీల్ పై వెనక్కి వెళ్లలేదు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఆస్ట్రేలియా కు తెలిసిన విజయమే తమకు ముఖ్యమైన భావనతో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కమిన్స్ ఇలా వ్యవహరించాడు. ఈ మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులైతే ఆస్ట్రేలియా జట్టు వ్యవహార శైలిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ తరహా ఆటతో సాధించే విజయాలు కూడా.. విజయాలేనా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఆస్ట్రేలియా చేసిన ఈ పనిని మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, గౌతమ్ గంభీర్లు కూడా తీవ్రంగా తప్పుపట్టారు. ఈ వికెట్ పడిన తర్వాత కసిగా ఆడిన స్టోక్స్ సిక్సర్లతో చెలరేగిపోయి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయినప్పటికీ చివరి దశలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 43 పరుగులు తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.