Inturi Chinna: రండి బాబూ రండి.. చికెన్, మటన్, ఫిష్,.. అన్ని ఫ్రీగా తినేయండి.. ఆలసించినా ఆశాభంగం.. మీ ఇంటిల్లి పాది తో రండి. వచ్చి హాయిగా కడుపునిండా తినండి. ముక్కలు కూడా గట్టిగా వేస్తాం. నల్లి బొక్కలు ప్లేట్ నిండా పెడతాం. కోడికూర వేపుడు కోరినంత పెడతాం. వేయించిన చేప ముక్కలు వద్దనంతవరకూ వేస్తూనే ఉంటాం. బగారా అన్నం పొట్ట పగిలేంతవరకు పెడుతూనే ఉంటాం. పప్పు, సాంబార్ లాంటివి అసలు పోయనే పొయ్యం. మాకు కావాల్సింది మీరు కడుపునిండా తినడమే. ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు? ఈ వంటకాలు ఎక్కడ వడ్డిస్తున్నారు? ఫ్రీ అని చెబుతున్నారు అంత దానకర్ణుడు ఎవరు? ఉచిత భోజనాలు అంటే పప్పు, సాంబారు పోస్తారు. మరి ఈ ముక్కలతో భోజనాలు ఏంటని అనుకుంటున్నారా.. పై ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలా? అయితే చదివేయండి ఈ కథనం.
ఎన్నికలంటే ఓటర్లకు పండుగ. పోటీలో ఉండే వారికి ఖర్చు. ఒకప్పుడు అంటే ఎన్నికల ముందు మాత్రమే అభ్యర్థులకు ఖర్చు ఉండేది. ఇప్పుడు ఏడాది ముందు నుంచే ఆ పరిస్థితి. అందుకే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల పాట్లు పడుతున్నారు. అయితే ఈ పాట్లన్నీ ప్రస్తుతం తెలంగాణలో కావు. తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కినప్పటికీ అభ్యర్థులు ఇంకా ఆశించిన స్థాయిలో రంగంలోకి దిగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థులు ఇప్పటినుంచే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే సాధారణంగా ఎన్నికల ప్రచార నిర్వహించే అభ్యర్థులు తమ వెంట వచ్చే ఓటర్లకు ఎంతో కొంత డబ్బులు పంచుతారు. కానీ ఈ నియోజకవర్గంలో డబ్బులు కాకుండా పొట్ట నిండా అన్నం పెడుతున్నారు. అందుకు అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి పోటాపోటీగా క్యాంటీన్లు ఏర్పాటుచేసి.. ఓటర్లకు షడ్రసోపేతమైన విందును అందిస్తున్నారు.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్లు ఉండేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తొలగించింది. అయితే జగ్గయ్యపేటలో 2019లో జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను విజయం సాధించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకించలేరు కాబట్టి.. అన్న క్యాంటీన్లు తొలగించిన తర్వాత ఓటర్లలో ఆగ్రహం పెరిగింది కాబట్టి.. దానిని చల్లార్చేందుకు ఆయన రాజన్న పేరుతో క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఎనిమిది నెలలుగా నియోజకవర్గ కేంద్రంలో ప్రజలకు రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి తో కూడిన మెనూతో భోజనాలు పెడుతున్నారు. రోజుకు సుమారు 1000 మంది దాకా ఇలా సామినేని ఉదయభాను ఏర్పాటు చేసిన రాజన్న క్యాంటీన్లలో భోజనం చేస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఓడిపోయిన టిడిపి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య అన్న క్యాంటీన్ ను తన సొంత ఖర్చుతో కొనసాగిస్తున్నారు.. రోజుకు సుమారు 2000 మంది వరకు ఆయన శాఖాహారంతో కూడిన భోజనాలు పెడుతున్నారు. దాదాపు ఏడాదిన్నర నుంచి ఆయన ఈ తరహా భోజనాలు పెడుతున్నారు. అయితే టిడిపిలోనే మరో నాయకుడు ఇంటూరి చిన్నా విభిన్నంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే శ్రీరామ్ తాతయ్య, సామినేని ఉదయభాను లాగా కాకుండా ఓటర్లకు మాంసాహార భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే ప్రతి ఆదివారం మాత్రమే ఈ అవకాశం కలిపించారు. చికెన్, పిష్, మటన్ మెనూతో వేలాది మందికి ఆయన భోజనాలు పెడుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన గతంలో జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ గా పని చేశారు. ఈసారి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి కాకుండా తమ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం దృష్టిలో పడే విధంగా నాన్ వెజ్ భోజనాలు నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్నారు. ఇక ఇంటూరి చిన్నా ఏర్పాటు చేసిన నాన్ వెజ్ భోజనశాల వద్ద నియోజకవర్గ ఓటర్లు బారులు తీరుతున్నారు..అసలే ఆదివారం.. ఆపై ముక్కల భోజనం.. ఓటర్లు లొట్టలేసుకుంటూ తింటున్నారు. ఇక ముగ్గురు అభ్యర్థులు ఆర్థికంగా స్థితిమంతులు కావడంతో ఒకరికి మించి ఒకరు అనే లాగా భోజనాలు పెడుతున్నారు. 2024 లో జరిగే ఎన్నికల్లో ఎవరి వైపు ఓటర్లు మొగ్గుతారో వేచి చూడాల్సి ఉంది.